logo

ఏకోపాధ్యాయులతో ఎదిగేదెట్టా?

ఏకోపాధ్యాయ పాఠశాలలు లేకుండా చేస్తానని, ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులుండేలా చర్యలు తీసుకుంటానని జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సంకల్పయాత్రలో హామీ ఇచ్చారు.

Published : 29 Apr 2024 05:10 IST

ప్రభుత్వ బడుల్ని నిర్వీర్యం చేసేందుకు వైకాపా కుట్ర
ప్రైవేట్‌ పాఠశాలలవైపు తల్లిదండ్రుల మొగ్గు
న్యూస్‌టుడే, కూచిపూడి

కోపాధ్యాయ పాఠశాలలు లేకుండా చేస్తానని, ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులుండేలా చర్యలు తీసుకుంటానని జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సంకల్పయాత్రలో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఉపాధ్యాయ నియామకాలు చేపట్టలేదు. జీవో 117తో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ పేరుతో అడ్డగోలుగా ఉపాధ్యాయులను పాఠశాలలకు కేటాయించి ఉపాధ్యాయుల సంఖ్య మిగులుగా చూపించారు. దీంతో ఏకోపాధ్యాయ పాఠశాలల్లో బోధన సాగక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. 2021-22 యుడైస్‌ప్లస్‌ నివేదిక ప్రకారం 2017లో 7,482 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండగా..ప్రస్తుతం 12,386 ఉన్నాయి. జాతీయ విద్యావిధానం ముసుగులో 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడంలో ప్రాథమిక పాఠశాలల్లో-1, 2 తరగతుల విద్యార్థులు మిగిలారు. హేతుబద్ధీకరణ ద్వారా 20 మందికి ఒక గురువుని కేటాయించడంలో ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య తగ్గి ఏకోపాధ్యాయ పాఠశాలలు పెరిగాయి. మూడు కిలో మీటర్ల పరధిలోని ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తామని ఉత్తర్వులు విడుదల చేయగా ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గి ఏకోపాధ్యాయ పాఠశాలల్లో టీచర్‌ సెలవు పెడితే సీఆర్పీలను ఉపయోగించుకోమని ఉత్తర్వులిచ్చింది. 


ఒకే గదిలో  అన్ని తరగతులు

- ఓ ఉపాధ్యాయుడు

ఏకోపాధ్యాయ బడుల్లో 1, 2 తరగతులు, విలీనం జరగని పాఠశాలల్లో 1 నుంచి 5 తరగతులకు ఒకే టీచరు ఉంటారు. అన్ని తరగతులకు అన్ని సబ్జెక్టులూ ఒక్కరే బోధించాలి. విద్యార్థులందరూ ఒకే గదిలో కూర్చుంటారు. దాని వల్ల కనీస సామర్థ్యాలు నేర్చుకోలేరు. ఫలితంగా పిల్లలు స్థాయికి తగ్గ జ్ఞాన సముపార్జన చేయలేరు. ఉపాధ్యాయుడు ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఖాళీ లేకుండా మర మనిషిలా బోధన చేయాల్సిందే.


పాఠశాలల విలీనంతో ప్రమాదమే

- ఒక ఉపాధ్యాయుడు

పాఠశాలల విలీనంతో తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో 1, 2 తరగతులు మాత్రమే ఉన్నాయి. 1, 2 తరగతిలో ఉండే పిల్లల అన్న, అక్కగాని 3, 4, 5 తరగతుల్లో ఉండే ఉన్నత పాఠశాలలకు వెళ్తే ప్రాథమిక పాఠశాలకు వెళ్లనని వారు మారాం చేస్తున్నారు. ఫలితంగా చాలా మంది తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపుతున్నారు. ఈ విధంగా ప్రభుత్వం ఒక పథకం ప్రకారం ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తోంది.


పిల్లల్లో సృజనాత్మకత తగ్గిపోతోంది

- సంఘ నాయకుడు

అయిదో తరగతి పిల్లవాడు రెండో తరగతి పాఠ్య పుస్తకం చదవలేకపోయాడని గతంలో అస్సర్‌ నివేదిక తెలిపింది. విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు కొరవడడంతో వారిలో సృజనాత్మకత పెంపొందడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని