logo

కోలాహలంగా అభ్యర్థుల నామినేషన్లు

పాయకరావుపేట కూటమి అభ్యర్థిగా తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత సోమవారం నామినేషన్‌ వేశారు.

Published : 23 Apr 2024 02:50 IST

ఉపమాక వెంకన్న ఆలయంలో నామపత్రాలతో పూజలు చేయిస్తున్న అనిత, కుటుంబసభ్యులు

నక్కపల్లి, న్యూస్‌టుడే: పాయకరావుపేట కూటమి అభ్యర్థిగా తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత సోమవారం నామినేషన్‌ వేశారు. ఈ కార్యక్రమానికి కూటమి శ్రేణులు పోటెత్తాయి. ఉదయం ఇంటి నుంచి కుటుంబ సభ్యులతో కలిసి బయలుదేరిన అనిత ఉపమాక వెంకన్న ఆలయానికి వెళ్లి నామపత్రాలకు పూజలు చేయించి తిరిగి సారిపల్లిపాలెంలో తన ఇంటికి చేరుకున్నారు. అప్పటికే అక్కడికి నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వివిధ వాహనాల్లో భారీగా చేరుకున్నారు. సుమారు 11 గంటల ప్రాంతంలో ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ తదితరులతో కలిసి ఆమె ఓపెన్‌ టాప్‌ వాహనంలో ర్యాలీగా బయలుదేరారు. అప్పటికే ట్రాఫిక్‌ నిలిచిపోయింది. దీంతో ట్రాఫిక్‌ క్లియర్‌ చేసేలా చూడాలంటూ నేతలిద్దరూ పోలీసులకు విన్నవించినా ఫలితం లేకపోయింది. దీంతో శ్రేణులతో కలిసి నాయకులిద్దరూ మండుటెండలో కిలోమీటరుకుపైగా దూరంలో ఉన్న ఆర్వో కార్యాలయానికి కాలినడకనే చేరుకున్నారు.  ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌, జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి గెడ్డం బుజ్జి, మాజీ ఎంపీపీ యేజర్ల వినోద్‌రాజు తదితరులతో కలిసి ఆర్వో గీతాంజలికి నామపత్రాలు అందించారు. ఈ సమయంలో అక్కడే ఉన్న వైకాపా మద్దతుదారులను చూసి అనిత, రమేశ్‌ నమస్కరించి చేతులూపగా, వారు ప్రతిస్పందించారు.

మాట్లాడితే నా అక్కచెల్లెళ్లు, అ అన్నదమ్ములు, అవ్వతాతలు అంటూ కపట ప్రేమ చూపే జగన్‌కు ఓటేయొద్దని ఆయన సొంత చెల్లెళ్లు షర్మిల, సునీత చెబుతున్నారని కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ (భాజపా) విమర్శించారు. అనిత నామినేషన్‌ అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో రమేశ్‌ మాట్లాడారు. జగన్‌ చేతిలో మోసపోయిన సొంత సోదరీమణులే ఆయన పార్టీని గెలిపించొద్దని కొంగుచాపి మరీ అడుగుతున్నారని రమేశ్‌ పేర్కొన్నారు. జగన్‌ పాలనలో అన్ని వర్గాలు అన్యాయమైపోయాయన్నారు.


పేట వైకాపా అభ్యర్థిగా జోగులు..

ఎస్‌.రాయవరం, న్యూస్‌టుడే:  పాయకరావుపేట నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా కంబాల జోగులు సోమవారం మూడు సెట్ల నామినేషన్‌ వేశారు. ఆర్వో గీతాంజలికి నియోజకవర్గ నేతలతో కలిసి వచ్చిన ఆయన నామపత్రాలు అందించారు. అంతకుముందు నక్కపల్లి బస్‌స్టాండ్‌ నుంచి ఆర్వో కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎంపీ గొల్ల బాబూరావు, మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజు, నాలుగు మండలాల ముఖ్య నాయకులతో కలిసి ఎన్నికల ప్రచార వాహనంపై ర్యాలీ చేపట్టారు. నామినేషన్‌ కార్యక్రమానికి తీసుకొచ్చిన  కార్యకర్తలకు వైకాపా నాయకులు మందు, బిర్యానీలు పంపిణీ చేశారు. నక్కపల్లి సంత ఎదురుగా ఉన్న కొబ్బరి తోటల్లో గ్రామస్థాయి నాయకులు తమ గ్రామాల నుంచి తీసుకువచ్చిన వారికి నాయకులు మద్యం పంపిణీ చేశారు. దీంతో ఈ ప్రాంతమంతా ఎక్కడికక్కడే మందుబాబులతో నిండిపోయింది.

ర్యాలీకొచ్చి మద్యం తాగుతున్న వైకాపా కార్యకర్తలు


మాడుగుల వైకాపా అభ్యర్థినిగా అనూరాధ..

మాడుగుల, న్యూస్‌టుడే: మాడుగుల అసెంబ్లీ స్థానానికి వైకాపా అభ్యర్థినిగా ఈర్లె అనూరాధ నామినేషన్‌ దాఖలు చేశారు. ముందుగా నిర్ణయించిన సమయానికి ఎటువంటి ఆర్భాటం లేకుండా స్థానిక నాయకులతో తహసీల్దారు కార్యాలయానికి చేరుకుని రెండుసెట్ల నామినేషన్లను ఆర్‌ఓ సత్యవాణికి అందజేశారు. ఈ నెల 24న భారీ ర్యాలీగా వచ్చి మరోసారి నామినేషన్‌ వేస్తారని నాయకులు వెల్లడించారు.


చోడవరం వైకాపా అభ్యర్థిగా ధర్మశ్రీ..

చోడవరం పట్టణం, న్యూస్‌టుడే: చోడవరం అసెంబ్లీ స్థానానికి వైకాపా అభ్యర్థిగా విప్‌ కరణం ధర్మశ్రీ సోమవారం రెండుసెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. కుమారుడు సూర్యతో తహసీల్దారు కార్యాలయానికి చేరుకున్న ధర్మశ్రీ ఆర్‌వో చిన్నికృష్ణకు నామినేషన్‌ పత్రాలు అందజేశారు. అంతకుమందు స్వయంభూ విఘ్నేశ్వరాలయం, గౌరీశ్వరాలయంలో పూజలు నిర్వహించారు. ఈ నెల 24న ర్యాలీగా వచ్చి మరో సెట్‌ నామినేషన్‌ వేస్తానని చెప్పారు. ఆస్తుల వివరాలకు సంబంధించిన అఫిడివిట్‌ అందజేసేందుకు 25 వరకు సమయం ఉండటంతో ఆర్‌వోకు నామినేషన్‌ పత్రాలు మాత్రమే అందజేశారు.


వైకాపా ఎంపీ అభ్యర్థిగా బూడి నామపత్రాల సమర్పణ

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: అనకాపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు సోమవారం తమ నామినేషన్‌ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ రవికి  అందజేశారు. దేవరాపల్లి మండలం తారువాలోని ఆయన స్వగ్రామం నుంచి వైకాపా నాయకులు, కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. కె.కోటపాడు, వెంకన్నపాలెం, తుమ్మపాల మీదుగా అనకాపల్లి వరకు ఈ ర్యాలీ జరిగింది. ఇక్కడి నుంచి ఎంపీ బీవీ సత్యవతి, అనకాపల్లి వైకాపా అసెంబ్లీ అభ్యర్థి మలసాల భరత్‌కుమార్‌, నాయకులతో కలిసి కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకుని నామినేషన్‌ పత్రాన్ని అందజేశారు. అనంతరం ముత్యాలనాయుడు విలేకరులతో మాట్లాడుతూ సామాన్యుడు, ధనవంతుడికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ఇటీవల చంద్రబాబునాయడు ఒక సమావేశంలో తనకు దిల్లీ వీధులు తెలియవన్నారని, తనకు అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని అన్ని ప్రాంతాలు తెలిస్తే చాలని చెప్పారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వెంట జనం ఉన్నారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని