logo

గిరిజనుల గోడు పట్టని వైకాపా

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై ఛార్జిషీట్‌ దాఖలు చేయాలని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి డిమాండ్‌ చేశారు.

Published : 28 Apr 2024 02:07 IST

పుస్తకాలు ఆవిష్కరిస్తున్న కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి, భాజపా, జనసేన నాయకులు

పాడేరు, న్యూస్‌టుడే: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై ఛార్జిషీట్‌ దాఖలు చేయాలని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి డిమాండ్‌ చేశారు. శనివారం పాడేరులో జనసేన, భాజపా నాయకులతో భాజపా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గిరిజనుల గోడును వైకాపా ప్రభుత్వం ఏనాడూ పట్టించుకోలేదన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన 2019 నాటికి నేరాల సంఖ్య 11,929గా ఉండగా.. 2022 నాటికి ఐపీసీ నేరాల సంఖ్య 1,58,547కి పెరిగిందన్నారు. 2022లో రాష్ట్రంలో 22 మంది చిన్నారులు హత్యకు గురయ్యారని చెప్పారు. రాష్ట్రంలో 948 మంది పెద్దలు హత్యకు గురయ్యారని పేర్కొన్నారు. వైకాపా పాలనలో ప్రతిరోజు సగటున మూడు హత్యలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మహిళలపై హత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. వీటన్నింటికి బాధ్యులను చేస్తూ సీఎం జగన్‌పై ఛార్జిషీట్‌ దాఖలు చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై జగన్‌ స్టిక్కర్లు పెట్టుకొని తమవిగా ప్రచారం చేసుకుంటున్నారన్నారు. అరాచక పాలనను అంతం చేయాలని పిలుపునిచ్చారు. గిరిజనులకు ప్రత్యేకమైన ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను నవరత్నాల పేరిట దుర్వినియోగం చేశారని ఆరోపించారు. పంచాయతీలకు వచ్చిన 14, 15వ ఆర్థిక సంఘం నిధులు దారి మళ్లించారన్నారు. వైకాపా అరాచకాలపై రూపొందించిన పుస్తకాలు ఆవిష్కరించారు. జనసేన నాయకులు గంగులయ్య, భాజపా నాయకులు కృష్ణారావు, నేతలు రామకృష్ణ, చక్రవర్తి వెంకటరమణ, సుబ్బలక్ష్మి, భాస్కర్‌, సురేష్‌కుమార్‌, రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు