logo

మా పాసుపుస్తకాలపై ముఖ్యమంత్రి ఫొటోనా?

రెండు సెంట్లు పాకదిబ్బ మినహా ఎలాంటి భూమిలేదు. పశువులను మేపుకొనే జీవిస్తున్నా.

Published : 30 Apr 2024 03:14 IST

బ్యాంకు రుణాలు ఇవ్వడం లేదు
వైకాపా నాయకులను నిలదీసిన రైతులు

మునగపాక, న్యూస్‌టుడే: రెండు సెంట్లు పాకదిబ్బ మినహా ఎలాంటి భూమిలేదు. పశువులను మేపుకొనే జీవిస్తున్నా. ఉన్న ఇల్లు శిథిలమవడంతో పక్కా గృహం మంజూరు చేయండని కాళ్లరిగేలా తిరిగినా పట్టించుకోలేదు. ఇప్పుడు వైకాపాకు ఓటేయండని అడగడానికి ఎలా గొచ్చారు? అంటూ సమావేశానికి వచ్చిన వైకాపా నాయకులను పెంటకోట శ్రీనివాసరావు నిలదీశారు. తమ పాసు పుస్తకంపై జగన్‌ ఫొటో ఉండడంతో బ్యాంకు రుణం మంజూరు కాలేదని, తమ పాసు పుస్తకంపై జగన్‌ ఫొటో ఏంటని మరో రైతు ఆళ్ల రాము నిలదీశారు. వీరి ప్రశ్నలకు వైకాపా నాయకులు తెల్లముఖం వేశారు. మునగపాక పాటిదిబ్బ ప్రాంతంలో ఆదివారం రాత్రి పాటిదిబ్బ, ఉపరిదిబ్బ, పురిటిగెడ్డ, ముసిలితల్లి మూలసంఘాల రైతులతో జడ్పీటీసీ సభ్యుడు పెంటకోట స్వామిసత్యనారాయణ, ఎంపీటీసీ సభ్యుడు సూరిశెట్టి రాము తదితరులు సమావేశం ఏర్పాటు చేశారు. ఆ ప్రాంత రైతులందరికీ భోజనాలు ఏర్పాటు చేసి ఎన్నికల్లో వైకాపాకు ఓటేయాలని అభ్యర్థించారు. మా సమస్యల్ని పట్టించుకోలేని వారు ఇప్పుడు ఓటెలా అడగడానికి వచ్చారంటూ వీరు నిలదీశారు. స్థలాలు ఉండి కూడా కొందరు ఇళ్ల పట్టాలు, సంక్షేమ పథకాలు పొందారని పలువురు ఆరోపించారు. మునగపాక-కశింకోట రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయిన తమకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి వెనుకంజ వేశారన్నారు. ఇళ్ల పట్టాల విషయమై వైకాపా కార్యకర్తల్లోనే వాగ్వాదం జరిగింది.ఈ పరిస్థితుల్లో కొందరు నాయకులు అక్కడ నుంచి జారుకున్నారు. మునగపాక ఎన్టీఆర్‌ కాలనీలో ప్రచారం చేపట్టిన వైకాపా నాయకులకు చేదు అనుభవం ఎదురైంది. సామాజిక అవసరాలకు కేటాయించిన స్థలంలో అంగన్‌వాడీ కేంద్రం భవనం నిర్మించొద్దని అడ్డుకొన్న తమపై కేసులు ఎలా బనాయించారని ప్రశ్నించారు. కేసులు ఉపసంహరించుకున్న తరవాతే ప్రచారానికి రండి అంటూ స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని