logo

ప్రణాళికాలోపంతో గందరగోళం

నక్కపల్లిలో సోమవారం జరిగిన ప్రధాన పార్టీల నామినేషన్ల ప్రక్రియలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపించింది.

Published : 23 Apr 2024 02:45 IST

ఆర్వో కార్యాలయం వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత

ఆర్వో కార్యాలయం గేటు వద్ద రెండు పార్టీల శ్రేణులు

నక్కపల్లి, పాయరావుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: నక్కపల్లిలో సోమవారం జరిగిన ప్రధాన పార్టీల నామినేషన్ల ప్రక్రియలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ఫలితంగా ట్రాఫిక్‌ భారీగా నిలిచిపోయి ప్రయాణికులు, చోదకులతోపాటు ఇరు పార్టీల శ్రేణులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒకేరోజున, ఒకే సమయంలో తెదేపా, వైకాపా అభ్యర్థులు నామినేషన్‌ వేస్తున్నట్లు పోలీసులకు ముందస్తుగానే సమాచారం ఉంది. వారు కూడా ముందస్తు ప్రణాళికలు వేసినా దీన్ని ఆచరణలో చూపలేకపోయారు.  

నక్కపల్లి మండలం సారిపల్లిపాలెం వద్ద తన నివాసం నుంచి అనిత, నక్కపల్లి వైకాపా కార్యాలయం నుంచి ఆ పార్టీ అభ్యర్థి జోగులు తమ మద్దతుదారులతో ర్యాలీగా ఆర్వో కార్యాలయం వరకు వస్తున్నట్లు ముందుగానే పోలీసులకు సమాచారం ఉంది. అభ్యర్థులు వేర్వేరు మార్గాల్లో వస్తుండటంతో ప్రధాన గేటుకు 100 మీటర్ల దూరంలోే వారు ఉండేలా ప్రణాళికలు వేశారు. వేలాదిమంది తరలిరావడంతో తగిన బందోబస్తు ఏర్పాటు చేయలేకపోయారు. ట్రాఫిక్‌ నియంత్రణ విషయంలో ముందే తగిన ప్రణాళికలు వేసుకోలేకపోవడంతో పరిస్థితి చేయిదాటిపోయింది. ముందుగా వైకాపా వర్గీయులు స్టాపర్లు దాటి ఆర్వో కార్యాలయం బారికేడ్‌ వద్దకు చేరుకోగా, కూటమి శ్రేణులు కూడా ఇక్కడకు వచ్చేశాయి. ఇరు రెండు వర్గాల తమ అభ్యర్థులకు మద్దతుగా పోటాపోటీగా నినాదాలు చేశారు. అంతా వెనక్కి వెళ్లిపోవాలని పోలీసులు సూచించినా ఎవరూ వెనక్కి తగ్గలేదు. గొడవ జరిగే అవకాశం ఉందని గుర్తించిన పోలీసులు వీరందరినీ చెదరగొట్టారు. దీంతో కొంతసేపు ఇక్కడ గందరగోళం నెలకొంది. ఈలోగా విశాఖ - విజయవాడ మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. చివరకు నామినేషన్ల ప్రక్రియ ముగిసి, అధికార, ప్రతిపక్షాల కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్లేందుకు చాలా సమయం పట్టడంతో వాహనాల రాకపోకలు మరింత కష్టంగా మారింది. ఉన్నతాధికారులకు విషయం తెలిసి ఎలమంచిలి సర్కిల్‌, ట్రాఫిక్‌ పోలీసులు సైతం ఇక్కడకు పంపించారు. వీరంతా వాహన రాకపోకలను నియంత్రించడంలో నిమగ్నమయ్యారు.

పోలీసుల పక్షపాత వైఖరి

తమ ర్యాలీ విషయంలో పోలీసులు పక్షపాత వైఖరి అవలంభించారంటూ కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌, ఎమ్మెల్యే అభ్యర్థి వంగలపూడి అనిత ఆరోపించారు. నక్కపల్లిలో వీరు మీడియాతో మాట్లాడుతూ తాము ర్యాలీగా వస్తామని ముందే అనుమతులు పొందామన్నారు. అధికార పార్టీ ర్యాలీకి ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా చేసినా పోలీసులు, తమ ర్యాలీలోకి వాహనాలు పంపించి ట్రాఫిక్‌ నిలిచిపోయేలా చేశారని ఆరోపించారు. దీంతో తాము ర్యాలీ వాయిదా వేసుకుని మండుటెండలో నడిచి వచ్చామన్నారు. ఎన్నికలు వచ్చినా సరే ఇప్పటికి పోలీసులు జగన్‌ మోహన్‌ రెడ్డికి ఊడిగం చేయాలని చూస్తుండటం సిగ్గుచేటన్నారు. పీఎఫ్‌, జీతాలు రాకపోయి ఇబ్బందులు పడుతున్నా ఇప్పటికీ భయంతో జగన్‌కు వత్తాసు పలుకుతుండటం దారుణమన్నారు. ఎన్నికల సంఘం పరిధిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించాలన్నారు. పోలీసులు తమని ఇబ్బంది పెట్టినా కూటమి శ్రేణులు అవాంతరాలు, ఆంక్షలు దాటుకుని భారీగా వచ్చారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని