logo

భక్తుల కష్టాలు ఖాద్రీశుడికే ఎరుక!

శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి భక్తులకు కనీస మౌలిక వసతుల కల్పన, పర్యవేక్షణలో నిర్లక్ష్యం ఆవహించింది. పుణ్యక్షేత్రంగా కదిరి ఆలయానికి వేలాది మంది వచ్చే దర్శన భక్తులకు తగిన సదుపాయాలు కలగక అవస్థలతో ప్రశాంత దర్శన భాగ్యం పొందలేకున్నారు.

Published : 18 May 2024 04:00 IST

నిరుపయోగంగా మరుగుదొడ్లు, స్నానాల గదులు 

కదిరి, న్యూస్‌టుడే : శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి భక్తులకు కనీస మౌలిక వసతుల కల్పన, పర్యవేక్షణలో నిర్లక్ష్యం ఆవహించింది. పుణ్యక్షేత్రంగా కదిరి ఆలయానికి వేలాది మంది వచ్చే దర్శన భక్తులకు తగిన సదుపాయాలు కలగక అవస్థలతో ప్రశాంత దర్శన భాగ్యం పొందలేకున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక భక్తులు సాధారణ రోజుల్లో 2, 3 వేలు, శని, ఆదివారం, సెలవులు, పర్వదినాల్లో 30 వేల మందిదాకా దర్శించుకుంటారు. బయట నుంచే భక్తులకు కల్పించాల్సిన వసతులపై నిర్లక్ష్యం, నిర్వహణపై ఆలయ అధికారుల పర్యవేక్షణ లోపంతో దర్శన భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రధానంగా వాహనాల పార్కింగ్, స్నానాలు, దర్శన మార్గంలో రద్దీ వంటి భక్తుల కష్టాలు భగవంతునికే ఎరుక అన్న చందంగా మారాయి. సదుపాయం ఉన్నా నిర్వహణ అధ్వానంగా మారిందని భక్తులు వాపోతున్నారు. భక్తుల కష్టాలు భగవంతుడే తీర్చాలని మొరపెట్టుకుంటున్నారు..

కనీస వసతులేవీ..?

ఖాద్రీశుని దర్శనానికి వచ్చే సాధారణ భక్తులకు అత్యవసరాలు, స్నానాలు, దుస్తులు మార్చుకునేందుకు సదుపాయాలు ఉన్నాయి. వాటి నిర్వహణ లోపమే వినియోగానికి కష్టంగా మారింది. కోనేరుకు ఎదురుగా ఉన్న ఉద్యానవన స్థలంలో రెండు కంటైనర్‌ మరుగుదొడ్లు, స్నానాల గదులు పర్యాటక శాఖ గతంలో ఏర్పాటు చేసింది. దెబ్బతిన్న వాటిని వినియోగంలోకి తెచ్చేందుకు తిరునాళ్ల సందర్భంగా రూ.4.50 లక్షలతో మరమ్మతులకు ప్రతిపాదించారు. పనులు పూర్తయినా ప్రారంభించకపోవడంతో భక్తులకు ఉపయోగపడటం లేదు. చలపతినాయుని సత్రం మహిళలు, పురుషులకు పదేసి చొప్పున స్నానాలు, మరుగుదొడ్లు ఉన్నాయి. భక్తుల రద్దీ ఉండే శని, ఆదివారాల్లో అవి చాలటంలేదు. సామాన్య మహిళా భక్తులకు దుస్తులు మార్చుకునేందుకు సత్రంలో నిర్మించిన రేకులషెడ్డు నిర్వహణ లేక వినియోగించుకునేందుకు ఇష్టపడటం లేదు.

వాహనాలు ఎక్కడ నిలపాలి?

ఆలయానికి వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్‌ ప్రధాన సమస్యగా మారింది. పార్కింగ్‌ నిర్వహణకు ఏటా రూ.12.32 లక్షల ఆదాయం ఉంది. ఇందుకు టి.టి.డి. కల్యాణ మండలం, ఉద్యానవన ఖాళీస్థలం, చలపతినాయుని సత్రంలో స్థలం ఉన్నా పార్కింగ్‌ ఇష్టారాజ్యానికి వదిలేశారు. వాహన దారుల నుంచి ద్విచక్ర వాహనాలకు రూ.10, కార్లకు రూ.40, బస్సులకు రూ.60 చొప్పున వసూలుకు నిర్ణయించారు. అయితే అందుకు సరైన స్థలమే కరవైంది. దీంతో భక్తులు చలపతినాయుని సత్రం, కోనేరు ప్రాంతంలోని రోడ్డులోని కాలిబాటపైనే నిలుపుతున్నారు. ఫలితంగా చోదకులు పోలీసులు ఆక్షేపణ, చీవాట్లు పడాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో అపరాధమూ చెల్లించాల్సి వస్తోంది. పార్కింగ్‌ రుసుం చెల్లించినా కష్టాలు తప్పలేదని వాహనాలతో వచ్చిన భక్తులు ఆవేదన చెందుతున్నారు. దేవాలయం వీధిలోకి వాహనాలను అనుమతిస్తున్నారు. దీంతో రాకపోకలకు కష్టాలతో అవస్థల దర్శనం తప్పలేదని భక్తులు వాపోతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని