logo

మూసేయడంలో తగ్గేదేలే!

నాలుగు మూడు చేశాం.. మూడు రెండు చేశాం.. రెండు ఒకటి చేశాం.. రేపో, మాపో ఆ ఒక్కటీ లేకుండా చేస్తాం. 

Updated : 29 Apr 2024 06:36 IST

నాలుగు మూడు చేశాం.. మూడు రెండు చేశాం.. రెండు ఒకటి చేశాం.. రేపో, మాపో ఆ ఒక్కటీ లేకుండా చేస్తాం. 

వేరెవరికీ సాధ్యం కాని రికార్డు ఇది. వైకాపా పాలకులకే దక్కిన ఘనత ఇది. సహకార చక్కెర కర్మాగారాలకు సమాధికట్టేశామని జగన్‌, ఆయన నాయక గణం చెప్పుకోవాల్సిన విషయమిది.

రాష్ట్రంలో ఇంకెక్కడా లేనివిధంగా నాలుగు సహకార చక్కెర కర్మాగారాలు అనకాపల్లి జిల్లాలో ఉన్నాయి. వాటిలో మూడింటిని మూసేసేవరకు వైకాపా పాలకులు తగ్గలేదు. మరోదానిని మూసివేత ముంగిటకు తీసుకొచ్చారు. అన్ని రంగాలను ఉద్ధరించామని, రైతులకు ఎక్కడలేని మేలు చేశామంటూ సీఎం జగన్‌ చెప్పుకొస్తున్నారు. చెరకు రైతును పండించే ఏ ఒక్క రైతును కదిపినా వచ్చే కన్నీటి కథలు చెబుతాయి జగన్‌ పాలన చేసిన చేటు ఏమిటో..

-ఈనాడు, అనకాపల్లి, న్యూస్‌టుడే, అనకాపల్లి, చోడవరం, పాయకరావుపేట


నాడు..

తెదేపా హయాంలో అనకాపల్లి జిల్లాలో తుమ్మపాల, తాండవ, ఏటికొప్పాక, గోవాడ సహకార చక్కెర కర్మాగారాలూ మనుగడలో ఉన్నాయి. తుమ్మపాలలో రికవరీ రేటు తగ్గిపోవడంతో రెండేళ్లు మూతపడింది. అప్పటి అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ రూ.32 కోట్లు ఈ కర్మాగారానికి మంజూరు చేయించి తిరిగి గానుగాడేలా చేశారు. ఒక ఏడాదిలో కనిష్ఠంగా 6.8 లక్షల టన్నుల గానుగతో రైతులకు దన్నుగా నిలిచారు.

నేడు

వైకాపా సర్కారు కొలువు తీరిన తర్వాత జిల్లాలో చక్కెర కర్మాగారాల ఉనికికే ముప్పు వచ్చింది. తుమ్మపాల మూతపడడమే కాదు.. ఆ కంపెనీ ఆస్తులను అమ్మకానికి పెట్టారు. తరవాత తాండవ, ఏటికొప్పాక చక్కెర కర్మాగారాలను మూసేశారు. ఉన్న ఒక్క గోవాడ కర్మాగారాన్ని బిక్కుబిక్కుమంటూ నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు జిల్లాలో ఏడాదికి 6.8 లక్షల టన్నుల చెరకు గానుగాడితే ఇప్పుడు కేవలం 1.7 లక్షల టన్నులకు పరిమితమైంది.

చెరకు రైతుపై కరకు మనసు

జిల్లాలో నాలుగేళ్లక్రితం వరకు ఎక్కడచూసినా పచ్చటి చెరకు తోటలు కనువిందు చేసేవి. అటువంటిది నేడు చెరకు సాగు అంటేనే రైతులు భయపడిపోతున్నారు. కర్మాగారాలు మూతపడ్డాయి. 2019లో 30 వేల హెక్టార్లలో చెరకు సాగైతే.. 2023 నాటికి 8,450 హెక్టార్లకు సాగు విస్తీర్ణం పడిపోయింది. ప్రస్తుతం రాష్ట్రంలో సహకార రంగంలో నడుస్తున్న చక్కెర కర్మాగారం అనకాపల్లి జిల్లాలోని గోవాడ ఒక్కటే. గతంలో ఈ కర్మాగారం అయిదు లక్షల టన్నులకు పైగానే గానుగాడింది. అటువంటిది ముగిసిన సీజన్‌లో కేవలం 1,70,601 టన్నులకు పరిమితమైంది. కర్మాగారం పరిధిలో పండిన పంటనే పూర్తి స్థాయిలో తీసుకోలేకపోతోంది. చెరకు సరఫరా చేసిన రైతులకు పూర్తి స్థాయిలో డబ్బు చెల్లించడం లేదు. కేంద్రప్రభుత్వం ప్రకటించిన ధర ప్రకారం టన్నుకు రూ.2,920 చెల్లించాల్సి ఉంది. తొలివిడతగా టన్నుకు రూ. 2,500 చెల్లించాలని యాజమాన్యం నిర్ణయించింది. అదైనా ఇచ్చారా అంటే 34,892 టన్నులకే చెల్లించారు. కర్మాగారానికి చెరకు సరఫరా చేసి దాదాపు మూడు నుంచి నాలుగు నెలలు కావస్తున్నా ఇంత వరకు పూర్తి స్థాయిలో డబ్బు ఇవ్వలేదు. దీంతో రైతుల్లో కర్మాగారాలపై నమ్మకం, చెరకు సాగుపై ఆసక్తి సన్నగిల్లిపోతున్నాయి.

ఇవన్నీ వైకాపా పాపాలు కావా?

  •  పాయకరావుపేటలోని తాండవ సహకార కర్మాగారాన్ని 2021లోనే మూసివేశారు. రైతుల బకాయిలు చెల్లించకుండా తీవ్రమైన ఇబ్బందులకు గురి చేశారు. సొమ్ములు చెల్లించాలంటూ ఉద్యమానికి వచ్చిన రైతు ఒకరు గుండెపోటుతో చనిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్లకు అన్నదాతల బకాయిలు చెల్లించారు. తాండవతోపాటు ఏటికొప్పాక కర్మాగారం సిబ్బందికి జీతాలు చెల్లించడం లేదు. తాండవ పరిధిలో 350 మంది ఉద్యోగులకు నేటికీ జీతాలు చెల్లించలేదు. ఇంకా రూ. 13.50 కోట్లు ఇవ్వాల్సి ఉంది. పీఎఫ్‌ రూ. 2 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో 70 కార్మికులకు పింఛను రావడం లేదు. జీతాలు లేకపోవడంతో సిబ్బంది పడుతున్న వెతలు వర్ణనాతీతం.
  •  ఏటికొప్పాక రూ. 8.50 కోట్లు సిబ్బందికి చెల్లించాల్సి ఉంది. రెండు కర్మాగారాల పరిధిలో తుని, పాయకరావుపేట, నర్సీపట్నం, ఎలమంచిలి, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లోని దాదాపు 15 వేల మంది అన్నదాతలు చెరకు సాగుకు దూరమయ్యారు. వాస్తవానికి వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రుల కమిటీ జిల్లాలోని కర్మాగారాలను స్వయంగా పరిశీలించింది. వీటిని ఆధునికీకరించి కొత్తరూపు తీసుకొస్తామన్న హామీ బుట్టదాఖలైంది.  
  •  చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో సాధారణంగా 25 వేల ఎకరాల్లో చెరకు సాగయ్యేది. మూడు గానుగాటల కాలం నుంచి సకాలంలో చెల్లింపులు చేయకపోవడంతో రైతులు సాగు తగ్గించేశారు. ప్రసుత్తం పది వేల ఎకరాలలోపే సాగవుతోంది.

  గోవాడ కర్మాగారంలో ఈ ఏడాది గానుగాట కాలానికి సంబంధించి చెరకు రైతులకు చెల్లించాల్సిన నగదును ఈ ఏడాది జనవరి 31 వరకు టన్నుకు రూ. 2,500 మాత్రమే చెల్లించారు. ఇంకా ఫిబ్రవరి, మార్చి నెలలకు నగదు బకాయి పడింది. పూర్తి స్థాయిలో నగదు రైతునకు చెల్లించాల్సి ఉంది.

ఇథనాల్‌ యూనిట్‌ ఏర్పాటుకు గోవాడ కర్మాగారంలో పరిశీలిస్తున్న మంత్రి అమర్‌, ఎమ్మెల్యే ధర్మశ్రీ (పాత చిత్రం)

అబద్ధాల అమర్‌

గోవాడ సహకార చక్కెర కర్మాగారం ఆప్కాబ్‌ నుంచి వివిధ రూపాల్లో తీసుకున్న రూ. 85 కోట్లను ప్రభుత్వ వాటాధనంగా మార్చాలని నిర్ణయించాం. దీనివల్ల కర్మాగారం తేరుకుంటుంది. దీంతోపాటు కర్మాగారం గాడిలో పడాలంటే తక్షణం రూ. 24 కోట్లు సాయం చేయడం గురించి సీఎంను కలసి చర్చించి తుది నిర్ణయం తీసుకుంటాం. అలాగే రూ. 90 కోట్లతో ఇథనాల్‌ యూనిట్‌ ఏర్పాటుకు చర్యలు చేపడతాం.

 2023 జూన్‌ 29న పరిశ్రమల మంత్రి గుడివాడ్‌ అమర్‌నాథ్‌ చెప్పిన మాట ఇది. పది నెలలు కావస్తున్నా ఆర్థిక సాయం లేదు. ఇథనాల్‌ యూనిట్‌ ఊసూ లేదు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని