logo

అధికారం నీడలో.. అరాచక లాఠీ!

ప్రజాస్వామ్యమంటే గౌరవం లేదు. ప్రజలు కట్టిన పన్నుల నుంచే జీతభత్యాలు పొందుతున్నామన్న ధ్యాస లేదు. చట్టాన్ని త్రికరణశుద్ధిగా అమలు చేస్తామని, బాధితులకు బాసటగా నిలుస్తామని చేసిన ప్రమాణాలనే తూచ్‌ అనేశామన్న బాధే లేదు.

Updated : 29 Apr 2024 06:31 IST

గులాబీ పువ్వు ఇస్తే.. ఎస్సీ ఎస్టీ కేసు
నిరసన తెలిపితే నాన్‌బెయిల్‌బుల్‌ సెక్షన్లు
అయిదేళ్లలో రాజ్యమేలిన ఖాకీస్వామ్యం
ఈనాడు, అమరావతి

యథా రాజా.. తథా పోలీసు!
‘‘ప్రజాస్వామ్యమంటే గౌరవం లేదు. ప్రజలు కట్టిన పన్నుల నుంచే జీతభత్యాలు పొందుతున్నామన్న ధ్యాస లేదు. చట్టాన్ని త్రికరణశుద్ధిగా అమలు చేస్తామని, బాధితులకు బాసటగా నిలుస్తామని చేసిన ప్రమాణాలనే తూచ్‌ అనేశామన్న బాధే లేదు. అచ్చం ఫ్యాక్షన్‌ తరహా చట్టాన్ని జనంపై ప్రయోగించి.. బాధితులనే నిందితులుగా చూపించి.. భయపెట్టి.. అరాచకస్వామ్యాన్ని ప్రవేశపెట్టిన పోలీసు యంత్రాంగం తీరు చరిత్రలో కనీవినీ ఎరుగనిది.’’

‘‘అధికార వైకాపా అంటే ఓ లెక్క.. అదే ప్రతిపక్ష తెదేపా అంటే మరో లెక్క. అధికారపక్ష నేతలు ఎందరిని బెదిరించినా.. దాడులు చేసినా.. కేసులుండవు. అదే ప్రతిపక్ష నేతలు న్యాయం అడిగితే బెదిరించినట్లు.. అన్యాయాన్ని ప్రశ్నిస్తే హత్యాయత్నం చేసినట్లు.. నిరసన తెలిపితే రాజద్రోహం, దేశద్రోహానికి పాల్పడినట్లు కేసులు పెట్టేస్తారు. అదీ బెయిల్‌కు వీల్లేనివిధంగా. అక్రమ మైనింగ్‌పై ఆందోళన చేస్తే కేసు.. అక్రమ తవ్వకాలను పరిశీలించినా కేసే. అదేమంటే ట్రెస్‌పాస్‌ కింద నోటీసులు.’’

‘‘అయిదేళ్లుగా రాష్ట్రంలో సీఎం జగన్‌ అలిఖిత ఫ్యాక్షన్‌ చట్టమే అమలవుతోంది. నేరగాళ్లు, అక్రమార్కులు చెప్పిందే సత్యం! బాధితుల వేదన.. రోదనలతో సంబంధం లేదు. ప్రశ్నించినా.. అడ్డొచ్చినా.. ఇదేంటని అడిగినా కేసుల మీద కేసులు. ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కులకు చోటే లేకుండా చేసేసిన జగన్‌ - పోలీసు రాజ్యం... ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలను అణచివేయడమే లక్ష్యంగా చట్టాన్ని ప్రయోగించింది.’’

  • పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో పర్యటించినప్పుడు ఓ యువకుడు ఉద్యోగాల కల్పన, అవినీతిపై ప్రశ్నించాడు. అంతే.. అతడిని అరెస్టు చేయాలని పోలీసులకు వెలంపల్లి ఆదేశాలిచ్చేశారు. పోలీసులేదో ఆయన బానిసలన్నట్లు దురుసుగా, అసభ్య పదజాలంతో ఆ ఆదేశాలివ్వడం గమనార్హం. అంతే వారు ఆ యువకుడి చొక్కా పట్టుకుని ఈడ్చేశారు.
  • మంత్రి జోగి అనుచరులమని కొందరు ఎమ్మెల్యే స్టిక్కర్లున్న కార్లలో వచ్చి గుంటూరు జిల్లా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ప్రయాణికుల బస్సులకు అడ్డం తిరిగి వారి బంధువుల ముందే అసభ్య వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయినా.. పోలీసులు మంత్రి చెప్పారని కేసే లేకుండా చేశారు. మహిళలకు ఖాకీలిచ్చే గౌరవం ఇదేనా?


నగరంలో అరాచకాలు..

విజయవాడలోనూ అరాచకాలకు అంతే లేదు. సీపీ కాంతిరాణా ఏకపక్షంగా ఉన్నారనే ఆరోపణలెన్నో వచ్చాయి. చెన్నుపాటి గాంధీపై దాడి ఘటనలో సాధారణ కేసు నమోదుకు రాణా కారణమని తెదేపా ఆరోపించింది. తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిపైనా, ఇంటిపైనా రెండుసార్లు రౌడీలు విరుచుకుపడ్డా చర్యలు శూన్యం. తెదేపా కార్యాలయంపై దాడికి తెగబడిందీ నగర వైకాపా కార్యకర్తలే. మాజీ సీఎం చంద్రబాబు నివాసంపైకి దండెత్తి వెళ్లింది.. నేటి మంత్రి జోగి , ఆయన అనుచరులే. వీరిపై చర్యల్లేవు. తూర్పులో ఓ మైనార్టీ మహిళ మృతికి వైకాపా నేతలే కారణమైనా.. తెదేపా కార్యకర్తలపై కేసు నమోదు చేసిన ఘనత కృష్ణలంక పోలీసులది.


విజయవాడ: భవానీపురం హరిత హోటల్‌ వద్ద ఓ వ్యక్తి ఫొటోలు తీస్తుండగా పర్యాటక సిబ్బంది టికెట్‌ కొని ఫొటోలు తీయాలని చెప్పారు. అంతే కాసేపటికి 42వ డివిజన్‌  వైకాపా కార్పొరేటర్‌ చైతన్యరెడ్డి భర్త ప్రసాద్‌రెడ్డి అనుచరులతో వచ్చి పర్యాటక సిబ్బందిపై దాడి చేశారు. ఇద్దరు ఉద్యోగులు గాయపడ్డారు. ఈ కేసును పోలీసులు నీరుగార్చేశారు.


రాజకీయ కేసులెన్నో..

క్రమ ప్రవేశం, బెదిరింపులు, దూషణల కింద బెయిల్‌కు వీల్లేని రాజకీయ ప్రేరేపిత కేసులెన్నో పెట్టారు. పోలీసు ఆంక్షలను ఉల్లంఘించారని పెట్టిన బెయిలబుల్‌ కేసులకైతే లెక్కే లేదు. మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు సందర్భంగా నిరసనకు దిగిన తెదేపా కార్యకర్తలందరిపైనా కేసులు పెట్టారు. ఇద్దరు ముఖ్యనేతలను రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు.

  • బందరులో ఓ హత్యతో సంబంధం ఉందని తెదేపా నేత కొల్లు రవీంద్రను, కొండపల్లిలో అక్రమ తవ్వకాలకు నిరసనగా ఆందోళన చేసిన మాజీ మంత్రి దేవినేని ఉమాపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు పెట్టి జైలుకు పంపారు.
  • గుడివాడలో పోలీసు యాక్ట్‌ ఉల్లంఘనపై తెదేపా నేత వెనిగండ్ల రాము, మరో 30 మందిపై కేసులు పెట్టారు. రావి వెంకటేశ్వరరావు, మరికొందరు టిడ్కో ఇళ్లను పరిశీలిస్తే కేసులు పెట్టారు.
  • మైలవరంలో తెలుగు యువత నాయకులపైనా అక్రమ కేసులు బనాయించారు.
  • విజయవాడలో బంద్‌ సందర్భంగా ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించారని టీఎన్‌టీయూసీ నేత రఘురామకృష్ణంరాజుపై సెక్షన్‌ 188 కింద కేసు పెట్టి.. 283, 290 సెక్షన్లు బనాయించారు.
  • కృష్ణలంకలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌.. మరో 20 మందిపైనా, గద్దె అనూరాధ, గొట్టిముక్కల, నెలిబండ్ల బాలస్వామిపై, టీఎన్‌టీయూసీ నేత పరుచూరి ప్రసాద్‌ తదితరులపై సెక్షన్‌ 151 కేసులు బనాయించారు. వన్‌టౌన్‌లో మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మరో 20 మందిపై కేసులు నమోదు చేశారు.

అరాచకానికి అడ్డా.. గన్నవరం

న్నవరంలో తాజా మాజీ ఎమ్మెల్యే వంశీకి వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తించినా.. ప్రకటన జారీ చేసినా.. కేసుల్లో ఇరికించడమే లక్ష్యం. తెదేపా కార్యాలయం, నాయకులు, కార్యకర్తలపై విచక్షణారహితంగా దాడులకు తెగబడి.. కార్లను తగలబెట్టేశారు. ఈ ఘటనలో 40 మంది తెదేపా నాయకులపైనే పోలీసులు కేసులు పెట్టి అరెస్టు చేశారు. దాడులకు కారణమైన వైకాపా నాయకులపై సాధారణ కేసులు పెట్టి సీఆర్పీసీ నోటీసులతో సరిపెట్టారు.


యువగళంపై అక్కసు

లోకేశ్‌ యువగళం పాదయాత్ర వేళ రంగన్నగూడెంలో రెచ్చిపోయిన వైకాపా నాయకులు, కార్యకర్తలు... తెదేపా శ్రేణులపై భౌతిక దాడులకు దిగారు. పోలీసులు మాత్రం 47 మంది తెదేపా నాయకులపై హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ వేధింపులు తదితర సెక్షన్ల కింద బెయిల్‌కు వీల్లేని కేసులు పెట్టారు.


బయటకు రాలేదని..

అవనిగడ్డ: గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే రమేష్‌బాబు వచ్చినప్పుడు.. తెదేపా సానుభూతిపరుడైన ఇంటి యజమాని బయటకు రాలేదనే కక్షతో అతని స్థలం ఆక్రమణలో ఉందని ఇంటి ప్రహరీ, బయట కట్టించిన పక్కా డ్రెయిన్‌ను జేెసీబీతో కూల్చేసిన దారుణమిది.


అడుగడుగునా నిర్బంధాలు..

వైకాపా పాలనలో గృహనిర్బంధాలు నిత్యకృత్యం. ప్రతీ చిన్న విషయానికి నాయకులనే కాదు.. ఉపాధ్యాయులు, ఉద్యోగులనూ నిర్బంధించడం పోలీసులకు అలవాటైంది. బైండోవర్‌ కేసుల నమోదూ అధికమే. విచ్చలవిడి లాఠీఛార్జీలు.. దూషణలు.. ఏకపక్ష వాదనలు.. నోటీసులు లేకనే అరెస్టులు.. గృహ నిర్బంధాలు.. ఇష్టారీతిన నిషేధాజ్ఞలు.. నిరసనలకు అనుమతుల నిరాకరణ.. ఇలా అణచివేత విధానాలు అమలు చేశారు. బాబు అరెస్టు వేళ తెదేపా నాయకులు, శ్రేణులను ఎక్కడికక్కడే నిర్బంధించారు. రోడ్డెక్కిన కార్యకర్తలపై లాఠీలు ఝళిపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని