logo

భరత్‌ నామినేషన్‌ ర్యాలీకి పక్క రాష్ట్రాల జనం

కుప్పంలో వైకాపా అభ్యర్థి భరత్‌ నామినేషన్‌ ర్యాలీకి బుధవారం రాష్ట్ర సరిహద్దుకు సమీపంలోని తమిళనాడు, కర్ణాటక గ్రామాల నుంచి భారీఎత్తున జన సమీకరణ చేయడం చర్చనీయాంశమైంది.

Published : 25 Apr 2024 03:39 IST

సమీకరణకు వైకాపా నాయకుల కష్టాలు

వాహనంలో వచ్చిన మహిళలు, డబ్బులు పంచుతున్న పూర్వ వాలంటీర్లు

కుప్పం పట్టణం, కుప్పం గ్రామీణ, న్యూస్‌టుడే: కుప్పంలో వైకాపా అభ్యర్థి భరత్‌ నామినేషన్‌ ర్యాలీకి బుధవారం రాష్ట్ర సరిహద్దుకు సమీపంలోని తమిళనాడు, కర్ణాటక గ్రామాల నుంచి భారీఎత్తున జన సమీకరణ చేయడం చర్చనీయాంశమైంది. ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాలు, ప్రైవేటు పాఠశాలల బస్సులు, ఆటోల్లో వారిని కుప్పానికి తరలించారు. ర్యాలీలో పాల్గొన్న తర్వాత వారంతా నాయకులిచ్చే డబ్బుల కోసం వేచి చూశారు. బిర్యానీ పొట్లాల కోసం క్యూ కట్టారు. వారికి పైబాట, క్రిష్ణగిరి కూడలి, దళవాయికొత్తపల్లె చెరువు, విజలాపురం కూడలి వద్ద షామియానాలు వేసి బిర్యానీ పొట్లాలు పంచారు. పట్టణంలోని ఆర్‌డబ్ల్యూఎస్‌ కార్యాలయం, సచివాలయం-4 వద్ద, కుప్పం రామచంద్రా రోడ్డులోని మసీదుకు సమీపంలో ఒక్కొక్కరికి రూ.500 చొప్పున నగదు పంపిణీ చేయడం కనిపించింది. ర్యాలీకి పిలిచేటప్పుడు ఓ రేటు చెప్పి.. తీరా తక్కువ ఇచ్చారని పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. కుప్పానికి చెందిన వారిని ర్యాలీకి రప్పించేందుకు వైకాపా నాయకులు, మాజీ వాలంటీర్లు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆర్వో కార్యాలయంలో నామపత్రాలు దాఖలు చేసిన తర్వాత భరత్‌ విలేకర్లతో మాట్లాడారు. ఇతర రాష్ట్రాల నుంచి జన సమీకరణ చేసినట్లు నిరూపిస్తే నామినేషన్‌ను ఉపసంహరించుకుంటానని సవాలు చేశారు.  తప్పుకప్పిపుచ్చుకునేందుకు వైకాపా నాయకులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం విశేషం.  

  • ఉపాధి హామీ సిబ్బంది స్వామి భక్తిని చాటుకున్నారు. కొటాలూరు పంచాయతీలో స్థానిక ఉపాధి కూలీలకు సెలవు ప్రకటించారు.

నిబంధనలకు విరుద్ధంగా ఎగిరిన డ్రోన్‌

భరత్‌ నామపత్రాల ర్యాలీ సందర్భంగా వైకాపా నాయకులు  అనుమతి లేకుండా డ్రోన్‌ ఎగురవేసి ర్యాలీని చిత్రీకరించారు. రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంపైనా డ్రోన్‌ ఎగిరింది. పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.  ఆర్వో శ్రీనివాసులు వివరణ కోరగా ఘటనపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఆయన వివరించారు. ః కుప్పంలోని ఆర్వో కార్యాలయం లోపలకు సోమవారం ఎమ్మెల్సీ భరత్‌ వాహనాలు వెళ్లిన ఘటనపై స్థానిక డీఎస్పీ శ్రీనాథ్‌ ఉన్నతాధికారులకు నివేదిక అందించారు. మొత్తం వ్యవహారానికి అక్కడున్న ముగ్గురు పోలీసు సిబ్బంది కారణమని నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. నివేదికను ఉన్నతాధికారులు ఎన్నికల సంఘానికి నివేదించనున్నారని సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని