logo

అధికార పక్షానికి పోలీసులు దాసోహం

ఎన్నికల సమయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన కొందరు పోలీసు అధికారులు అధికార పార్టీ సేవలో తరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో తెదేపా అభ్యర్థులు, కార్యకర్తలపై వైకాపా శ్రేణులు దాడులకు తెగపడుతున్నా కళ్లప్పగించి చూస్తున్నారు. దాడులపై ఫిర్యాదులు కూడా తీసుకోవడం లేదు.

Published : 02 May 2024 03:44 IST

తెదేపా అభ్యర్థులు, కార్యకర్తలపై వైకాపా దాడులు
పట్టించుకోని అధికారులు

ఈనాడు డిజిటల్‌, అనంతపురం: ఎన్నికల సమయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన కొందరు పోలీసు అధికారులు అధికార పార్టీ సేవలో తరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో తెదేపా అభ్యర్థులు, కార్యకర్తలపై వైకాపా శ్రేణులు దాడులకు తెగపడుతున్నా కళ్లప్పగించి చూస్తున్నారు. దాడులపై ఫిర్యాదులు కూడా తీసుకోవడం లేదు. గట్టిగా నిలదీస్తే మాత్రం హెచ్చరికలు జారీ చేశామంటూ బదులిస్తున్నారు. అదే వైకాపా నాయకులు తెదేపా వారిపై ఇస్తున్న ఫిర్యాదులపై ఆగమేఘాలపై స్పందిస్తున్నారు. ఏకంగా తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని కొందరు పోలీసులు వైకాపాకు కొమ్ము కాస్తూ ఎన్నికల్లో ఆ పార్టీకి లబ్ధి చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. తెదేపా నాయకుల ప్రచారాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. వీరిపై అటు ఎన్నికల అధికారులు, ఇటు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నా స్పందన లేదు.

ప్రతిపక్షాలకే నిబంధనలు

ఎన్నికల నియమావళిని పక్కాగా అమలు చేయాల్సిన అధికారులు..కేవలం ప్రతిపక్షం నాయకులకు మాత్రం నిబంధనలు విధిస్తున్నారు. కేసులు నమోదు చేస్తున్నారు. అదే వైకాపా అభ్యర్థులు, నాయకులు ఉల్లంఘనలకు పాల్పడుతున్నా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. తెదేపా అభ్యర్థుల వెంటే ఉంటూ ఆంక్షలు విధిస్తున్నారు. పలుగ్రామాల్లో ప్రచారం చేసుకోవడానికి అనుమతులు ఇవ్వడానికీ జాప్యం చేస్తున్నారు. వైకాపా నాయకులు ప్రచారంలో ప్రలోభాలకు తెరతీస్తున్నా అటువైపు కన్నెత్తి చూడటం లేదు. తెదేపా నాయకులు వెళ్లే వాహనాలను లక్ష్యంగా చేసుకుని ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో వైకాపా నాయకులు తెదేపా కార్యకర్తలపై దాడులకు తెగపడుతున్నా.. బాధితులపైనే కేసులు పెడుతున్నారు.

బెదిరింపులకు పాల్పడుతూ..

అనంతపురం సబ్‌ డివిజన్‌ పరిధిలోని ఓ అధికారి వైకాపా కోసం పనిచేస్తున్నారు. వైకాపా విధేయుడిగా పేరుతెచ్చుకున్న సదరు అధికారి తెదేపా అభ్యర్థులే లక్ష్యంగా చేసుకున్నారు. నగరంలోని తెదేపా ద్వితీయశ్రేణి నాయకులను వైకాపాలో చేరాలని బెదిరింపులకు గురిచేస్తున్నారు. వైకాపా నాయకులు చేస్తున్న ప్రలోభాలకు తనవంతు సహకారం అందిస్తున్నారు. ఆయన తీరుపై తెదేపా నాయకులు పదేపదే ఫిర్యాదు చేస్తున్నా  ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.

సవాళ్లు విసురుతూ..

ఇటుకలపల్లి సర్కిల్‌ పరిధిలో పనిచేస్తున్న అధికారి ఉద్దేశపూర్వకంగానే తెదేపా నాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తెదేపాకు ఏజెంట్‌లు లేకుండా చేస్తానని బహిరంగంగానే సవాళ్లు విసురుతున్నారు. ఇటీవల ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో ప్రజాప్రతినిధి సోదరుడు తెదేపా నాయకులపై దాడికి తెగపడ్డాడు. వైకాపా కోసం పనిచేయకపోతే నరుకుతానంటూ బెదిరించాడు. దీనిపై సదరు పోలీసు అధికారికి సమాచారం ఇచ్చినా స్పందించలేదు. ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదు. కనగానపల్లిలోనూ ఇలాంటి ఘటనే జరిగినా ఉన్నతాధికారులు కనీసం ఫిర్యాదు కూడా తీసుకోవడం లేదని తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు.

పగబట్టారు..

పుట్టపర్తి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూరరెడ్డిపై స్థానిక పోలీసులు పగబట్టారు. ఆమె ప్రచారానికి వైకాపా నాయకులు అడ్డంకులు సృష్టిస్తున్నా నియంత్రించే ప్రయత్నం చేయడం లేదు. ఇటీవల ఆమె కాన్వాయ్‌పై రాళ్లతో దాడి చేసినా ఇప్పటివరకు బాధ్యులపై కేసు నమోదు చేయలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని