logo

నిధులు రాక.. నిర్వహణ లేక

రైతులకు పండ్ల తోటల పెంపకంపై శిక్షణ ఇవ్వడం, మొక్కల ఉత్పత్తి కోసం ఏర్పాటు చేసిన ఉద్యానవన నర్సరీ, రైతు శిక్షణ కేంద్రాలు నిర్వహణ లోపంతో మూతపడే దశకు చేరుకున్నాయి.

Published : 28 Apr 2024 03:29 IST

మూసివేత దశలో ఐటీడీఏ ఉద్యానవన కేంద్రాలు

జంబుగా ఉద్యానవన కేంద్రం

న్యూస్‌టుడే, కాగజ్‌నగర్‌గ్రామీణం : రైతులకు పండ్ల తోటల పెంపకంపై శిక్షణ ఇవ్వడం, మొక్కల ఉత్పత్తి కోసం ఏర్పాటు చేసిన ఉద్యానవన నర్సరీ, రైతు శిక్షణ కేంద్రాలు నిర్వహణ లోపంతో మూతపడే దశకు చేరుకున్నాయి. కాగజ్‌నగర్‌, ఆసిఫాబాద్‌లలోని ఐటీడీఏ ఉద్యానవన కేంద్రాల్లో పెంచిన పండ్ల మొక్కల విక్రయం, తోటలతో రూ.లక్షల ఆదాయం వచ్చినా అందులో తోటల అభివృద్ధికి నయా పైసా కేటాయించకపోవడంతో అందాల తోటలకు చీకటి రోజులు వచ్చాయి. ఈ కేంద్రాలపై ఆధారపడిన కూలీలను సైతం తొలగించడంతో నిర్వహణ లేకుండా పోయింది.

కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలంలోని జంబుగా, ఆసిఫాభాద్‌ జిల్లా కేంద్రంలో సమగ్ర గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 1989 సంవత్సరంలో ఉద్యానవన నర్సరీ, రైతు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జంబుగాలో 86 ఎకరాల్లో, ఆసిఫాబాద్‌ కేంద్రంలో 27 ఎకరాల్లో మామిడి, నిమ్మ, సపోటా తోటలను పెంచారు. హైబ్రీడ్‌ బంగన్‌పల్లి, దసేరి మామిడి మొక్కలు అంటుకట్టు విధానంలో ఉత్పత్తి జరిగేది. అప్పట్లో జంబుగాలో 25 నుంచి 30 మంది కూలీలు, ఆసిఫాబాద్‌లో 10 నుంచి 15 మంది కూలీలు పనిచేసే వారు. వివిధ రాయితీ పథకాల ద్వారా మామిడి తోటల పెంపకం చేపట్టే రైతులకు ఈ కేంద్రాల్లో పెంచిన మామిడి మొక్కలను అందించేవారు. ఉమ్మడి ఆదిలాబాద్‌తోపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలకు మొక్కలు సరఫరా చేసిన చరిత్ర ఈ కేంద్రాలది. వీటి నిర్వహణకు పదేళ్లుగా నయాపైసా కేటాయించకపోవడంతో అధ్వానస్థితికి చేరుకున్నాయి.

ఎదుగుదల లేని జామ మొక్కలు

గతంలో రూ.20 లక్షల వరకు ఆదాయం

జిల్లాలోని ఈ రెండు కేంద్రాల్లో మొక్కలు, తోటలకు నీటితడులు అందించడానికి, కలుపు మొక్కలు తొలగించడానికి కూలీలు లేనందున రోజురోజుకూ అధ్వాన స్థితికి చేరుకున్నాయి. నీటితడులు లేక పూత, కాత లేకుండా పోయింది. గతంలో మామిడి మొక్కల విక్రయం, నిమ్మ, మామిడి, సపోట పండ్ల విక్రయంతో ఏడాదికి రూ.15 లక్షల నుంచి 20 లక్షల వరకు ఆదాయం వచ్చేది. ఉద్యానవన, నర్సరీ, రైతు శిక్షణ కేంద్రాల నిర్వహణకు నయాపైసా కేటాయించడం లేదు. దీంతో ఈ కేంద్రాల్లోని పండ్ల తోటల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. దీర్ఘకాలిక ప్రయోజనాలు కల్పించే పండ్లతోటల పెంపకంపై రైతులను ప్రోత్సహించాలనే ఆశయంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలను జిల్లాస్థాయి అధికారులు ఏ ఒక్కనాడు క్షేత్రస్థాయిలో పరిశీలించకపోవడం గమనార్హం. పాలకులు, అధికారులు స్పందించి ఐటీడీఏ ఉద్యానవన కేంద్రాలకు పూర్వ వైభవం వచ్చేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిణి చొరవ తీసుకోవాలి

జిల్లాలోని ఉద్యానవన నర్సరీలు, రైతు శిక్షణ కేంద్రాల అభివృద్ధికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోనందున ఇవి మూసివేత దశకు చేరుకున్నాయి. ప్రస్తుత ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిణి చొరవ తీసుకుని అభివృద్ధికి చర్యలు చేపట్టాలి. నిధులు కేటాయించాలి. వీటికి పూర్వ వైభవం తీసుకు వచ్చినట్లయితే స్థానిక కూలీలకు ఉపాధి లభించడంతోపాటు సర్కారుకు ఆదాయం వస్తుంది.  

ఠాకూర్‌ నాగేందర్‌, రైతు, గువ్వలగూడ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు