logo

బంజారాల పుణ్యక్షేత్రం.. కొత్తపల్లి దీక్షభూమి

బంజారా - లంబాడాల ఆరాధ్య దైవం శ్రీసంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ అడుగుజాడల్లో అధ్యాత్మిక మార్గాన్ని అనురించి శ్రీసంత్‌ ప్రేంసింగ్‌ మహరాజ్‌ 1976లో జనవరి 11న కెరమెరి మండలం శంకర్‌లొద్దిలో గురు రామారావు మహరాజ్‌ ఆశీస్సులను అందుకున్నారు.

Published : 11 Jan 2023 04:16 IST

నేడు శ్రీసంత్‌ ప్రేమ్‌సింగ్‌ మహరాజ్‌ 44వ గురుకృప దినోత్సవం
న్యూస్‌టుడే, నార్నూర్‌

కొత్తపల్లిలోని దీక్షభూమి సంస్థానం

బంజారా - లంబాడాల ఆరాధ్య దైవం శ్రీసంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ అడుగుజాడల్లో అధ్యాత్మిక మార్గాన్ని అనురించి శ్రీసంత్‌ ప్రేంసింగ్‌ మహరాజ్‌ 1976లో జనవరి 11న కెరమెరి మండలం శంకర్‌లొద్దిలో గురు రామారావు మహరాజ్‌ ఆశీస్సులను అందుకున్నారు. అప్పటి నుంచి ఏటా ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌ మండలం కొత్తపల్లి (హెచ్‌) దీక్షాభూమిలో బంజారా సమాజం గురుకృప దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. జనవరి 11న దేశంలోని వివిధ ప్రాంతాల బంజారా, లంబాడాలు భారీ సంఖ్యలో తరలివస్తారు.

శ్రీసంత్‌ ప్రేమ్‌సింగ్‌ మహరాజ్‌ ఘమాబాయి, లచ్మాభంగీ దంపతులకు 1944లో జన్మించారు. రైతు కుటుంబం. వ్యవసాయం చేస్తూనే ఆధ్మాత్మిక మార్గంపైపు నడిచారు. 1979లో ఇంటి నుంచి వెళ్లిపోయి శంకర్‌లొద్ది అటవీ ప్రాంతంలో ఓ ఏడాది పాటు తపస్సు చేశారు. మహారాష్ట్ర పౌరాదేవీ పీఠాధిపతి గురు శ్రీసంత్‌ రామారావు మహరాజ్‌ స్వయంగా వచ్చి ప్రేంసింగ్‌ను ఆశీర్వదించారు. అప్పటి నుంచి వివిధ రాష్ట్రాల్లో కాలినడకన పర్యటించి ఆధ్యాత్మిక బోధనలతో సమాజాన్ని చైతన్యం చేశారు. 1992లో కొత్తపల్లిలో జగదాంబదేవీ మఠాన్ని ఏర్పాటు చేశారు. వేలాది మంది భక్తులకు సేవాలాల్‌ దీక్షలు ఇచ్చారు. అప్పటి నుంచి దీక్షలు స్వీకరించడం ఆనవాయితీగా వస్తోంది. సంత్‌ ప్రేంసింగ్‌ మహరాజ్‌ను దీక్షా గురువుగా, కొత్తపల్లి దేవీ మఠానికి ‘దీక్షభూమి’గా పేరు వచ్చింది.


ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలి
- శ్రీసంత్‌ ప్రేమ్‌సింగ్‌ మహరాజ్‌

ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తేనే జీవితానికి ప్రతిఫలం ఉంటుంది. జగదాంబదేవి కృప, ఆరాధ్య దైవం శ్రీసంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ బోధన, శ్రీసంత్‌ రామారావు మహరాజ్‌ ఆశీస్సులతోనే యావత్‌ దేశంలోని బంజారా-లంబాడీ సమాజాన్ని చైతన్యపరుస్తున్నాం. వేలాది మంది భక్తులు ఏటా జనవరి 11న ‘గురుకృప’ దినోత్సవానికి వచ్చి భోగ్‌-భండారో కార్యక్రమంలో పాల్గొంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని