logo

ఎన్నికల వేళ.. గొలుసు దుకాణాల గోల

‘లోక్‌సభ ఎన్నికల కోడ్‌ అమలులో వచ్చిన సందర్భంగా గంజాయి అక్రమ రవాణా, మద్యం గొలుసుదుకాణదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇందుకు సంబంధించిన వ్యక్తులపై కేసులు నమోదు చేస్తాం.

Updated : 29 Apr 2024 05:54 IST

విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు..
ఈనాడు, ఆసిఫాబాద్‌

‘లోక్‌సభ ఎన్నికల కోడ్‌ అమలులో వచ్చిన సందర్భంగా గంజాయి అక్రమ రవాణా, మద్యం గొలుసుదుకాణదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇందుకు సంబంధించిన వ్యక్తులపై కేసులు నమోదు చేస్తాం. ముందు జాగ్రత్తగా కొందరిని బైండోవర్‌ చేశాం. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూస్తాం’ అని పోలీసులు ప్రకటించారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది.

ఎన్నికలను పురస్కరించుకుని అన్ని పల్లెలు, పట్టణాలు, ముఖ్య కూడళ్లలో మద్యం గొలుసు దుకాణాలు వెలిశాయి. దీంతో ఈ ప్రాంతాల నుంచి మహిళలు, పిల్లలు వెళ్లడానికి జంకే పరిస్థితి నెలకొంది. ఎవరైనా ఫిర్యాదు చేస్తేనే చూస్తామనే ఆబ్కారీ అధికారుల ధోరణితో ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. లేనిపోని గొడవలు ఎందుకని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో దాదాపు అన్ని దుకాణాల్లో మద్యం విరివిరిగా లభిస్తోంది.

నెలవారీ వసూళ్లు..

చాలా ప్రాంతాల్లో విచ్చలవిడిగా గొలుసు దుకాణాలు కొనసాగడానికి కారణం అధికారుల వసూళ్లే అనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ప్రతీ గొలుసు దుకాణం నుంచి స్థానిక పోలీసులకు, ఆబ్కారీ అధికారులకు మామూళ్లు వెళుతున్నాయని బహిరంగంగానే ప్రజలు చర్చించుకుంటున్నారు. లేదంటే ఈ స్థాయిలో గొలుసు దుకాణాలు కనిపించవనే అభిప్రాయాలను వీరు వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 32 వైన్స్‌లు ఉండగా వందలాది గొలుసు దుకాణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఎన్నికల సమయంలో పల్లెల్లో మద్యం ఏరులై పారుతోంది.


ఈ ప్రాంతాల్లో అధికం...

  • కాగజ్‌నగర్‌ నుంచి ఈజ్‌గాం మీదుగా పెంచికల్‌పేట్ వరకు 30 కిలోమీటర్ల మేర ఉన్న ప్రధాన రహదారులను ఆనుకుని పల్లెల్లో అన్ని చోట్ల దుకాణాల్లో మద్యం లభిస్తోంది. ఈ మార్గంలో వందలాది గొలుసు దుకాణాలు ఉన్నాయి.
  • చింతలమానేపల్లి, కౌటాల మండలాల్లో, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో అధిక సంఖ్యలో దుకాణాల్లో మద్యం లభిస్తోంది.
  • వాంకిడి మండలంలో కనర్‌గాం, ఇందాని మార్గంలో, ఆర్టీఏ చెక్‌పోస్ట్‌ సమీపంలో, ప్రయాణ ప్రాంగణాల ఎదుట ప్రధాన రహదారిపైనే గొలుసు దుకాణాలు ఉన్నాయి. వాహనదారులు సైతం మద్యం తాగి నడపడంతో అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
  • జిల్లా కేంద్రంలోని బాలికల, బాలుర పాఠశాలలను ఆనుకుని మూడు మద్యం గొలుసు దుకాణాలు ఉండగా, మార్కెట్ దగ్గర, జన్కాపూర్‌ ఏరియాల్లో ఎక్కడపడితే అక్కడ ఉన్నాయి.
  • ఆసిఫాబాద్‌-తిర్యాణి మార్గంలో 30 కిలోమీటర్లు దూరం ఉండగా దారిపొడవునా వెలిసిన దుకాణాల్లో మద్యం దొరుకుతోంది.
  • జైనూర్‌, సిర్పూర్‌(యు), కెరమెరి ఏజెన్సీ మండలాల్లోనూ గొలుసు దుకాణాలు విరివిరిగా ఉన్నాయి.

జిల్లా కేంద్రంలోని ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ ఇల్లు ఇది. ఈయన ఏకంగా మద్యం గొలుసు దుకాణానికి తన గదులను అద్దెకు ఇచ్చాడు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో నిత్యం తెల్లవారుజామున 5 గంటల నుంచి ఉదయం పది, పదకొండు గంటల వరకు ఈ దుకాణం తెరిచి ఉంటుంది. మళ్లీ సాయంత్రం నాలుగైదు గంటలకు తెరుస్తున్నారు. పోలీసే తమ ఇంటిని మద్యం గొలుసు దుకాణం కోసం అద్దెకు ఇవ్వడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఎదురుగానే బాలుర ప్రభుత్వ పాఠశాల సైతం ఉండటం కొసమెరుపు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని