logo

ఇసుకాసురుల ఆగడాలు ఆగేనా?

ఐదేళ్లపాటు ఉమ్మడి జిల్లాలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగింది. నిబంధనలను లెక్కచేయకుండా వైకాపా నాయకులు రెచ్చిపోయారు. అధికారం వారి చేతుల్లో ఉండటంతో అధికారులు సైతం అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.

Published : 18 May 2024 06:06 IST

యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు 
ఐదేళ్లుగా సొమ్ము చేసుకున్న వైకాపా నాయకులు
సుప్రీంకోర్టు ఆదేశాలతో అధికారుల్లో కదలిక వచ్చేనా? 

పెద్దపప్పూరు సమీపంలోని పెన్నానదిలో భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు (పాతచిత్రం) 

ఐదేళ్లపాటు ఉమ్మడి జిల్లాలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగింది. నిబంధనలను లెక్కచేయకుండా వైకాపా నాయకులు రెచ్చిపోయారు. అధికారం వారి చేతుల్లో ఉండటంతో అధికారులు సైతం అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. పైగా కొందరు ఉన్నతాధికారులు సహకరించారు. తవ్వకాలే జరగడం లేదంటూ కోర్టులను సైతం పక్కదారి పట్టించారు. ఇన్నాళ్లకు వారి పాపం పండే సమయం దగ్గర పడింది. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాల నిగ్గు తేల్చేందుకు ఏకంగా సుప్రీంకోర్టు నడుం బిగించింది. ప్రతి జిల్లాకు కమిటీని నియమించి.. అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. 

ఈనాడు డిజిటల్, అనంతపురం: ప్రభుత్వ అనుమతి ఉన్న రీచుల్లో సైతం భారీ యంత్రాలతో ఇసుక తవ్వడానికి వీల్లేదు. కొందరు వైకాపా నాయకులు వాటిని లెక్కచేయలేదు. నదుల్లో ఎక్కడ పడితే అక్కడ భారీ యంత్రాలతో తవ్వకాలు జరిపారు. అనుమతి లేని ప్రాంతాల్లోనూ పొక్లెయిన్లు పెట్టి దోపిడీ సాగించి నదుల్ని నామరూపాల్లేకుండా చేశారు. వాస్తవానికి ఇసుక రీచుల్లో సెమీ మెకనైజ్‌ విధానంలోనూ ఇసుక తవ్వకూడదనే నిబంధనలు ఉన్నాయి. వైకాపా నాయకులు అన్ని నియోజకవర్గాల పరిధిలో యంత్రాలతో ఇసుకను తోడేశారు. నదీగర్భాలకు తూట్లు పొడిచి జేబులు నింపుకొన్నారు. రోజుకు వందలాది టిప్పర్ల ద్వారా వేలాది టన్నుల ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలించారు. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే దందా సాగించడంతో అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు. తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలతో అవినీతి అధికారుల్లో భయం మొదలైంది.

సబ్‌కాంట్రాక్టు పేరుతో..

రాష్ట్రంలో ఇసుక తవ్వకాలను జేపీ పవర్‌ వెంచర్స్‌ సంస్థకు అనుమతులిచ్చారు. అన్ని చోట్ల సదరు సంస్థ సబ్‌ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఓ వైకాపా మాజీ ప్రజాప్రతినిధి సంస్థకు సబ్‌లీజుకు ఇచ్చారు. ఇక్కడి రీచులపై సదరు ప్రజాప్రతినిధి గుత్తాధిపత్యం చెలాయించారు. రాత్రి పగలు తేడా లేకుండా తవ్వకాలు జరిపారు. నిబంధనల మేరకు స్టాక్‌ పాయింట్ల ద్వారా మాత్రమే ఇసుక విక్రయించాల్సి ఉండగా.. నేరుగా రీచుల్లోనే వ్యాపారం నిర్వహించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే రెండు రెట్లు వసూలు చేశారు. దళారీ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని దందా సాగించారు. పరిమితికి మించి తవ్వకాలు జరపడంతో పెన్నా, చిత్రావతి, వేదవతి, జయమంగళ నదులు గోతులమయంగా మారాయి. వరదల సమయంలో గోతులు నిండటంతో వాటిలో పడి చాలామంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. పెద్దపప్పూరు సమీపంలో అనుమతులు లేకుండానే తవ్వకాలు జరిపారు. ప్రతిపక్షాలు ఫిర్యాదు చేసినా  అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. 

ఏడు రీచులు...

రాష్ట్రంలోని 110 ఇసుక రీచుల్లో సెమీ మెకనైజ్‌ విధానంలో ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని గతేడాది ఏప్రిల్‌ 24న రాష్ట్రస్థాయి పర్యావరణ ప్రభావ మదింపు సంస్థ(సీయా) ఉత్తర్వులు జారీ చేసింది. పర్యావరణ అనుమతులు తీసుకోకుండా రీచుల్లో ఇసుక తవ్వకాలు చేపట్టకూడదని ఆదేశాలిచ్చింది. ఆ జాబితాలో ఉమ్మడి జిల్లాలోని ఏడు రీచులను చేర్చారు. సీసీరేవు, ఉప్పలపాడు, లక్షుంపల్లి, జుంజురాంపల్లి ఇసుక తవ్వకాలపై నిషేధం ఉన్నా పట్టించుకోలేదు. సీయా ఆదేశాలు భేఖాతరు చేసి ఆయా రీచుల్లో ఇసుక అక్రమ రవాణా కొనసాగించారు. పెద్దపప్పూరు ప్రాంతంలో అనుమతులు లేకుండా నెల రోజుల పాటు తవ్వకాలు జరిపారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే పెద్దపప్పూరులో రూ.1.50 కోట్ల విలువైన ఇసుకను అక్రమంగా తవ్వారని అధికారులు నివేదికలు అందించారు. అయినా ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 

కమిటీలపై కసరత్తు 

రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ మైనింగ్‌ను అరికట్టేందుకు జిల్లా కలెక్టర్, పోలీసు అధికారులతో పాటు ఇతర అధికారులు ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో కమిటీల ఏర్పాటుకు కలెక్టర్లు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా సంబంధిత విభాగాలతో సమావేశం ఏర్పాటు చేసుకుని ఎక్కడికక్కడ అక్రమ తవ్వకాలు జరిగాయో నివేదికలు తెప్పించుకునే పనిలో జిల్లాల కలెక్టర్లు నిమగ్నమైనట్లు సమాచారం.

ఉల్లంఘనలపై ఉదాసీనత

ఉమ్మడి జిల్లాలోని పెన్నా, చిత్రావతి, వేదవతి నదుల్లో ఇసుక రీచులకు అధికారులు అనుమతులు ఇచ్చారు. యల్లనూరు మండలంలోని లక్షుంపల్లి, రాయదుర్గం పరిధిలోని జుంజురాంపల్లి, పెద్దపప్పూరు, ఉప్పలపాడు, సీసీరేవు తదితర ప్రాంతాల్లో రీచులకు అనుమతులు ఉన్నా తవ్వకాల్లో ఎక్కడా నిబంధనలు పాటించలేదు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కాకుండా అదనంగా రూ.300 నుంచి రూ.500 వరకు వసూలు చేశారు. జేపీ పవర్‌ వెంచర్స్‌ పేరుతో కాకుండా సంబంధం లేని కంపెనీల పేరుతో రశీదులు ఇచ్చి.. అసలు లెక్క లేకుండా చేశారు. ప్రతిరోజూ తవ్వకాలపై అధికారులకు వివరాలు ఇవ్వాల్సి ఉండగా 10 రోజులకు ఒకసారి కూడా అందించలేదు. రాత్రి సమయాల్లోనూ టిప్పర్ల ద్వారా అక్రమ రవాణా కొనసాగించారు. మరోవైపు నదీగర్భంలో వాహనాల రాకపోకల కోసం భారీ కట్టలు నిర్మించారు. నిబంధనల ప్రకారం 3 అడుగులు మాత్రమే తవ్వాల్సి ఉండగా.. దాదాపు అన్ని రీచుల్లో 20 నుంచి 30 అడుగుల లోతుకు తవ్వేశారు. దీనివల్ల నదీ ప్రవాహాల వేగం, దిశ మారిపోతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని