logo

మాటలే తీపి.. లబ్ధిదారులకు టోపీ

పేదలకు చేదు మిగిల్చిన ఘనత జగనన్న పాలనకే దక్కుతుంది.. బియ్యం కార్డుదారులకు ఇంటికే అన్ని రకాల నిత్యావసరాలు అందజేస్తున్నామంటూ ఆర్భాటపు ప్రకటనలు తప్ప క్షేత్రస్థాయిలో భిన్న పరిస్థితులు ఉన్నాయి.

Published : 29 Apr 2024 03:35 IST

 కార్డుదారులకు అరకొరగా చక్కెర
 పేదలపై అదనపు భారం మోపిన జగన్‌ సర్కారు

 న్యూస్‌టుడే, చిత్తూరు(మిట్టూరు) : పేదలకు చేదు మిగిల్చిన ఘనత జగనన్న పాలనకే దక్కుతుంది.. బియ్యం కార్డుదారులకు ఇంటికే అన్ని రకాల నిత్యావసరాలు అందజేస్తున్నామంటూ ఆర్భాటపు ప్రకటనలు తప్ప క్షేత్రస్థాయిలో భిన్న పరిస్థితులు ఉన్నాయి. అన్ని రకాల సరకులకు కోత పెట్టి.. ఒక్క బియ్యం పంపిణీకి పరిమితమవుతోంది.. ప్రతి నెలా అందరికీ తీపి పంచాల్సిన చక్కెరను అరకొరగా అందజేసి చేదు మిగల్చడం జగనన్న పాలన ప్రత్యేకం.. తెదేపా పాలనలో కార్డుదారులకు బియ్యం, కందిపప్పు, చక్కెర, గోధుమపిండి అందజేశారు.. వైకాపా అధికారంలోకి రాగానే వాటన్నిటిలో కోత పెట్టి తాజాగా పూర్తిగా నిలిపేశారు.. ఓవైపు బహిరంగ మార్కెట్లో ధరలు మండిపోతున్నాయి.. మరోవైపు ప్రభుత్వం రాయితీపై అందించే సరకులు సైతం అందక సామాన్యులు బతుకుబండి నెట్టుకొచ్చేందుకు అల్లాడిపోతున్నారు.

తెదేపా పాలనలో..

2014-19 వరకు తెదేపా పాలనలో చౌకధరల దుకాణాల్లో బియ్యం, కందిపప్పు, చక్కెర, గోధుమపిండి తదితర సరకులు అందజేశారు. దీపావళి, ఉగాది, వినాయక చవితి, రంజాన్‌, క్రిస్మస్‌ పర్వదినాల్లో అదనపు సరకులతో పాటు చక్కెర అదనంగా పంపిణీ చేశారు.

వైకాపా ప్రభుత్వం వచ్చాక..

పండగలకు అందజేసే అదనపు చక్కెర, సరకుల పంపిణీ పూర్తిగా ఆపేశారు. లబ్ధిదారులకు ఇచ్చే అర కిలో రూ.17 చక్కెరను అరకొరగా అందజేస్తున్నారు. కొన్ని నెలలుగా పూర్తిస్థాయిలో కార్డుదారులకు ఇది అందడం లేదు.

ప్రస్తుత పరిస్థితి..

బహిరంగ మార్కెట్లో కిలో చక్కెర రూ.43-45గా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సరఫరా నిలిపివేయడంతో ప్రతి కార్డుదారుడిపై అర కిలో చక్కెరపై రూ.5.50 పైసలు అదనపు భారం పడుతోంది.

అస్తవ్యస్తంగా పంపిణీ..

ఇంటింటికీ బియ్యం అందిస్తున్నామని ప్రభుత్వం గొప్పగా ప్రకటిస్తున్నా పంపిణీ తీరుపై ప్రజల్లో అసంతృప్తి ఉంది. ఎండీయూ వాహనం వల్ల ఇబ్బందులు పడుతున్నామని పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు. చక్కెర ఎందుకు ఇవ్వడం లేదంటూ ఆపరేటర్లతో వాగ్వాదానికి దిగుతున్నారు. తెదేపా ప్రభుత్వం పండుగలకు అదనంగా చక్కెర ఇచ్చేదని, ప్రస్తుత ప్రభుత్వం దీన్ని రద్దు చేసిందని ఆరోపిస్తున్నారు. వైకాపా పాలనలో తీపి కరవైందని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  •  జిల్లాలో బియ్యం కార్డులు: 5,43,202
  •  చౌక దుకాణాలు: 1,379
  •  ఎండీయూ వాహనాలు: 336

దర్జాగా ఎగ్గొట్టేశారు..

జిల్లా వ్యాప్తంగా 5.43లక్షల కార్డులు ఉన్నాయి. ఆయా లబ్ధిదారులకు ప్రభుత్వం సక్రమంగా చక్కెర సరఫరా చేయడం లేదు. 15 నెలలుగా జిల్లాకు 2,518 టన్నులు సరఫరా చేయాల్సి ఉండగా.. 2,064 టన్నులు మాత్రమే అందజేశారు. మిగిలిన 447 టన్నులతో పాటు అదనపు కోటా ఎగ్గొట్టేశారు. దీంతో లబ్ధిదారులకు రాయితీపై సరకు అందకపోవడంతో బహిరంగ మార్కెట్‌లో కొనుగోలతో ఆర్థిక భారం తప్పడం లేదని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరకొర పంపిణీతో ఐదేళ్లలో కోట్లాది రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మిగుల్చుకుంది. ఈ మొత్తాన్ని పేదలపై ఆర్థిక భారాన్ని మోపింది.

​​​​​​​

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని