logo

ఎన్నికలకు సమాయత్తం

ఆదిలాబాద్‌ పార్లమెంటు పరిధిలోని జిల్లాలోని నిర్మల్‌, ముథోల్‌, ఖానాపూర్‌ నియోజకవర్గాల్లో ఎన్నికల సమరానికి జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. జిల్లా పాలనాధికారి అశిష్‌ సంగ్వాన్‌ నేతృత్వంలో ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు.

Published : 29 Apr 2024 02:41 IST

జిల్లాలో 925 పోలింగ్‌ కేంద్రాలు

నిర్మల్‌లో శిక్షణ ఇస్తున్న మాస్టర్‌ ట్రైనర్లు

నిర్మల్‌, న్యూస్‌టుడే: ఆదిలాబాద్‌ పార్లమెంటు పరిధిలోని జిల్లాలోని నిర్మల్‌, ముథోల్‌, ఖానాపూర్‌ నియోజకవర్గాల్లో ఎన్నికల సమరానికి జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. జిల్లా పాలనాధికారి అశిష్‌ సంగ్వాన్‌ నేతృత్వంలో ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. మూడు నియోజకవర్గాల్లో 925 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో పీవో, ఏపీవో, ఇద్దరు ఓపీవోలతో కలిపి నలుగురు విధులు నిర్వహించనున్నారు. ఇప్పటికే వీరందరికీ తొలి విడత శిక్షణ పూర్తి చేశారు. శిక్షణలో బ్యాలెట్‌ యూనిట్‌, కంట్రోల్‌ యూనిట్‌, వీవీ ప్యాట్‌లను ఎలా ఉపయోగించాలనే దానిపై మాస్టర్‌ ట్రైనర్లు వివరించారు. పోలింగ్‌ రోజు మాక్‌పోల్‌ నిర్వహణపై కూడా అవగాహన కల్పించారు. ఎన్నికలకు సంబంధించి హ్యాండ్‌బుక్‌, ఇతర భాధ్యతలపై శిక్షణ ఇచ్చారు.

సాంకేతిక నిపుణుల ఆధ్వర్యంలో

మే 13న జరిగే పోలింగ్‌ నేపథ్యంలో నాలుగు నెలల ముందు నుంచే ఎన్నికల సంఘం ఈవీఎంల ఎంపిక ప్రక్రియ చేపట్టింది. ఇందులో భాగంగా మొదటగా ఎఫ్‌ఎస్‌సీ (ఫస్ట్‌ లెవల్‌ చెకింగ్‌) ప్రక్రియను ఫిబ్రవరి 5 నుంచి 15 వరకు నిర్వహించింది. ఇందులో ఈవీఎంల తయారీ సంస్థలు (ఈఎసీఐఎస్‌, బీఈఎల్‌) ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు, రాజకీయ పార్టీల నాయకులు, జిల్లా ఎన్నికల అధికారి పాల్గొన్నారు. జిల్లాకు కేటాయించిన ఈవీఎంలు సరిగా పనిచేస్తున్నాయా.. లేదా అనేది పరిశీలించారు. సరిగ్గా పనిచేస్తున్న వాటిని మొదటి విడత యాదృచ్ఛికీకరణ (ర్యాండమైజేషన్‌) పూర్తిచేసి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించారు. పోలింగ్‌ రోజు ఈవీఎంలలో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించడానికి వాటి తయారీ సంస్థలకు చెందిన సాంకేతిక నిపుణుల సహాయం తీసుకుంటారు. ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున వీరిని నియమించారు. పోలింగ్‌ రోజు ఏదైనా ఈవీఎం మొరాయిస్తే వెంటనే దాని స్థానంలో మరొకటి ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం అదనంగా ఈవీఎంను అందుబాటులో ఉంచారు. రెండో ఈవీఎం పనిచేయకపోతే ఆ సమయంలో నిపుణుల సహాయం తీసుకుంటారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే పీవో, ఏపీవో, ఓవోలకు మే 1 నుంచి రెండో విడత శిక్షణ ఇవ్వనున్నారు.


సెక్టోరియల్‌ అధికారులు కీలకం

ఎన్నికల సామగ్రి సరఫరా, పోలింగ్‌తోపాటు కౌంటింగ్‌ వరకు సెక్టోరియల్‌ అధికారుల కీలకపాత్ర పోషిస్తారు. ప్రతి సెక్టోరియల్‌ అధికారి పర్యవేక్షణలో పీవోలు పనిచేయాల్సి ఉంటుంది. మూడు నియోజకవర్గాల్లోనూ వీరిని నియమించి శిక్షణ ఇచ్చారు. పోలింగ్‌ రోజు రూట్ల వారీగా వీరి ఆధ్వర్యంలో ఎన్నికల సామగ్రి తరలించనున్నారు. పోలింగ్‌ జరుగుతున్న తీరుపై ఎప్పటికప్పుడు రిటర్నింగ్‌ అధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి రెండు గంటలకోసారి పోలింగ్‌ శాతం సమాచారాన్ని సేకరించి ఉన్నతాధికారులకు నివేదించాలి. పోలింగ్‌ కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిపై దృష్టి సారించి వెంటనే పరిష్కరించాలి. ఈవీఎంలు మొరాయిస్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. సాయంత్రం పోలింగ్‌ ముగిసిన అనంతరం ఈవీఎంలను స్ట్రాంగ్‌రూంలకు తరలించాల్సి ఉంటుంది.


1 నుంచి ఎన్నికల అధికారులకు శిక్షణ

నిర్మల్‌, న్యూస్‌టుడే: పార్లమెంటు ఎన్నికల విధులు నిర్వహించనున్న పీవో, ఏపీవో, ఓపీవోలకు మే 1 నుంచి రెండో విడత శిక్షణ తరగతులు జరుగుతాయని జిల్లా విద్యాధికారి, నోడల్‌ అధికారి రవీందర్‌రెడ్డి తెలిపారు. నిర్మల్‌ నియోజకవర్గం వారికి సెయింట్‌ థామస్‌ స్కూల్‌, ముథోల్‌ నియోజకవర్గం వారికి బాసర ఆర్జీయూకేటీలో, ఖానాపూర్‌ నియోజకవర్గం వారికి అక్కడి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఈ శిక్షణ ఉంటుందని చెప్పారు. మే 1, 2 తేదీల్లో పీవో, ఏపీవోలకు, 3, 4 తేదీల్లో ఓపీవోలకు శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. ఇతర వివరాలు ఆర్డర్‌ కాపీలో పొందుపర్చామన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు శిక్షణకు విధిగా హాజరుకావాలని, గైర్హాజరైన వారిపై ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని