logo

వేసవిలో తాగనీటి ఎక్కిళ్లు

వేసవిలో తాగునీటి ఎద్దడి ఎక్కువైంది. గ్రామీణ ప్రాంతాల్లో గుక్కెడు నీటికి కష్టమవుతోంది. అటు పంచాయతీ తాగునీటి పథకాలతో పాటు ఇతర పథకాలు దెబ్బతిన్నా సర్పంచులు వాటిని బాగు చేసే పరిస్థితులు లేవు.

Published : 15 May 2024 03:15 IST

రోడ్డెక్కుతున్న గ్రామీణ జనం
ముందు చూపులేని పాలకులు
శాశ్వత నీటి పథకాలకు గ్రహణం

గూడూరు, న్యూస్‌టుడే: వేసవిలో తాగునీటి ఎద్దడి ఎక్కువైంది. గ్రామీణ ప్రాంతాల్లో గుక్కెడు నీటికి కష్టమవుతోంది. అటు పంచాయతీ తాగునీటి పథకాలతో పాటు ఇతర పథకాలు దెబ్బతిన్నా సర్పంచులు వాటిని బాగు చేసే పరిస్థితులు లేవు. దీంతో వేసవిలో మోటార్‌లు కాలిపోయినా పట్టించుకునే వారు కరవయ్యారు.

జిల్లాలోని 970 గ్రామాల్లో పీడబ్ల్యూఎస్‌ 3,194, బోర్‌వెల్స్‌ 5,894 వరకు ఉన్నాయి. వీటి ద్వారా సరిపడా నీటి సరఫరా చేయడంలేదు. ఇవి తాత్కాలిక పథకాలు కాగా.. వేసవి ముందే బోర్లు అడుగంటి నీరు వచ్చే పరిస్థితి  లేదు. ఎక్కువ గ్రామాల్లో ఉన్న చేతి బోర్లు దెబ్బతిని మూలన చేరాయి. తీర ప్రాంతాల్లోని వాకాడు, చిల్లకూరు, కోట, తడ తదితర గ్రామాల్లో ఇంకా శాశ్వత నీటి పథకాలు అందుబాటులోకి రాలేదు.  

నందిమాలో నీరు అందించని ట్యాంకు

బోరు బావులే దిక్కు.. కేవీబీపురం మండలం కండ్లూరు గ్రామంలో తాగునీటి సరఫరా చేసే పరిస్థితి లేదు. ఇక్కడ ఇటీవల నీటి పథకం మంజూరు చేసినా ఆ నీటిని తాగలేని ఇక్కడ వారంతా పంట పొలాల్లోని బోరు బావుల నుంచి నీటిని తెచ్చుకోవాల్సి వస్తోంది. వేసవిలో ఆ బోర్లు వేసే పరిస్థితి లేక కొనాల్సి వస్తోంది. ఏటా ఇదే తీరుగా నీటి కోసం జనం అల్లాడుతున్నారు.

విన్నవించినా పట్టించుకోరు.. చిట్టమూరు మండలం మల్లాం ఎస్సీ కాలనీలో నీటి కోసం జనం రోడ్డెక్కారు. ఇక్కడ శాశ్వత నీటి పథకాలు మంజూరు చేయక, ఉన్న బోర్లు బాగు చేయకపోవడంతో తాగునీటి ఎద్దడి నెలకొంది. ఇక్కడ ఎస్సీ అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా పట్టించుకోకపోవడంతో ఇటీవల రోడ్డుపై బైఠాయించారు.

ట్యాంకర్లతో అందిస్తూ.. పెళ్లకూరు మండలం ఆర్లపాడు ఎస్సీ కాలనీలో తాగునీటి ఇబ్బందులున్నాయి. పథకం తరచూ మొరాయిస్తోంది. ఇక్కడికి ట్యాంకర్ల ద్వారా నీటిని అందించే పరిస్థితులు ఏర్పడ్డాయి. అర్ధమాల ఓహెచ్‌ఆర్‌కి అనుసంధానంగా జల్‌జీవన్‌ ద్వారా గొట్టపు మార్గం, బోరు ఇటీవల వేయించారు. వేసిన బోరు ట్యాంకుకి దూరం కావడంతో నీరు ఎక్కే పరిస్థితి లేదు. దీంతో ఇక్కడ నీటికి జనం అల్లాడుతున్నారు. రూ.25 లక్షలు వెచ్చించి నిర్మించిన పథకం నిరుపయోగంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని