CM Jagan: ఓటీఎస్‌ మంచి అవకాశం.. వాడుకోవాలా? వద్దా?వారిష్టం: జగన్‌

జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం, గృహ నిర్మాణంపై సీఎం జగన్‌ సమీక్షించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన  సమావేశంలో గృహనిర్మాణశాఖ

Published : 08 Dec 2021 16:45 IST

అమరావతి: జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం, గృహ నిర్మాణంపై సీఎం జగన్‌ సమీక్షించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన  సమావేశంలో గృహనిర్మాణశాఖ మంత్రి శ్రీరంగనాథరాజు, సీఎస్‌ సమీర్‌శర్మ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఓటీఎస్‌ పథకం పురోగతిపై వివరాలను అధికారులు సీఎంకు అందించారు. ఓటీఎస్‌పై అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా అధికారులను సీఎం ఆదేశించారు. ప్రజలకు ఏ విధంగా మంచి జరుగుతుందో చెబుతూ, వారికి అవగాహన కల్పించాలన్నారు. వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ పూర్తిగా స్వచ్ఛందమని సీఎం స్పష్టం చేశారు. క్లియర్‌ టైటిల్‌తో రిజిస్ట్రేషన్ జరుగుతుందని, పేదలపై రూ.10వేల కోట్ల భారం తొలగిస్తున్నామన్నారు. వారి రుణాలు మాఫీ చేస్తూనే, ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేస్తున్నామన్నారు. సుమారు 43వేల మంది గత ప్రభుత్వం హయాంలో అసలు, వడ్డీ కూడా కట్టారని, ఇవాళ మాట్లాడుతున్నవారు అప్పుడు ఎందుకు కట్టించుకున్నారని సీఎం ప్రశ్నించారు.

గతంలో అసలు, వడ్డీ కడితే బి-ఫారం పట్టా మాత్రమే ఇచ్చే వారని, ఇప్పుడు ఓటీఎస్‌ పథకం ద్వారా అన్ని రకాలుగా సంపూర్ణహక్కులు కల్పిస్తున్నామని తెలిపారు. అవసరాలకు తనఖా పెట్టుకోవచ్చని, అమ్ముకునే హక్కు కూడా ఉంటుందన్నారు. పేదలకు మంచి అవకాశం కల్పిస్తున్నామని, ఆ అవకాశాలు వాడుకోవాలా? లేదా? అనేది వారి ఇష్టమని సీఎం వ్యాఖ్యానించారు. ఓటీఎస్‌ పథకం పూర్తిగా స్వచ్ఛందమని సీఎం తెలిపారు. డిసెంబరు 21 నుంచే రిజిస్ట్రేషన్‌ పత్రాలు ఇవ్వడం ప్రారంభమవుతుందని తెలిపారు. భవిష్యత్తులో కూడా గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ పనులు జరుగుతాయని సీఎం వెల్లడించారు. ఓటీఎస్‌ కోసం 22-ఎ తొలగింపునకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశామని అధికారులు తెలిపారు. ఓటీఎస్‌ వినియోగించుకున్నవారికి స్టాంపు డ్యూటీ, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ, యూజర్‌ ఛార్జీలను రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీచేశామని అధికారులు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌ పనులు చేస్తున్నామని వెల్లడించారు. ఓటీఎస్‌ వినియోగించుకున్నవారికి రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్, ఫీల్డ్‌స్కెచ్, లోన్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌లు ఇస్తున్నామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని