logo

జీతాలు అందక.. జీవనం గడవక

ఒప్పంద/పొరుగు సేవల విధానంలో పని చేస్తున్న ఉద్యోగుల పట్ల వైకాపా ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. పొరుగు సేవల ఉద్యోగులు, పలువురు ఒప్పంద ఉద్యోగులకు ప్రతి నెలా సక్రమంగా జీతాలు అందని పరిస్థితి ఏర్పడింది.

Published : 23 Apr 2024 06:36 IST

వేతన జీవుల వెతలు పట్టని వైకాపా సర్కార్‌

ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌, చుట్టుగుంట, న్యూస్‌టుడే: ఒప్పంద/పొరుగు సేవల విధానంలో పని చేస్తున్న ఉద్యోగుల పట్ల వైకాపా ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. పొరుగు సేవల ఉద్యోగులు, పలువురు ఒప్పంద ఉద్యోగులకు ప్రతి నెలా సక్రమంగా జీతాలు అందని పరిస్థితి ఏర్పడింది. బడ్జెట్‌ కేటాయింపులు లేకపోవడంతో రెండు లేదా మూడు నెలలకోసారి ఇస్తున్నారు. జీవనం కష్టంగా ఉంటోందని వివిధ శాఖల ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివిధ పథకాల కింద పని చేస్తున్న ఉద్యోగులకు ఆయా సంస్థల నుంచి నిధుల విడుదలను బట్టి జీతాలు చెల్లిస్తున్నారు. సాంకేతిక సమస్యలు, మూడేసి నెలలకు ఒక సారి బడ్జెట్‌ కేటాయింపులు వంటి కారణాలతో జీతాలు అందడం లేదు. చిరుద్యోగులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు.

క్రమబద్ధీకరణ చేయకుండా...

ఒప్పంద ఉద్యోగులను ఒక ఏడాదికి మాత్రమే ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. మార్చి 31వ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి వీరి కాల పరిమితి ముగస్తుంది. దీంతో ఏప్రిల్‌ మొదటి వారంలో కొనసాగింపు ఉత్తర్వులు ఇస్తారు. ఏటా ఇదే తంతు తప్పడం లేదు. ఈ ఏడాది ఇప్పటి వరకు కొనసాగింపు ఉత్తర్వులు రాలేదు. ఉద్యోగులు ఎదురు చూపులు చూస్తున్నారు. మరోవైపు వైద్య శాఖలో ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ పూర్తి స్థాయిలో జరగలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిన్న తరహా కేసులను బూచీగా చూపారని, వీటిని పరిష్కరించడానికి అవకాశం ఉన్నా, పక్కనపెట్టి క్రమబద్ధీకరణ చేయలేదంటూ విమర్శిస్తున్నారు.

కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే : ఓ ఉద్యోగిని

మాకు తల్లిదండ్రులు లేరు. ఇద్దరు ఆడ పిల్లలు. ఇటీవల ఓ రోడ్డు ప్రమాదంలో భర్త చేయి విరిగింది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే. నెల నెలా జీతం కోసం ఎదురు చూపులు చూడాల్సిందే.

తల్లిదండ్రులకు వైద్యం చేయించలేకపోతున్నా : ఓ ఉద్యోగి

ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగాలు లేక పొరుగు సేవల్లో డీఈవో (డేటా ఎంట్రీ ఆపరేటర్‌)గా చేరాను. ఈ ప్రభుత్వంలో నెల నెలా జీతం అందక ఇబ్బంది పడుతున్నాను. తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. వారికి అనారోగ్యం. సరైన వైద్య చికిత్స చేయించలేకపోతున్నా.

పరువు పోతోంది : ఓ ఉద్యోగి

నిత్యావసరాలు, అద్దెలు బాగా పెరిగాయి. ప్రతి నెలా నేను పడిన కష్టానికి జీతం సరైన సమయంలో అందక ఇబ్బందులు పడుతున్నాను. రెండు నెలల జీతం పెండింగ్‌ ఉంది. అది వస్తేనే కుటుంబం గుడుస్తుంది. ఇంటి యజమానికి ప్రతి నెలా కచ్చితంగా అద్దె చెల్లించాలి. ఇవ్వకపోతే రోడ్డు మీదే అడుగుతున్నారు. పరువు పోతోంది. అప్పులపాలవ్వాల్సి వస్తోంది.

ఉద్యోగుల సంఖ్యకు అనుగుణంగా..

రాష్ట్రంలో గ్రామ/వార్డు సచివాలయాల వ్యవస్థ ఏర్పడడంతో ఉద్యోగుల సంఖ్య పెరిగింది. దీనికి అనుగుణంగా బడ్జెట్‌లో పెరుగుదల లేకపోవడంతో వేతనాల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 100 మందికే ఆహారం వండి.. దాన్ని 200ల మందికి వడ్డిస్తామంటే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఒక కేడర్‌లోని ఉద్యోగులకు ఒక నెలలోనూ, మరో కేడర్‌లోని వారికి ఆ తర్వాత నెల.. ఇలా విడతల వారీగా జీతాలను ఆలస్యంగా చెల్లిస్తున్నారని దుయ్యబడుతున్నారు.

అవసరాలకు అప్పులు చేసి...

కుటుంబాల నిర్వహణకు ఉద్యోగులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. నెలవారి అద్దెలు, పాలు, విద్యుత్తు, కూరగయాలు, పిల్లల చదువులు, వైద్యం.. వంటి అవసరాలు తీర్చుకోలేకపోతున్నారు. సకాలంలో జీతం రాకపోవడంతో అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కోసారి అవమానాలు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా.. ప్రతినెలా సకాలంలో జీతాలు చెల్లించాలని కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని