logo

ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేయండి

మే 1న ఇంటి వద్దనే లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయాలని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు డిమాండ్‌ చేశారు. వైకాపా ప్రభుత్వం వృద్ధులు, దివ్యాంగుల జీవితాలతో ఆటలాడొద్దని హితవుపలికారు.

Published : 28 Apr 2024 03:40 IST

-బొండా డిమాండ్‌

అజిత్‌సింగ్‌నగర్‌ (మధురానగర్‌), న్యూస్‌టుడే : మే 1న ఇంటి వద్దనే లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయాలని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు డిమాండ్‌ చేశారు. వైకాపా ప్రభుత్వం వృద్ధులు, దివ్యాంగుల జీవితాలతో ఆటలాడొద్దని హితవుపలికారు. ఒక్క రోజు ఆలస్యమైనా.. మరణాలు సంభవించినా దానికి జగన్‌ సర్కారు బాధ్యత వహించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. శనివారం అజిత్‌సింగ్‌నగర్‌లోని తెదేపా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్‌మోహన్‌రెడ్డి తన రాజకీయ ప్రాబల్యం కోసం ఏప్రిల్‌లో ఇంటి వద్ద పింఛన్లు ఇవ్వకపోవడం వల్ల సచివాలయాల వద్దకు వచ్చిన వృద్ధులు, దివ్యాంగులు రాష్ట్ర వ్యాప్తంగా 40 మంది వరకు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకుని ఒక్క రోజులోనే పంపిణీ చేయవచ్చని పేర్కొన్నారు. మే 1న ఇంటి వద్దకే వెళ్లి ఇవ్వాలని దిల్లీలోని భారత ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశామని, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసినట్లు వివరించారు. ప్రభుత్వం వద్ద అధికారులు, సిబ్బంది ఉన్నా.. జగన్‌మోహన్‌రెడ్డి తన రాజకీయం కోసం దారుణానికి ఒడిగడుతున్నారని మండిపడ్డారు. పింఛన్ల డబ్బులు ఉంచకుండా మార్చి 16-30 మధ్య రూ.13వేల కోట్లు తన సొంత గుత్తేదారులకు దోచి పెట్టారని దుయ్యబట్టారు. ఫలితంగా పింఛన్లకు నిధుల కొరత వచ్చిందన్నారు. అవ్వా తాతలను ఎండలో తిప్పి వారిలో ఎవరైనా చనిపోతే దాన్ని విపక్షాలకు అంటగట్టి శవరాజకీయాలు చేసి.. ఎన్నికల్లో లబ్ధి పొందాలని జగన్‌ కుట్ర పన్నారని ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో బాబాయి హత్య, కోడి కత్తి డ్రామాలాడి లబ్ధి పొంది రాష్ట్రాన్ని దోచుకున్నారని గుర్తు చేశారు.  చంద్రబాబునాయుడు నెలకు రూ.4వేల చొప్పున పింఛను ఇస్తారని, దాన్ని ఏప్రిల్‌ నుంచి అమలు చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. దివ్యాంగులకు రూ.6వేలు, 50 ఏళ్ల వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పింఛన్లు ఇస్తామని పేర్కొన్నారు. సమావేశంలో నవనీతం సాంబశివరావు, గంటా కృష్ణమోహన్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు