logo

మాటల గారడీ.. చేతల్లో బురిడీ

 బందరు నగరంలో ముస్లింల జనాభా ఎక్కువ. వారు ఏదైనా వేడుక చేసుకోవాలంటే సరైన షాదీఖానాలు లేక అవస్థలు పడుతున్నారు. 2000 సంవత్సరంలో తెదేపా హయాంలోనే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవతో ఇంగ్లీషుపాలెంలో షాదీఖానా నిర్మించారు.

Published : 28 Apr 2024 03:44 IST

వైకాపా పాలనలో ప్రగతి కోల్పోయామంటున్న ముస్లింలు
గొడుగుపేట, గూడూరు (న్యూస్‌టుడే)

ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాం. మసీదులకు మౌలిక వసతులు కల్పించడంతోపాటు షాదీఖానాల అభివృద్ధి, యువత, మహిళలకోసం ప్రత్యేక పథకాలు, విద్యార్థులకు ఉపకారవేతనాలు ఇలా అన్ని విధాలుగా అండగా ఉంటాం.

- సీఎం జగన్‌తోపాటు, మంత్రులు వివిధ వేదికలపై చెప్పిన మాటలు ఇవి


సంక్షేమం మాటేమో కానీ గత ప్రభుత్వంలో ఉన్న అనేక పథకాలు రద్దు చేశారు. విద్యార్థులకు సకాలంలో ఉపకార వేతనాలు అందక అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. ప్రశ్నిస్తే  ఏంచేస్తారోనని భయం.. తెదేపా హయాంలో నిర్మించిననవి తప్ప వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కటి కూడా కొత్తది కట్టిన దాఖలాలు లేవు. కనీసం మరమ్మతులు, వివిధ వసతులు కల్పించాలన్నా పట్టించుకున్న వారు లేరు. మాకు చేసిందేమీ లేదు

-ముస్లింలు

 బందరు నగరంలో ముస్లింల జనాభా ఎక్కువ. వారు ఏదైనా వేడుక చేసుకోవాలంటే సరైన షాదీఖానాలు లేక అవస్థలు పడుతున్నారు. 2000 సంవత్సరంలో తెదేపా హయాంలోనే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవతో ఇంగ్లీషుపాలెంలో షాదీఖానా నిర్మించారు. వివిధ ప్రాంతాల్లో వేడుక మందిరాలు ఉన్నా అవి ప్రయివేటు వ్యక్తులు, సంస్థలవి కావడంతో అధిక మొత్తం వెచ్చించి వేడుకలు చేసుకోవాలంటే ఆర్థికంగా భారం అవుతుందని ముస్లింలు అంటున్నారు. నగరంలోని ఇంగ్లీషుపాలెం, సుకర్లాబాద, రాజుపేట, ఇనుగుదురుపేట తదితర ప్రాంతాల్లో వీరు ఎక్కువగా ఉంటారు. తెదేపా ఉర్దూఘర్‌ కం షాదీఖానాలు నిర్మించింది. ఇక్కడ ముస్లింల పిల్లలకు  ఉర్దూ బోధించే తరగతులు నిర్వహించడం, యువతకు చేతివృత్తుల నైపుణ్యంపై శిక్షణ తదితరాలకు వినియోగపడేలా వీటిని నిర్మించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కటి కూడా నిర్మించకపోగా ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అలంకారంగా..: తెదేపా హయాంలో గూడూరులో నిర్మించిన షాదీఖానా తాగునీరు సరఫరా సక్రమంగా లేకపోవడం, మరుగుదొడ్లు కూడా పాడైపోవడంతో అలంకారంగా మారింది. వసతులు కల్పించి వినియోగంలోకి తెస్తామని ప్రస్తుత పాలకులు హామీ ఇచ్చినా ఇంతవరకు పట్టించుకున్న దాఖలాలు లేవు. పైగా దీనిని ప్రస్తుతం గృహనిర్మాణ సంస్థకు సంబంధించి సిమెంటు గోదాముగా వినియోగించడం పట్ల ముస్లింలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని వసతులు కల్పించి వినియోగంలోకి తీసుకురావాలని అందించిన వినతిపత్రాలు కూడా బుట్టదాఖలే అయ్యాయి. బంటుమిల్లిలోని షాదీఖానా కూడా అధ్వానంగానే మారింది. కొత్తవి నిర్మిస్తామని చెప్పిన పాలకులు ఉన్నవి పాడైపోతున్నా కనీసం మరమ్మతులు చేయలేకపోయారని వాపోతున్నారు.


మరమ్మతులూ లేవు

- షేక్‌మౌలాలీ, ముస్లిం చైతన్యవేదిక, రాష్ట్ర ఉపాధ్యక్షుడు

బందరులోని ఇంగ్లీషుపాలెం , పెడన పట్టణంలోని షాదీఖానాలు మాత్రమే ప్రస్తుతం వినియోగంలో ఉన్నాయి. మిగిలినవి అన్నీ పాడైపోయాయి. వాటికి మరమ్మతులు చేస్తామని చెప్పిన ప్రస్తుత పాలకులు ఆ తరువాత పత్తాలేకుండా పోయారు. నగరంలో శ్మశానవాటికలు తదితరాలకు ఎంపీ బాలశౌరి ఇచ్చిన నిధులను కూడా అడ్డుకునే ప్రయత్నం చేయడం బాధాకరం.


వినియోగంలోకి తేవాలి

- ఎన్‌ఏబేగ్‌, గూడూరు

గూడూరులో షాదీఖానా ఉందన్న మాటే కానీ ఏళ్ల తరబడి అలంకారంగా మారిపోయింది. తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించి భవనానికి మరమ్మతులు చేస్తే చాలు వినియోగించుకోవచ్చు. ప్రస్తుత ప్రభుత్వం అది కూడా చేయలేకపోయింది.వెంటనే అవసరమైన వసతులు కల్పించి ఆ భవనాన్ని వినియోగంలోకి తీసుకు రావాలని డిమాండ్‌ చేస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని