logo

వైకాపా పాలనలో ఆదివాసీలకు అన్యాయం

గిరిజన ప్రాంతంలో యువతకు ఉపాధి కల్పించేందుకు నిండుగా అవకాశాలున్నా వైకాపా ప్రభుత్వం నిర్వాకంతో అది అందని ద్రాక్షలా మారింది.

Published : 23 Apr 2024 02:53 IST

గిరి యువతకు ఉపాధి కరవు

పెదబయలు, న్యూస్‌టుడే: గిరిజన ప్రాంతంలో యువతకు ఉపాధి కల్పించేందుకు నిండుగా అవకాశాలున్నా వైకాపా ప్రభుత్వం నిర్వాకంతో అది అందని ద్రాక్షలా మారింది. ప్రతి మండల కేంద్రంలో ఉపాధి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఎంతోమందికి ఉపాధి కల్పించామని వైకాపా నేతలు గొప్పలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉంటున్నాయి.

పెదబయలు వైటీసీలో నిర్వహిస్తున్న ఏకలవ్య పాఠశాల

పెదబయలులో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో రూ. మూడు కోట్ల వ్యయంతో యువజన శిక్షణ కేంద్రం నిర్మించారు. తరువాత రాష్ట్రం విడిపోయింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తెదేపా ప్రభుత్వం యువకులకు వివిధ విభాగాల్లో ప్రతి మూడు నెలలకొకసారి శిక్షణ ఇచ్చి అనేక మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించింది. తరువాత వైకాపా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వీటిపై దృష్టి పెట్టకపోవడంతో గత ఐదేళ్లలో ఒక్కరంటే ఒక్కరికి ఉపాధి కల్పించిన దాఖలాల్లేవు. ప్రస్తుతం ఈ కేంద్రంలో ముంచంగిపుట్టు మండలానికి చెందిన ఏకలవ్య పాఠశాలను నిర్వహిస్తున్నారు.

  • వైకాపా ప్రభుత్వం మన్యంలో జలపాతాలను పర్యటకంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చినా వాటిని నెరవేర్చలేదు. దీంతో గిరిజన యువతకు ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వస్తోంది. తమను పట్టించుకోకుండా కేవలం సంక్షేమం అంటూ ప్రభుత్వం బాకా కొడుతోందని పలువురు నిరుద్యోగులు విమర్శిస్తున్నారు.
  • గతంలో గిరిజన యువత కోసం ప్రత్యేక డీఎస్సీ ప్రకటించేవారు. జీవో నం 3 ప్రకారం గిరిజన ప్రాంతంలో శతశాతం ఉద్యోగాలు గిరిజనులకే చెందేలా ఉన్న జీవో నం 3ను సుప్రీంకోర్టు రద్దుచేసింది. దీనిపై రివ్యూ పిటిషన్‌ వేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. బోయ, వాల్మీకులని ఎస్టీ జాబితాలో చేర్చేందుకు శాసనసభలో తీర్మానం చేసింది. దీనివల్ల తమ ఉపాధి అవకాశాలకు గండి పడతాయని నిరుద్యోగులు పెద్దఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. వైకాపా ఐదేళ్ల పాలనలో కొత్త ఉద్యోగాలు లేవు కదా నిరుద్యోగులకు శిక్షణిచ్చే వైటీసీలపై నిర్లక్ష్యం చూపింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని