logo

శుద్ధజలంపై శ్రద్ధ

పంచాయతీల్లో కలుషిత నీటి సరఫరాను నివారించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇకపై ప్రతిరోజు తాగు నీటిని పరీక్షించాకే సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Published : 23 Apr 2024 02:45 IST

పంచాయతీల్లో తాగునీటి పరీక్షకు కిట్ల సరఫరా

భీంపూర్‌ ఎంపీడీఓ కార్యాలయంలో అర్లి(టి) పంచాయతీ సిబ్బందికి క్లోరోస్కోప్‌ కిట్‌ను అందజేస్తున్న అధికారులు

న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ అర్బన్‌: పంచాయతీల్లో కలుషిత నీటి సరఫరాను నివారించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇకపై ప్రతిరోజు తాగు నీటిని పరీక్షించాకే సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం మిషన్‌ భగీరథ ఆధ్వర్యంలో ప్రతి పంచాయతీకి క్లోరోస్కోప్‌ కిట్లను అందజేసింది. రానున్నది వర్షాకాలం కావడంతో తాగునీరు కలుషితమైతే అతిసారం, కలరా తదితర అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో ప్రతి గ్రామంలో మిషన్‌ భగీరథ నుంచి వచ్చే నీటిని పరీక్షించిన తర్వాతనే ఇళ్లకు సరఫరా చేయనున్నారు. ఇందుకోసం పంచాయతీ సిబ్బందికి తాగునీటిని ఎలా పరీక్షించాలో తర్ఫీదు సైతం ఇచ్చారు.

లీకేజీలతో కలుషితం

నిర్మల్‌ జిల్లా శ్రీరాంసాగర్‌ జలాశయం నీటిని దిలావర్‌పూర్‌ మండలం మాటేగావ్‌ వద్ద శుద్ధి చేసి జిల్లాకు పంపిణీ చేస్తున్నారు. పైపుల ద్వారా వంద కిలోమీటర్లకు పైగా దూరం నుంచి వస్తుండటంతో నీటిలోని క్లోరిన్‌ శాతం పడిపోతోంది. మధ్యలో ఎక్కడైనా పైపులకు లీకేజీలు ఏర్పడితే బురద చేరి నీరు కలుషితమవుతోంది. ట్యాంకు వద్ద క్లోరిన్‌ శాతం 1.0 శాతం, మధ్యలో 0.5 శాతం, నల్లా ద్వారా ఇంటికి చేరే సమయంలో 0.2 శాతం క్లోరిన్‌ ఉంటే ఆ నీరు సురక్షితమైనవి. ఒకవేళ తాగునీటిలో క్లోరిన్‌ శాతం పడిపోతే ఎక్కడైనా లీకేజీలు ఏర్పడినప్పుడు బ్యాక్టీరియా పెరిగే ప్రమాదముందని అధికారులు పేర్కొంటున్నారు. దీన్నిబట్టి తాగునీటిలో అవసరమైన మోతాదును బట్టి క్లోరినేషన్‌ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. పంచాయతీలకు ఇచ్చిన కిట్లతో ప్రస్తుతం క్లోరిన్‌ శాతాన్ని మాత్రమే పరీక్షించే వెసులుబాటు ఉంది. ఇతర పరీక్షలకు ఆ నీటి నమూనాను మిషన్‌ భగీరథ ల్యాబ్‌కు పంపాల్సి ఉంటుంది.

పరీక్ష విధానం

క్లోరోస్కోప్‌ కిట్‌లో నీటిని పరీక్షించేందుకు 50 ఎంఎల్‌ రియేజెంట్‌ రసాయనం, రెండు గాజు పరీక్ష నాళికలు, వాటిని శుభ్రం చేసేందుకు ఒక బ్రష్‌ ఉన్నాయి. నీటిని పరీక్షించాక క్లోరిన్‌ శాతం ఎంత మోతాదులో ఉందో తెలుసుకునేందుకు చార్టు ఉంది. గ్రామంలో మిషన్‌ భగీరథ ట్యాంకు వద్ద గాజు పరీక్ష నాళికలో 5 ఎంఎల్‌ నీటిని తీసుకుని అందులో నాలుగు చుక్కల రసాయనం కలపాలి. ఆ నీరు రంగు మారగానే చార్టులో సూచించిన క్లోరిన్‌ ఎంత శాతం ఉందో చూడాలి. నీటి ట్యాంకు పరిమాణానికి అనుగుణంగా బ్లీచింగ్‌ పౌడర్‌ కలపాల్సి ఉంటుంది. ఒకవేళ 10 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకుకు ఒక బకెట్‌లో పది లీటర్ల నీటిని తీసుకుని అందులో 40 గ్రాముల బ్లీచింగ్‌ పౌడర్‌ను కలపాలి. 5 వేల లీటర్ల నీటికి 20 గ్రా. బ్లీచింగ్‌ పౌడర్‌, 20 వేల లీటర్లకు 80 గ్రా, 30 వేల లీటర్లకు 120 గ్రా, 50 వేల లీటర్లకు 200 గ్రాముల చొప్పున బ్లీచింగ్‌ పౌడర్‌ను కలిపి క్లోరినేషన్‌ చేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని