logo

మిస్టర్‌ అబద్ధం..! విజయవాడకు రూ. 150 కోట్లు ఇస్తానని చెప్పి వంచించిన జగన్‌

విజయవాడ, మచిలీపట్నాల అభివృద్ధి కోసం గత అయిదేళ్లలో జగన్‌ చేసిందేమిటంటే... రూ. వందల కోట్ల అబద్ధపు హామీలు గుప్పించడం. అంతేకాదు.. పన్నుల బాదుడుతో జనం బతకలేక పారిపోయేంతగా భయపెట్టడం.

Updated : 22 Apr 2024 15:24 IST

ఈనాడు, అమరావతి

2021లో నగర పాలక సంస్థ
ఎన్నికల తరువాత....

విజయవాడలో అభివృద్ధి పనులకు
నిధుల్లేవంటూ వైకాపా ప్రజాప్రతినిధులంతా
వెళ్లి సీఎం జగన్‌ని కలిశారు.. ఓస్‌ అంతే కదా.. ఓ రూ. 50 కోట్లు ఇస్తున్నానంటూ ఆయన హామీ ఇచ్చేశారు. కొంతకాలానికి మళ్లీ కలిసిన ప్రజాప్రతినిధులతో ‘ఆ మొత్తం సరిపోదా... సరే మరో రూ. వంద కోట్లు ఇస్తున్నా’ అంటూ మరో హామీ వదిలేశారు!

ఇంతకీ ఆ రూ. 150 కోట్లలో ఎంత
వచ్చిందో తెలుసా...?

అతికష్టమ్మీద రూ. 30 కోట్లు!.. ఇదీ జగనన్న మాటలకు.. చేతలకు మధ్య ఉన్న దూరం.
జనాన్ని నమ్మించడంలో... వారిని బురిడీ కొట్టించడంలో డిగ్రీలు ఏమైనా ఉంటే వాటన్నిటికీ అర్హత ఉన్న ఏకైన వ్యక్తి సీఎం జగన్‌. అంతలేదు.. ఇంతలేదంటారు.. ఆనక మొండిచేయి చూపిస్తారు. ఇలా ఆయనిచ్చిన హామీల వర్షంలో తడిచి.. నిధుల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసి.. పైసా కూడా అందక.. కష్టనష్టాల కూపంలోనే ఈ అయిదేళ్లూ జనం మగ్గిపోయారు.

విజయవాడ, మచిలీపట్నాల అభివృద్ధి కోసం గత అయిదేళ్లలో జగన్‌ చేసిందేమిటంటే... రూ. వందల కోట్ల అబద్ధపు హామీలు గుప్పించడం. అంతేకాదు.. పన్నుల బాదుడుతో జనం బతకలేక పారిపోయేంతగా భయపెట్టడం. కానీ.. వైకాపా నేతలు మాత్రం.. విజయవాడను ఉద్ధరించేశాం.. బందరును ముస్తాబు చేసేశామంటూ.. ఊదరగొడుతూ ప్రకటనలు గుప్పించేస్తున్నారు. విజయవాడకు ముఖ్యమంత్రి రెండు దఫాలుగా ఇచ్చిన రూ.150 కోట్ల హామీల్లోఅత్యంత కష్టమ్మీద రూ. 30 కోట్లు ఇచ్చారు. అది కూడా గుత్తేదారులను ముప్పుతిప్పలు పెట్టి.. కొద్దికొద్దిగా ఇచ్చారు. ఈ దెబ్బకు విజయవాడ నగరంలో అభివృద్ధి పనులకు టెండర్లంటూ.. పదేపదే పిలుస్తున్నా.. గుత్తేదారులు రావడం లేదు.

నమ్మించి.. ముంచేసి..

విజయవాడ నగరాన్ని ప్రగతికి ప్రతిరూపంలా మారుస్తామని 2021 నగర పాలక సంస్థ ఎన్నికలకు ముందు వైకాపా నేతలు ఊదరగొట్టారు. ఇది నమ్మి జనం ఓట్లేసి.. వైకాపా తరఫున 49 మంది కార్పొరేటర్లను గెలిపించి పీఠం అప్పగించారు. అంతే వారిని అడ్డంగా మోసగించి, ఇచ్చిన మాట తప్పి నమ్మకద్రోహం చేసిన ఘనత జగన్‌ సర్కారుదే. నగరంలో కనీసం ఫాగింగ్‌ చేసే దిక్కు లేకుండా, చెత్తతో నగర జీవనాన్ని అత్యంత దుర్భరంగా మార్చేశారు. దోమలు విపరీతంగా పెరిగాయి. ఖాళీ స్థలాలన్నీ మురికికూపాలుగా మారి.. దోమలకు ఆవాసాలయ్యాయి. వైకాపా పాలనలో  డెంగీ, మలేరియా జ్వరాలు విపరీతంగా వ్యాప్తి చెందాయి. అనేకమంది డెంగీతో మృత్యువాత పడ్డారు.

జగన్‌ మాటిస్తే.. అలా ఉంటుంది మరి!

  • విజయవాడలో వివిధ పనులకు తొలుత సీఎం జగన్‌ ఇస్తానని చెప్పిన రూ. 50 కోట్లతో మూడు సర్కిళ్లలో 88 (సర్కిల్‌-1లో 18, సర్కిల్‌-2లో 29, సర్కిల్‌-3లో 41) పనులు చేపట్టాలని ప్రతిపాదించారు. ఉద్యానవనాలు, మురుగునీటి శుద్ధి కేంద్రాలు, కాలువల సుందరీకరణ, ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సీసీ రోడ్లు, యూజీడీ లైన్ల ఏర్పాటు, ఓపెన్‌ జిమ్‌, అంతర్గత డ్రెయిన్లు, షాపింగ్‌ కాంప్లెక్స్‌ కమ్‌ ఫంక్షన్‌ హాళ్లు, క్రీడలకు వసతులు.. ఇలా పెద్ద ప్రణాళికే సిద్ధం చేశారు.
  • ఆ తర్వాత సీఎం ఇస్తానని చెప్పిన.. రూ. 100 కోట్లతో మరో 99 అభివృద్ధి పనులకు రూపకల్పన చేశారు. అన్ని డివిజన్లలో రహదారుల నిర్మాణం, సామాజిక భవనాల అభివృద్ధి, గ్రంథాలయాలు, సీవేజీ లైన్ల పనులు వీటిలో ఉన్నాయి.
  • టెండర్లు పిలిచి గుత్తేదారులకు పనులప్పగించారు. వీటిని చేపట్టాకే జగన్‌ సర్కారు ఎలాంటిదో గుత్తేదార్లకు అర్థమైంది. రూ. 30 కోట్ల వరకూ పనులు చేస్తే.. ఆ బిల్లులు రావడానికి ఏడాదిన్నరకు పైనే పట్టింది.
  • ఆ తర్వాత చాలా పనులు టెండర్ల దశలోనే ఆగిపోయాయి. కొన్నింటిని మధ్యలో వదిలేశారు.

మచిలీపట్నం ప్రజలను మోసగించి..

చిలీపట్నం నగర పాలక ఎన్నికల్లో వైకాపాను గెలిపిస్తే.. రూపురేఖలు మార్చేస్తామని ప్రచారం చేశారు. జనం నమ్మి ఏకంగా 44 డివిజన్లను కట్టబెట్టారు.అంతే.. జగన్‌ సర్కారు నైజం బయటపడింది. హామీలన్నీ జగన్‌ తుంగలో తొక్కేశారు. ఇక్కడి ప్రజల కోసం వైకాపా చేసిన అభివృద్ధి శూన్యం. తెదేపా ఆధ్వర్యంలో కట్టిన పార్కులు, ఇతర అభివృద్ధి పనులనూ గాలికొదిలేశారు. డ్రెయినేజీ సమస్య, వర్షపు నీటి కాలువల సమస్య పరిష్కారం కాలేదు. కనీసం తాగునీరు కూడా మెరుగు పరిచింది లేదు. ఫాగింగ్‌, దోమల నియంత్రణ ఊసేలేదు.

అన్నింటికీ మోకాలడ్డి.. మచిలీపట్నంలో ప్రజలందరికీ ఉపయోగపడే పనులను సొంత పార్టీ ఎంపీ చేసినా.. సహించలేనంతగా అరాచకాలకు పాల్పడింది పేర్ని వర్గం. నగరం నడిబొడ్డున జిల్లా కోర్టు సెంటర్లో రూ. 60 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో భోగరాజు పట్టాభి సీతారామయ్య జ్ఞాపకార్థం.. గ్రంథాలయం, ఆడిటోరియం, కన్వెన్షన్‌ సెంటర్‌, మ్యూజియం నిర్మించాలని ఎంపీ బాలశౌరి ప్రతిపాదనలు రూపొందించారు. యూనియన్‌ బ్యాంకు అధికారులతో ఆయన మాట్లాడి రూ.40 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించారు. ఇవన్నీ నగరాభివృద్ధిలో కీలకాంశాలు. ప్రజలకూ ఉపయోగపడేవి. కానీ.. నగరపాలక యంత్రాంగాన్ని తన చెప్పుచేతల్లో పెట్టుకున్న నాని.. అడుగడుగునా అడ్డం పడ్డారు. ఏ పనికీ అనుమతి రాకుండా చేశారు. అదే సమయంలో ఆ స్థలంపై కన్నేసి.. వైకాపా కార్యాలయం కోసం స్వాధీనం చేసుకున్నారు. రాత్రికి రాత్రే అనుమతులన్నీ తెచ్చి నిర్మాణం ఆరంభించేసి.. నెలల్లో భవనం కట్టేశారు. విలువైన ప్రభుత్వ స్థలాన్ని వైకాపా కార్యాలయం పేరుతో ఆక్రమించుకోవడంపై.. నగరవాసులు మండిపడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని