logo

ఆకాశంలో సగం.. ఆరుగురికే అవకాశం

ఆకాశంలో సగం అంటూ మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. 

Updated : 01 Nov 2023 05:57 IST

ఆకాశంలో సగం అంటూ మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. స్థానిక సంస్థల్లో నారీమణులది సగ భాగం కావడంతో.. తమ సమర్థ పాలనతో రాజకీయాల్లో రాణిస్తూ ప్రతీ ఒక్కరిచే శెహభాష్‌ అనిపించుకుంటున్నారు. పురుషులతో సమానంగా అన్ని రంగాలతో పాటు రాజకీయాల్లోనూ రాణిస్తున్నా చట్ట సభల్లో మాత్రం వీరి ప్రాతినిధ్యం అంతంతమాత్రమే ఉంటోంది. డెబ్బై ఏళ్లుగా చట్ట సభలకు ఎన్నికలు జరుగుతున్నా... ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో చట్ట సభల్లో అడుగు పెట్టింది ఆరుగురు మాత్రమే. పార్లమెంటులో ఇటీవల మహిళా బిల్లు ప్రవేశపెట్టడంతో... ఇది చట్టరూపం దాలిస్తేనే మహిళల ప్రాతినిధ్యం పెరిగే అవకాశముంది. అన్ని రాజకీయ పార్టీలు మహిళల సంక్షేమం కోసం తాము ఎన్నో పథకాలు తీసుకువచ్చామని ఊదరగొడుతున్నాయి. మహిళల అభివృద్ధే తమ లక్ష్యమంటూ ఎన్నికల మేనిఫెస్టోలు రచిస్తున్నారు. అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలను.. చట్టసభల్లో రాణించేలా ఏ రాజకీయ పార్టీ చిత్తశుద్ధి చూపడం లేదు. పురుషుల కన్నా మహిళలే ఓట్లే ఎక్కువగా ఉన్న వీరికి తగు ప్రాతినిధ్యం ఇవ్వడం లేదు..  

న్యూస్‌టుడే, దండేపల్లి

ఏడు దశాబ్దాల కాలంలో  

1952 నుంచి ఉమ్మడి జిల్లాలో శాసనసభలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రారంభంలో అయిదు నియోజకవర్గాలు ఉండగా... ప్రస్తుతం పది నియోజకవర్గాలున్నాయి.. ఇప్పటివరకు జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో మొత్తం ఆరుగురు మహిళలు మాత్రమే ఎన్నికయ్యారు. ఇందులో అత్యధికంగా ఆసిఫాబాద్‌ నుంచి ముగ్గురు, ఖానాపూర్‌ నుంచి ఇద్దరు, సిర్పూర్‌ నుంచి ఒక మహిళా ఎమ్మెల్యే గెలుపొందారు.

  • ఆసిఫాబాద్‌ నుంచి 1999 సంవత్సరంలో తెదేపా నుంచి పాటి సుభద్ర గెలుపొందారు.. ఆ తర్వాత 2004లో శ్రీదేవి, 2014లో కోవ లక్ష్మి గెలుపొందారు.
  • ఖానాపూర్‌ నియోజకవర్గం నుంచి 2008 ఉప ఎన్నికలు, 2009 సాధారణ ఎన్నికల్లో సుమన్‌ రాఠోడ్‌ రెండు సార్లు వరుసగా గెలుపొందారు. ఇదే నియోజకవర్గం నుంచి 2014, 2018లో వరుసగా రెండు సార్లు ఆజ్మీరా రేఖానాయక్‌ గెలుపొందారు.
  • సిర్పూర్‌ నుంచి 1999లో పాల్వాయి రాజ్యలక్ష్మి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
  • సిర్పూర్‌, ఆసిఫాబాద్‌, ఖానాపూర్‌ మినహా ఇతర ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి  ఒక మహిళా కూడా చట్టసభలో అడుగుపెట్టలేదు. అందరూ పురుషులే అసెంబ్లీకి వెళ్లారు.

 

స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ ఉండటంతో రిజర్వేషన్‌లో సర్పంచి ఇతర స్థానిక సంస్థల్లో సీట్లు కేటాయిస్తున్నారు. మహిళలు కొన్ని చోట్ల ముందుకు రాకున్నా పురుషులే తమ భార్యలు, ఇతర మహిళా బంధువులను రంగంలోకి దింపి  వెనుక ఉండి నడిపిస్తున్నారు. చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీ (అది కూడా పురుషులు, మహిళలు ఎవరైనా పోటీ చేయవచ్చు) అభ్యర్థులకు మాత్రమే రిజర్వేషన్‌ ఉండటంతో పురుషుల ప్రాతినిధ్యమే ఉంటోంది. పురుషుల కన్నా మహిళలు ఎక్కువగా ఓట్లున్నా రాజకీయ పార్టీలు మహిళలకు చట్ట సభల్లో సముచిత స్థానం కల్పించడం లేదు. కేంద్రం ప్రవేశపెట్టిన మహిళా బిల్లు చట్టరూపం దాల్చి అమలైతేనే ప్రాతినిధ్యం పెరగనుంది.

 


ఈ సోలిస్టు..వెరీ స్పెషలిస్టు..!

గోపిడి గంగారెడ్డి

గోపిడి గంగారెడ్డి అలియాస్‌ అరిగెల (అర్లి) గంగారెడ్డి ఈ పేరు తెలియని పాత తరం జిల్లాలో లేరంటే అతిశయోక్తి కాదు. సాధారణ జీవితానికి అలవాటుపడిన ఈయన అప్పటికీ ఇప్పటికీ ఆదర్శమే. రాజకీయాల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించినా.. ఆయన మాత్రం రైతు సాధారణ జీవితం గడిపారు. వేషధారణలో, జీవనశైలిలో తనకంటూ ప్రత్యేకత చాటుకున్నారు. ఉద్యమకారునిగా, అభ్యుదయవాదిగా ఆయన రాజకీయ ప్రస్థానం సాగింది. దేశానికి స్వాతంత్య్రం కోరుతూ జరిగిన సమయంలో చురుగ్గా పాల్గొన్నప్పుడు ఆయన సమరయోధుడు. రాజకీయాల్లో ప్రవేశించినప్పుడు సోషలిష్టు. కాంగ్రెస్‌ ప్రభంజనానికి ఎదురొడ్డి నిలిచి గెలిచిన పోరాట యోధుడు. తలపాగా చుట్టి కనిపించే ఈయన ఛత్రపతి శివాజీని స్పురింపజేసేవారు. చదువుకునే రోజుల్లోనే పాఠశాల గేట్లపై జాతీయజెండా ఎగురవేసిన సాహసుల్లో ఈయన ఒకరు. ఈ కారణంగా తెల్లదొరల చేతుల్లో దెబ్బలు తిన్నారు. ఆసిఫాబాద్‌ జైలులో శిక్ష అనుభవించారు. ఆ తర్వాత లాహోర్‌కు ఆయుధాలు సరఫరా చేస్తున్న సందర్భాల్లో పట్టుబడి షోలాపూర్‌ కారాగారాల్లో శిక్ష అనుభవించారు. స్వాతంత్య్ర అనంతరం 1952లో జరిగిన సాధారణ ఎన్నికల్లో నిర్మల్‌ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించిన ఇద్దరిలో ఆయన ఒకరు. సోషలిస్టు అభ్యర్థిగా పోటీ చేసిన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ముథోల్‌ నియోజకవర్గం అప్పటికీ ఇంకా ఏర్పాటుకాలేదు. నిర్మల్‌ నియోజకవర్గానికి గంగారాం, గోపిడి గంగారెడ్డిలు ఇద్దరు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. ఇద్దరూ సోషలిస్టూలే. ముథోల్‌ నియోజకవర్గం ఏర్పడిన తొలి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1957లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్‌ అభ్యర్థి రంగారావును ఓడించారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరి 1962లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిపై గెలుపొందారు. పార్టీ పరంగానైనా, స్వతంత్ర అభ్యర్థిగానైనా గెలుపు తనదేనని చాటిచెప్పాడు. గుర్రంపై స్వారీ, వండని శాకాహారంతో తన స్పెషలిజాన్ని చూపారు. సమరయోధులకు పింఛన్ల కోసం నర్సాపూర్‌(జి)లో 20 రోజుల పాటు నిరాహరదీక్ష చేపట్టారు. శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనా స్వగ్రామాన్ని వీడక వ్యవసాయాన్ని మానకుండా ఆదర్శంగా నిలిచాడు. ఏడేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందారు. 

న్యూస్‌టుడే, నిర్మల్‌


శబ్ద తీవ్రత పెరిగిందా..కేసు నమోదే..

చెన్నూరు, న్యూస్‌టుడే:" ఎన్నికలు వచ్చాయంటే చాలు మైకులు హోరెత్తుతాయి. ఎక్కడ చూసినా ప్రచార సాధనాల మోత చెవుల్లో మార్మోగుతుంది. ఇది ప్రజలకు ఎంతో ఇబ్బందిని కలిగిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని చట్టపరంగా ఏ మేరకు ధ్వని వినియోగించాలో నిబంధనలను ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ సారి ఎన్నికల్లో అతి శబ్దంతో ఊదరగొడితే చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అభ్యర్థులు, ఆయన తరఫున ప్రచారం చేసేవారు ఈ అంశంలో జాగ్రత్తపడాల్సిందే. లేకుంటే కేసుల మోత తప్పదు. ఏ ప్రాంతంలో ఎంత శబ్దం వినియోగించాలో.. ఎన్ని డెసిబెల్స్‌ను మించకుండా ఉండాలో నిబంధనలు రూపొందించారు. దీని ప్రకారం నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలతోపాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.


ఒకే గూటికి చేర్చి.. ఓటు హక్కు కల్పించి

ఎన్నికల సమయంలో పోటీలో ఉన్న అభ్యర్థులకు ప్రతి ఓటు కీలకమే. ఒక్కదాంతోనూ గెలుపోటములు ఆధారపడి ఉంటాయి అనేది అందరికి తెలిసిందే. అందుకే పోటీలో ఉన్నవారు ఓటును అభ్యర్థించడంతో పాటు లేనివారికి దగ్గరుండి దరఖాస్తు చేయిస్తుంటారు. చాలామంది సొంత ఊరును వదిలిపెట్టి ఏళ్లు గడిచినా ఓటును మాత్రం తమ పరిధిలోనే ఉంచాలంటూ నాయకులు కోరుతుంటారు. ఎన్నికల వేళ ఓటును వినియోగించుకునేందుకు రావాలంటూ గుర్తుచేస్తుంటారు కూడా. మంచిర్యాల నియోజకవర్గానికి చెందిన ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి విజయావకాశానికి ఏ ఒక్క ప్రయత్నాన్ని వదలడం లేదు. తన కుటుంబసభ్యులందరిని ఒకే చోటకు చేర్చుకున్నారు. దరఖాస్తు చేయించి ఓటు హక్కు కల్పించుకున్నారు. ఏకంగా ఒకే ఇంటి నంబర్‌పై 22 ఓట్లు ఉండటం విశేషం. గెలుపులో ఈ ఓట్లు కూడా ప్రధానం కావచ్చు మరీ..  

న్యూస్‌టుడే, మంచిర్యాల సిటీ


ఈ సారి సులువుగా ‘గుర్తు’పడతారు

ఎన్నికల్లో గెలుపోటములను ఎన్నో అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. అన్నీ సవ్యంగా ఉన్నా ఈవీఎంలో తమకు నచ్చిన అభ్యర్థి గుర్తు విషయంలో కొందరు అయోమయానికి గురవుతుంటారు. గుర్తును పోలిన గుర్తు మరోటున్నా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఈ సారి ఎన్నికల సంఘం పార్టీ గుర్తుతోపాటు అభ్యర్థి ఫొటోనూ ఈవీఎంలో నిక్షిప్తం చేస్తుండటంతో నాయకులకు కలిసొచ్చే అంశం. ఓటరుకు నచ్చిన వ్యక్తి ఫోటో ఓటు వేసే సమయంలో కనిపించే సరికి ఆ సమయంలో నిర్ణయం మార్చుకునే వారూ ఉంటారు. ప్రజల్లో ఉంటూ.. గ్రామాల్లో తిరిగే నాయకులను సామాన్యులు సైతం గుర్తిస్తారు.

న్యూస్‌టుడే, మామడ


ఒకే మండలం.. ఇద్దరు ఎమ్మెల్యేలు..

నిర్మల్‌ జిల్లాలో 2016లో చేపట్టిన నూతన మండలాల ఏర్పాటులో భాగంగా ముథోల్‌ నియోజక వర్గంలోని  కుంటాల మండలం నుంచి ఎనిమిది గ్రామాలు, నిర్మల్‌ నియోజకవర్గంలోని  దిలావర్‌పూర్‌ మండలంలోని అయిదు గ్రామాలతో కలిపి నర్సాపూర్‌(జి) నూతన మండలాన్ని  అధికారులు ఏర్పాటు చేశారు. ఈ మండలానికి ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే..ఈ మండలానికి ముథోల్‌, నిర్మల్‌ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. రెండు నియోజకవర్గాల్లోని వేర్వేరు మండలాల గ్రామాలు ఉండటమే ఇందుకు కారణం. 

న్యూస్‌టుడే, దిలావర్‌పూర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని