logo

కళాశాలలు డీలా.. గురుకులాలు భళా

ఇంటర్‌ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలలు నిరాశపరిచాయి. ప్రైవేట్‌కు దీటుగా గురుకులాలు ఉత్తీర్ణత శాతం సాధించాయి. రాష్ట్రస్థాయిలో ఈ ఏడాది 46.29 శాతంతో ప్రథమంలో 32వ స్థానం, 59.53 శాతంతో ద్వితీయంలో 30వ స్థానాల్లో మంచిర్యాల నిలిచింది.

Published : 29 Apr 2024 02:53 IST

ఇంటర్‌ ఫలితాల్లో ఇదీ పరిస్థితి..
మంచిర్యాల విద్యావిభాగం, న్యూస్‌టుడే

ఇంటర్‌ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు (పాతచిత్రం)

ఇంటర్‌ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలలు నిరాశపరిచాయి. ప్రైవేట్‌కు దీటుగా గురుకులాలు ఉత్తీర్ణత శాతం సాధించాయి. రాష్ట్రస్థాయిలో ఈ ఏడాది 46.29 శాతంతో ప్రథమంలో 32వ స్థానం, 59.53 శాతంతో ద్వితీయంలో 30వ స్థానాల్లో మంచిర్యాల నిలిచింది. మొత్తంగా పరిశీలిస్తే ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు ఏ ఒక్కటి కూడా 100 శాతం ఫలితాలు సాధించలేకపోయాయి. కారణమేదైనా తగ్గిన ఫలితాలు విద్యాశాఖ వర్గాలను కలవరపెడుతున్నాయి. సప్లిమెంటరీలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు నేటినుంచి అనుత్తీర్ణులైన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు.

జిల్లాలోని 10 ప్రభుత్వ కళాశాలల్లో జనరల్‌, వొకేషనల్‌ విభాగంలో ప్రథమంలో 1871 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 548 మంది ఉత్తీర్ణులై 29.28 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. ఇక ద్వితీయ సంవత్సరంలో 1926 మందికి 905 మంది ఉత్తీర్ణత సాధించగా 46.98 శాతంతో కాస్త ఫర్వాలేదనిపించింది.

  • జిల్లాలో కాసిపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రథమంలో 50.46, ద్వితీయంలో 80.67 శాతం ఉత్తీర్ణతతో రెండింటిలో మొదటి స్థానంలో నిలిచింది. దండేపల్లిలో ప్రథమంలో 109 మందికి 8 మంది మాత్రమే ఉత్తీర్ణతకాగా 7.34, ద్వితీయంలో చెన్నూరులో 165 మందికి 46 మంది పాస్‌కాగా 27.88 శాతంతో చివరి స్థానాల్లో నిలిచాయి.
  • కసూర్బాలు, తెలంగాణ ఆదర్శ కళాశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు మెరుగైన ఫలితాలు సాధించాయి. 35 కళాశాలల్లో ప్రథమంలో 2416 మందికి 1453 మంది పాసై 67.70, ఇక ద్వితీయంలో 1944 మందికి 1606 మంది పాసై 82.61 శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ కళాశాలల కన్నా గురుకులాల్లో ప్రథమంలో 38.42 శాతం, ద్వితీయంలో 35.63 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించడం విశేషం.

ప్రథమంలో.. మందమర్రి బాలికల బీసీ గురుకులం 89.57, బెల్లంపల్లి సీఓఈలో 94.59, మందమర్రి ఆదర్శ కళాశాలలో 86.99, మందమర్రి కేజీబీవీలో 97.44, మంచిర్యాల మైనార్టీ బాలికల గురుకులంలో 94.64 శాతం ఉత్తీర్ణత సాధించాయి.

ద్వితీయంలో.. బెల్లంపల్లి బీసీ గురుకులం 96.61, ఇందారం సాంఘిక సంక్షేమ బాలుర కళాశాల 98.4, కాసిపేట ఆదర్శ కళాశాల 89.29, మందమర్రి కస్తూర్బాలో 93.55, బెల్లంపల్లి బాలికల మైనార్టీ గురుకులం 96.43 శాతం ఉత్తీర్ణత సాధించాయి.


నేటి నుంచి ప్రత్యేక తరగతులు

ఇంటర్‌ వార్షిక ఫలితాల్లో జిల్లాలో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో డీఐఈవో శైలజ జిల్లాలోని ఆయా కళాశాలల ప్రిన్సిపల్‌లతో సమావేశం నిర్వహించి తగ్గిన ఉత్తీర్ణత శాతంపై కారణాలు విశ్లేషించారు. మే నెల 24 నుంచి ప్రారంభమయ్యే సప్లిమెంటరీ పరీక్షల్లో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా లక్ష్యాన్ని నిర్ణయించారు. గడువు తేదీలోగా ఫెయిల్‌ అయిన విద్యార్థులతో ఫీజులను కట్టించి విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఈ నెల 29 నుంచి మే 20 వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అన్ని కళాశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. ఆయా సబ్జెక్టుల్లో అనుత్తీర్ణులైన వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తూ తరగతుల నిర్వహణతో పాటు, మోడల్‌ పేపర్‌లతో ప్రతిభా పరీక్షలు నిర్వహిస్తూ సప్లిమెంటరీ పరీక్షలకు సన్నద్ధం చేయనున్నట్లు డీఐఈవో ఆర్‌.శైలజ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని