logo

జగన్‌ తిలోద‘కౌలు’

‘ఒక్క అవకాశం ఇవ్వండి.. కౌలుదారీ చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి రైతులు నష్టపోకుండా ఆదుకుంటాం. కౌలురైతులకు గుర్తింపు కార్డులిచ్చి బ్యాంకుల ద్వారా వడ్డీలేని రుణాలు అందేలా చేస్తాం’.

Updated : 24 Apr 2024 04:54 IST

చట్టానికి తూట్లు.. కార్డులు హుళక్కే
ప్రభుత్వ సాయం పూజ్యం
అప్పుల ఊబిలో అన్నదాతలు

‘ఒక్క అవకాశం ఇవ్వండి.. కౌలుదారీ చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి రైతులు నష్టపోకుండా ఆదుకుంటాం. కౌలురైతులకు గుర్తింపు కార్డులిచ్చి బ్యాంకుల ద్వారా వడ్డీలేని రుణాలు అందేలా చేస్తాం’.

  ప్రతిపక్షంలో జగన్‌ హామీ

 జగన్‌ అధికారంలోకి రాగానే మాట తప్పారు. ఐదేళ్ల పాలనలో వ్యవసాయమే ఆధారంగా బతికే కౌలురైతుల నడ్డివిరిచారు. హామీలకు తిలోద‘కౌలు’ ఇచ్చారు.  సాయం అందించలేదు. పైసా విదల్చలేదు. ఏపీ క్రాప్‌ కల్టీవేటర్స్‌ రైట్‌ యాక్ట్‌ 2019 చేసినా దీనిని పక్కకు నెట్టేశారు. సీసీఆర్‌సీ పంపిణీకే పరిమితమయ్యారు. రుణ మంజూరులో బ్యాంకులు మొండి చేయి  చూపుతున్నా పట్టించుకోలేదు. దీంతో వారంతా పంట పెట్టుబడి నిమిత్తం అధిక వడ్డీలకు ప్రైవేటు వ్యాపారుల నుంచి రుణాలు తీసుకొని అప్పుల ఊబిలో కూరుకుపోయారు.

చిత్తూరు(మిట్టూరు), శ్రీకాళహస్తి, నాయుడుపేట, వెంకటగిరి, గూడూరు, న్యూస్‌టుడే: జిల్లాలో 60 వేల మంది కౌలు రైతులుండగా.. గతేడాది 11 నెలల కాలపరిమితితో 5 వేల మందికి మాత్రమే కార్డులు మంజూరు చేశారు. వరి, పప్పులు, మిర్చి, వేరుసెనగ ఉద్యాన పంటలు కౌలు సాగులో ఉన్నాయి. మామిడి తోటలు సాగు చేస్తున్న వారు అధికంగానే ఉన్నారు. వీరికి ఏటా రూ.4.25 కోట్లకుపైగా రుణ లక్ష్యం కాగా.. ఇచ్చింది రూ.1.80 కోట్లకు మించి లేదు. రైతుమిత్ర బృందాలదీ ఇదే పరిస్థితి. వీరికి వేల సంఖ్యలో రుణాలు ఇవ్వాల్సి ఉన్నా.. వందల్లో ఇచ్చి చేతులు దులుపుకొంది జగన్‌ సర్కారు. 2,500 బృందాలకు గానూ రూ.2.50 కోట్ల రుణాలు మాత్రమే ఇచ్చింది.

జీవో 252కి దిక్కులేదు..  

సహకార, సొసైటీల ద్వారా రైతుమిత్ర బృందాలకు రుణాలు ఇవ్వాలని 2022న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చినా వాటిని పట్టించుకున్న పరిస్థితి లేదు. వ్యవసాయ రుణాలు, కౌలు రైతులకు ఇచ్చే రుణాల్లో స్వల్పకాలిక రుణాలు మాత్రం అరకొరగా ఇస్తున్నారు. దీర్ఘ, మధ్యకాలిక రుణాలు దక్కడం లేదు. వ్యవసాయ రాయితీలు అందడం లేదు. పెట్టుబడి కోసం రూ.లక్ష వరకు రాయితీ ఇవ్వాల్సి ఉన్నా కౌలు రైతులకు ఏడు శాతం వడ్డీ పడుతోంది. ఐదేళ్లలో కౌలు వదులుకున్న రైతులు పెద్దఎత్తున ఉన్నారు. ఏటా పంటల సాగుకు దూరమవుతున్న వారి సంఖ్య వేలల్లోనే ఉంది. వీరికి గిట్టుబాటు కాని సేద్యం, ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవడంతో వారంతా అప్పుల ఊబిలో చిక్కుకోవడం బయట పడుతోంది.

విత్తన రాయితీలు సున్నా.. కౌలు రైతులకు విత్తనాలు రాయితీపై పంపిణీ చేపట్టడం లేదు. గతేడాది వరదలకు వరి, వేరుసెనగ, మిరప పంటలు దెబ్బతిన్నా నారుమళ్లు దెబ్బతిన్నా 80 శాతం రాయి తీ విత్తులిచ్చిన వారిని వేళ్లమీద లెక్కించొచ్చు.

రైతు భరోసా వేళ్ల మీద లెక్కించాల్సిందే.. : వ్యవసాయ అవసరాల కోసం అందించే వార్షిక పెట్టుబడి సాయం అందడంలేదు. కేంద్రం పీఎం కిసాన్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న రైతు భరోసా ఇస్తోంది కొందరికే. కౌలు కార్డులు పట్టుకుని రైతు భరోసా, ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరిగినా పట్టించుకునే పరిస్థితి లేదు. వీరికి సున్నా వడ్డీ, బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ, రాయితీ విత్తనం, ఫామ్‌ మెకనైజేషన్‌ వంటివి అమలు చేయాల్సి ఉంది. ఇవి కాకుండా మద్దతు ధర వీరికి అందించే చర్యలు తీసుకోవాల్సి ఉంది.

రూ.3 లక్షల నష్టం  

పెళ్లకూరు మండలం సీఎన్‌పేటలో ఏడు ఎకరాల్లో కౌలుకు పుచ్చసాగు చేశాం. రూ.3.50 లక్షలు పెట్టుబడి పెట్టాం. తెగుళ్లు, కాయ ఎదుగుదల లేకపోవడంతో కాయ రూ.3-4కు విక్రయిస్తే రూ.50 వేలు రాగా.. రూ.3 లక్షల మేర నష్టం వచ్చింది. కౌలు చెల్లించలేని దుస్థితి ఏర్పడింది.

 రామకృష్ణయ్య, రైతు, తాళ్వాయపాడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని