logo

జగనన్న తప్పులు.. జనానికి తిప్పలు

సకల సదుపాయాలతో కాలనీలు నిర్మించి పేదల సొంతింటి కల నెరవేరుస్తామని జగన్‌ పాదయాత్రలో హామీ ఇవ్వగా ప్రజలు నమ్మి ఓట్లేశారు. తీరా అధికారంలోకి వచ్చాక గ్రామాలకు దూరంగా, నదీతీరం, లోతట్టు ప్రాంతాల్లో లేఔట్లు వేశారు.

Published : 22 Apr 2024 05:21 IST

న్యూస్‌టుడే, గుడివాడ గ్రామీణం, అవనిగడ్డ

సకల సదుపాయాలతో కాలనీలు నిర్మించి పేదల సొంతింటి కల నెరవేరుస్తామని జగన్‌ పాదయాత్రలో హామీ ఇవ్వగా ప్రజలు నమ్మి ఓట్లేశారు. తీరా అధికారంలోకి వచ్చాక గ్రామాలకు దూరంగా, నదీతీరం, లోతట్టు ప్రాంతాల్లో లేఔట్లు వేశారు. ఎటువంటి మౌలిక వసతులు కల్పించకపోవడంతో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి ఆసక్తి చూపడం లేదు. కొన్ని చోట్ల నిర్మించినా నివాసం ఉండలేకపోతున్నామంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • అవనిగడ్డ నియోజకవర్గంలో రూ.152.28 కోట్ల అంచనాతో 219.15 ఎకరాల్లో 8,941 ప్లాట్లు వేసి 8,460 గృహాలు మంజూరు చేశారు. 2020 డిసెంబర్‌లో నవరత్నాలు పేరుతో ప్రారంభించిన పనులు ఇప్పటికీ నాలుగో వంతు కూడా పూర్తి కాలేదు. కొన్ని గృహాలు పూర్తయినా రహదారులు, విద్యుత్తు, తాగునీటి వసతి లేక నివాసం ఉండడం లేదు. భారీ వర్షాలు కురిస్తే ఇల్లు ఖాళీచేసి రావాల్సిన దుస్థితి. కొన్ని కాలనీలు ఇప్పటికీ మెరక చేయలేదు. మరికొన్ని లేఔట్లలో తూతూమంత్రంగా పనులు చేసి వైకాపా గుత్తేదారులు లబ్ధిపొందారు. మెరక చేసిన తర్వాత కూడా మోకాలు లోతు నీరు నిలిచి తగ్గడానికి పక్షం రోజులు పట్టింది.
  • గుడివాడ మండలంలోని వివిధ గ్రామాల్లో 24 చోట్ల జగనన్న కాలనీలు ప్రారంభించారు. కోర్టు వివాదం వల్ల వలివర్తిపాడులో ఒకటి రద్దు చేశారు. రెండో లేఔట్లో పట్టాలిచ్చినా ఒక్కరికీ గృహనిర్మాణ రుణం మంజూరు చేయలేదు. చేపల చెరువుల వద్ద స్థలాలివ్వడంతో శేరీగొల్వేపల్లిలో ఒక లేఔట్‌ రద్దు చేశారు. కల్వపూడి అగ్రహారంలో చెత్త వేసే చోట స్థలాలిచ్చారని గ్రామస్థులు నిరాకరించడంతో అదీ రద్దు చేశారు. మోటూరు రైల్వే స్టేషన్‌ వద్ద లేఔట్లో అడుగు పెట్టలేని పరిస్థితి. మండలం మొత్తం మీద 21 లేఔట్లో 868 మందికి పట్టాలి చ్చారు. వారితో పాటు సొంత స్థలం ఉన్న 372 మందికి కలిపి 1240 మందికి గృహనిర్మాణ రుణం మంజూరు చేశారు. వారిలో 280 మంది నిర్మాణం ప్రారంభించలేదు.

రోడ్లు వేయాలి

- ఓ లబ్ధిదారు

ల్లాయపాలెం కాలనీలో అంతర్గత రోడ్లు గుంతలమయం అయ్యాయి. ట్రాక్టరుతో నిర్మాణ సామగ్రి తీసుకెళ్లాలన్నా ఇబ్బందే. మేమే ఇటుక ముక్కలు వేసుకొని సామాగ్రి తరలించుకోవాల్సిన దుస్థితి.  


తాగునీటికీ ఇబ్బందే

- ఆకునూరి కమలకుమారి, కొండిపర్రు

పామర్రు మండలం కొండిపర్రులో మాకు పంపిణీ చేసిన ఇళ్ల స్థలాల్లో సరైన సదుపాయాలు ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కాలనీలో రోడ్లు, మంచినీటి సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నాం. విద్యుత్తు లైన్లు వేయలేదు. స్థలాలిచ్చి మీ చావు మీరు చావండన్నట్లు ఉంది.  


వసతుల కల్పనలో నిర్లక్ష్యం

- యలవర్తి మునీశ్వరరావు, కొత్తపేట

రహదారులు అభివృద్ధి చేయలేదు. మెరక చేసిన తర్వాత కూడా కాలనీలు వర్షపు నీటిలో ఉన్నాయి. కొన్ని కాలనీల్లో విద్యుత్తు వసతి లేదు. తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు.


విద్యుత్తు, నీటి సౌకర్యం కల్పించాలి

- గృహిణి

మల్లాయపాలెం జగనన్న కాలనీలో కనీస వసతులు లేవు. నీరు, రోడ్లు, డ్రెయిన్లు లేవు. ఇక్కడ నివాసం ఉండడం చాలా కష్టం. గత్యంతరం లేక ఉంటున్నాము. అసాంఘిక కార్యకలాపాలు అధికమయ్యాయి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని