Real estate: పదేళ్లలో.. వృద్ధిపథంలో..

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారం పడిపోతుందనే ప్రచారం జరిగింది. వీటన్నింటిని పటాపంచలు చేస్తూ కొత్త రాష్ట్రం ఏర్పడిన 2014, జూన్‌ 2 నుంచి ఇప్పటివరకు దశాబ్దకాలంలో మార్కెట్‌ ఎంతో విస్తరించింది. హైదరాబాద్‌ రియాల్టీలో ఎన్నో సానుకూల మార్పులు ఈ పదేళ్ల కాలంలో జరిగాయి.

Updated : 01 Jun 2024 07:57 IST

భాగ్యనగరంలో రియల్‌ ప్రగతి
ఈనాడు, హైదరాబాద్‌ 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారం పడిపోతుందనే ప్రచారం జరిగింది. వీటన్నింటిని పటాపంచలు చేస్తూ కొత్త రాష్ట్రం ఏర్పడిన 2014, జూన్‌ 2 నుంచి ఇప్పటివరకు దశాబ్దకాలంలో మార్కెట్‌ ఎంతో విస్తరించింది. హైదరాబాద్‌ రియాల్టీలో ఎన్నో సానుకూల మార్పులు ఈ పదేళ్ల కాలంలో జరిగాయి. గృహ, వాణిజ్య, కార్యాలయాల రియల్‌ ఎస్టేట్‌ పరంగా దేశంలోని మిగతా అగ్రశ్రేణి నగరాలను తలదన్నే రీతిలో వృద్ధిని నమోదు చేసింది.  ఈ దశాబ్దకాలంలో లక్షల మంది సొంతింటి కలను సాకారం చేసుకున్నారు. మరెన్నో లక్షల మంది భవిష్యత్తు అవసరాల దృష్ట్యా స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెట్టి వాటి నుంచి రాబడులు అందుకున్నారు. స్థిరాస్తులు కొని, పెట్టుబడులు పెట్టి లాభపడిన వారే తప్ప.. నష్టపోయాం అని చెప్పినవారి సంఖ్య స్వల్పం. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో హైదరాబాద్‌ స్థిరాస్తి మార్కెట్‌పై ప్రత్యేక కథనం.

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌లో పదేళ్ల కాలంలో రాశిపరంగానే కాదు వాసిపరంగా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. మార్కెట్‌ అవుటర్‌ రింగ్‌రోడ్డు దాటి ప్రాంతీయ వలయ రహదారి వైపు పరుగులు తీస్తోంది. మరోవైపు చుక్కలను తాకేలా భవన నిర్మాణాలతో ఆకాశానికే నిచ్చెన వేస్తున్నారు. సిటీలో గరిష్ఠంగా 60 అంతస్తుల ఎత్తు వరకు భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. ఐటీ కారిడార్‌లోనే కాదు సిటీలోని ఇతర ముఖ్యప్రాంతాలకు ఆకాశహర్మ్యాల పోకడ విస్తరించింది. మారుతున్న కొనుగోలుదారుల అభిరుచులకు తగ్గట్టుగా నిర్మాణ రంగంలో దశాబ్దకాలంలో గణనీయమైన మార్పులు వచ్చాయి.

ఆకాశహర్మ్యాల్లో.. 

గేటెడ్‌లోనూ ఆకాశహర్మ్యాలకు ప్రస్తుతం ఆదరణ ఎక్కువగా లభిస్తోంది. ఇదివరకు గరిష్ఠంగా సిటీలో 40 అంతస్తుల భవనాలు ఉండేవి. అవి కూడా వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. ఈ పదేళ్లకాలంలో గరిష్ఠంగా 60 అంతస్తుల వరకు అనుమతులు తీసుకున్నారు. 52 అంతస్తుల ఎత్తులో కడుతున్న భవనం కూడా పూర్తికావొచ్చింది. గచ్చిబౌలి ఓఆర్‌ఆర్‌ చుట్టుపక్కల చూస్తే విదేశాల్లో మాదిరి గృహ, కార్యాలయాల భవనాలు కొత్త సిటీ అనుభూతిని కలగజేస్తున్నాయి. ఇంకా పెద్ద సంఖ్యలో నిర్మాణంలో ఉన్నాయి. ప్రధాన నగరానికి ఆకాశహర్మ్యాల పోకడ పదేళ్ల కాలంలో విస్తరించింది. ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో ల్యాండ్‌ మార్క్‌ ప్రాజెక్ట్‌లు వేర్వేరు దశల్లో ఉన్నాయి. 

గేటెడ్‌ సంస్కృతి పెరిగింది... 

సొంత రాష్ట్రంలో కొనుగోలు శక్తి పెరగడంతో ఇల్లు కొనేవారి ఆలోచనల్లో మార్పులు వచ్చాయి. సాధారణ అపార్ట్‌మెంట్‌లో కంటే గేటెడ్‌ కమ్యూనిటీల్లో సకల సౌకర్యాలు ఉన్నచోట కొనేందుకు మొగ్గుచూపడంతో ఈ తరహా ప్రాజెక్టులు పదేళ్ల కాలంలో ఎన్నోరెట్లు పెరిగాయి. కేపీహెచ్‌బీ, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి చుట్టుపక్కలే కాకుండా కొంపల్లి, ఎల్బీనగర్, ఉప్పల్, శంషాబాద్, పటాన్‌చెరు వైపు విస్తరించాయి. పిల్లలు, పెద్దలు అందరికీ తగ్గ సౌకర్యాలు కమ్యూనిటీలో లభిస్తుండటంతో వీటిలో కొనుగోళ్లు పెరిగాయి.

విలాస నిర్మాణాలు పెరిగాయ్‌..

హైదరాబాద్‌ రియాల్టీలో మొదటి నుంచి బడ్జెట్‌ ధరల్లో ఎక్కువగా గృహ నిర్మాణాలు చేపట్టేవారు. ఇక్కడ ఇన్వెస్టర్ల కంటే ఇల్లు కొనేవారే ఎక్కువగా ఉండేవారు. ఇటీవల కాలంలో ఇందులో మార్పులు వచ్చాయి. మార్కెట్లో ఇన్వెస్టర్లు పెరిగారు. విలాస నివాసాల పోకడ మొదలైంది. కొనుగోలుదారుల నుంచి డిమాండ్‌ ఉండటంతో ఈ ప్రాజెక్టుల సంఖ్య ఇటీవల భారీగా పెరిగింది. ఫ్లోర్‌కు ఒక ఫ్లాట్, 5వేల నుంచి 15వేల విస్తీర్ణంలో ఫ్లాట్ల నిర్మాణాలు పెరిగాయి.

అందుబాటు ధరల్లోవి తగ్గాయ్‌.. 

ప్రీమియం ప్రాజెక్టులు పెరగడంతో అందుబాటు ధరల్లో కట్టేవారు సిటీలో కరవయ్యారు. ఒకటి రెండు పెద్ద సంస్థలు మినహా రూ.50 లక్షల లోపు రెండు పడకల గది ఫ్లాట్లు కడుతున్నవారు పెద్దగా మార్కెట్లో లేరు. దీంతో సామాన్య, మధ్యతరగతి వర్గాల్లో చాలామందికి ఇప్పటికీ సొంతిల్లు కలగానే ఉంది. భూముల ధరలు పెరగడంతో అందుబాటు ధరల్లో ప్రాజెక్ట్‌లు చేయలేకపోతున్నామని బిల్డర్లు చెబుతున్నారు. ఎక్కడైనా చేపట్టినా తక్కువ విస్తీర్ణం కారణంగా కొనుగోలుదారుల నుంచి ఆశించిన స్పందన ఉండటం లేదని తమ అనుభవాలను ఏకరువు పెడుతున్నారు. ఈ విభాగంలో ఇళ్ల నిర్మాణాలు పెరిగేందుకు తగిన ప్రోత్సాహకాలను దశాబ్ది ఉత్సవాల వేళ సర్కారు ప్రకటిస్తే బాగుంటుందని కొందరు బిల్డర్లు అంటున్నారు.

రాబడులు 8 నుంచి 15 శాతం..

స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెట్టిన వారికి పదేళ్లకాలంలో 200 శాతం పైన రాబడులు వచ్చాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి హైదరాబాద్‌ వైపు పడింది. భారీ పెట్టుబడులు ఇక్కడికి వచ్చాయి. గేటెడ్‌ కమ్యూనిటీ గృహ నిర్మాణాల్లో వార్షిక వృద్ధి 8 శాతం ఉంటే.. వాణిజ్య నిర్మాణాల్లో వృద్ధి రేటు 15 శాతం దాకా ఉందని హైదరాబాద్‌ రియాల్టీ సంస్థ విశ్లేషించింది. ఇళ్ల్ల కొనుగోలుదారులు, పెట్టుబడిదారులందరికీ హైదరాబాద్‌ ఆకర్షణీయంగా మారింది.

ప్రీలాంచ్‌ల మరక..  

దశాబ్దకాలంలో రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ప్రీలాంచ్‌ల దందా పెద్ద మరకగా మారింది. యూడీఎస్‌ పేరుతో పెద్ద మోసానికి ఐదారేళ్ల క్రితం తెరలేచింది. మోసపూరిత ప్రకటనలతో తక్కువ ధరకే ఇల్లు ఇస్తామని.. ఏకకాలంలో మొత్తం డబ్బు కట్టించుకుని కొందరు బిల్డర్లు ఆ తర్వాత ముఖం చాటేశారు. నిర్మాణం మొదలుపెట్టక.. కట్టిన డబ్బులు వెనక్కి ఇవ్వకపోవడంతో వేలమంది కొనుగోలుదారులు నష్టపోయారు. రెరా వచ్చిన తర్వాత ఈ దందా పెరగడం.. చట్టం అమలులోని లోపాలకు నిదర్శనం. అప్పటి ప్రభుత్వం సైతం ఈ దందాపై ఉదాసీనంగా వ్యవహరించిందన్న విమర్శలు ఉన్నాయి. కొత్త ప్రభుత్వంలోనైనా వీటిని కట్టడి చేయాలని, గతంలో నష్టపోయిన బాధితులకు న్యాయం చేయాలని కొనుగోలుదారులు కోరుతున్నారు.

కొనేందుకు అనువైన సమయమేనా?

హైదరాబాద్‌లో ఉన్న మెరుగైన మౌలిక వసతులు, స్థిరమైన ప్రభుత్వం, నివాస యోగ్యమైన నగరంగా గుర్తింపు, మిగతా నగరాలతో పోలిస్తే తక్కువ జీవన వ్యయం, అనుకూలమైన వాతావరణం,  వేర్వేరు ప్రాంతాలతో కలిసి జీవించే సంస్కృతి వంటి సామాజిక, ఆర్థిక అంశాలు సానుకూలంగా ఉండటంతో స్థిరాస్తి మార్కెట్‌ మున్ముందు మరింత వృద్ధిపథంలో పయనిస్తుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం ధరలు నిలకడగా ఉన్నాయని.. ఇల్లు, స్థలం ఏదైనా కొనుగోలు చేసేందుకు, బేరమాడేందుకు ఇదే అనువైన సమయమని చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని