logo

East Godavari: పెళ్లి జరగాల్సిన ఇంట పెను విషాదం

కుటుంబానికి చేదోడుగా ఉంటూ త్వరలో పెళ్లి పీటలెక్కాల్సిన యువకుడిని లారీ రూపంలో మృత్యువు కబళించింది. పశ్చిమగోదావరి జిల్లా మార్టేరు - అత్తిలి రాష్ట్ర రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాకు చెందిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

Updated : 05 Jul 2023 08:08 IST

లారీ ఢీకొని యువకుడి మృతి
 

వెంకట బసివిరెడ్డి (పాత చిత్రం)

మార్టేరు, రాయవరం, న్యూస్‌టుడే: కుటుంబానికి చేదోడుగా ఉంటూ త్వరలో పెళ్లి పీటలెక్కాల్సిన యువకుడిని లారీ రూపంలో మృత్యువు కబళించింది. పశ్చిమగోదావరి జిల్లా మార్టేరు - అత్తిలి రాష్ట్ర రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాకు చెందిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. దీనికి సంబంధించి పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాయవరం మండలం పసలపూడికి చెందిన పోతంశెట్టి వెంకట బసివిరెడ్డి(23) ద్విచక్ర వాహనంపై బ్రాహ్మణచెరువు వైపు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఫైనాన్స్‌ వ్యాపారం చేసే బసివిరెడ్డి గ్రామాల్లో డబ్బులు ఇచ్చి వసూలు చేస్తుంటాడు. ఈ క్రమంలో ఉదయం వసూళ్లకు వెళ్తుండగా ఆలమూరు శివారు భగ్గేశ్వరం డ్రెయిన్‌ వంతెన సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొని కొంత దూరం ఈడ్చుకుపోయింది. తలకు గాయం కావడంతో తీవ్ర రక్తస్రావమై కన్నుమూశాడు.   మృతుడి సోదరి ఎం.వి.రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు  ఎస్సై సురేంద్రకుమార్‌ తెలిపారు.

నెలక్రితం నిశ్చితార్ధం..

నెల రోజుల కిందటే బసివిరెడ్డికి నిశ్చితార్థమైంది. సెప్టెంబరు నెలలో వివాహం చేసేందుకు ముహూర్తం నిశ్చియించుకున్నారు. పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో వ్యాపార లావాదేవీల నిమిత్తం గ్రామాంతరం వెళ్లిన కుమారుడు తిరిగి రాని లోకాలకు చేరడంతో కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ద్విచక్ర వాహనంపై వెళ్లేటప్పుడు శిరస్త్రాణం తప్పక ధరించే వాడని, మంగళవారం లేకుండా వెళ్లాడని వారు కన్నీటి పర్యంతమయ్యారు. ఇంటి వారసుడైన ఒక్కగానొక్క కొడుకు దుర్మరణం చెందాడన్న చేదు నిజాన్ని జీర్జించుకోలేని మృతుడి తల్లిదండ్రులు సత్యనారాయణరెడ్డి, బుల్లెమ్మాయి, అక్కలు వెంకట రమాదేవి, లావణ్యలను సముదాయించడం ఎవరివల్లా కావడం లేదు.  పోస్టుమార్టం అనంతరం గ్రామానికి తీసుకొచ్చిన మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలించే సమయంలో స్నేహితులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. సౌమ్యుడైన బసివిరెడ్డి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


అమ్మా.. నాన్నేడంటే ఏమని చెప్పను..

దోనిపాటి రాజా (పాత చిత్రం)

ఉప్పలగుప్తం, ఐ.పోలవరం: తన కడుపులో ఉన్న బిడ్డ భూమ్మీదకు వచ్చిన తర్వాత అమ్మా నాన్నేడని అడిగితే ఏమని చెప్పాలంటూ భర్తను పోగొట్టుకున్న గర్భిణి రాణి రోదిస్తున్న తీరు కుటుంబసభ్యులతోపాలు చూపరులను కంటతడి పెట్టించిన ఘటన ఇది. బంధువులు, స్థానికుల వివరాల ప్రకారం.. ఉప్పలగుప్తం మండలంలోని ఎన్‌.కొత్తపల్లికి చెందిన దోనిపాటి రాజా(26) ముమ్మిడివరం మండలం అనాతవరంలో వెల్డింగ్‌ షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం ఉదయం రాజా పని నిమిత్తం ద్విచక్రవాహనంపై యానాం వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఐ.పోలవరం మండలం కొమరిగిరి వద్ద జాతీయ రహదారిపై అతని వాహనాన్ని ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ముమ్మిడివరం ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఐ.పోలవరం ఎస్సై రాజేష్‌ తెలిపారు.


స్టీరింగ్‌పైకి పాము.. పొలాల్లోకి దూసుకువెళ్లిన కారు

ముమ్మిడివరం: ముమ్మిడివరం మండలం గాడిలంక వద్ద రహదారిపై ప్రయాణిస్తున్న కారులో పాము కనిపించడంతో కలకలం రేగింది. దాంతో కారు అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకుపోయింది. స్థానికుల వివరాల ప్రకారం.. యానాం నుంచి ముగ్గురు వ్యక్తులు కారులో మంగళవారం మధ్యాహ్నం ముమ్మిడివరం మండలం కొత్తలంకలోని వలీబాబా దర్గాకు వెళ్తున్నారు. గాడిలంక వద్దకు చేరేటప్పటికి పాము స్టీరింగ్‌పైకి వచ్చింది. దాంతో డ్రైవర్‌ ఒక్కసారిగా భయభ్రాంతులకుగురై స్టీరింగ్‌ వదిలేశాడు. ఆ వెంటనే అదుపుతప్పి పక్కనేఉన్న పంట పొలాల్లోకి దూసుకుపోయింది. ఖాళీ చేలు కావడం, నిర్మానుష్యంగా ఉండడంతో కారులోని వ్యక్తులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. కారును స్థానికులు ట్రాక్టరు సాయంతో బయటకు తీశారు.


బస్సు ధ్వంసం ఘటనపై కేసులు

ధవళేశ్వరం, న్యూస్‌టుడే: ధవళేశ్వరం వడ్డెర కాలనీ సమీపంలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈశ్వరదుర్గ అనే ఏడేళ్ల బాలుడు మృతిచెందిన విషయం విదితమే. ఆందోళనకారుల దాడిలో తీవ్రంగా గాయపడి రాజమహేంద్రవరం జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఆర్టీసీ అద్దె బస్సుడ్రైవర్‌ పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని సీఐ కె.మంగాదేవి తెలిపారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను తరలిస్తున్న 108 వాహన అద్దాలు పగులగొట్టిన ఆందోళనకారులపైన, బస్సును ధ్వంసం చేసి డ్రైవర్‌పై దాడి చేసిన వారిపైన కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. నిందితులను త్వరలో అరెస్టు చేస్తామన్నారు.


భార్య ఆత్మహత్య కేసులో భర్తకు పదేళ్ల జైలు

పెద్దాపురం, న్యూస్‌టుడే: భార్య ఆత్మహత్య కేసులో భర్త దొడ్డ శ్రీనుకి పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.3 వేల జరిమానా విధిస్తూ రాజమహేంద్రవరం ఎనిమిదో అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి పీఆర్‌.రాజీవ్‌ మంగళవారం తీర్పునిచ్చారు. పెద్దాపురం పోలీసుల వివరాల ప్రకారం.. పట్టణ శివారు జగ్గంపేట రహదారిలోని ఎన్టీఆర్‌కాలనీకి చెందిన దొడ్డ శ్రీను రోజూ మద్యం తాగి వచ్చి భార్య విమలకుమారిని వేధిస్తుండడంతో తట్టుకోని ఆమె 2019 మే 31న ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె తండ్రి దేవలంక సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదుచేయడంతో అప్పటి ఎస్సై కేవీరామారావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. కోర్టులో వాదోపవాదాల అనంతరం భార్యను ఆత్మహత్యకు పురిగొల్పినందుకు ఏడేళ్లు, వేధింపులకు గురిచేసినందుకు మూడేళ్లు మొత్తంగా పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు నిచ్చినట్లు పెద్దాపురం ఎస్సై వెలుగుల సురేష్‌ చెప్పారు. కేసును ప్రాసిక్యూషన్‌ తరుఫున అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పి.వెంకటేశ్వరరావు వాదించారు. విచారణలో ప్రత్యేక శ్రద్ధచూపిన సీఐ షేక్‌ అబ్దుల్‌ నబీ, సిబ్బందిని ఎస్పీ సతీష్‌కుమార్‌ అభినందించారు.


నిషేధిత సిగరెట్‌ ప్యాకెట్ల స్వాధీనం

దానవాయిపేట (రాజమహేంద్రవరం):

దుకాణంలో పరిశీలిస్తున్న విజిలెన్స్‌ అధికారులు

నిషేధిత పొగాకు ఉత్పత్తులను అక్రమంగా విక్రయిస్తే చర్యలు తప్పవని విజిలెన్స్‌ జిల్లా ఇన్‌ఛార్జి ఎస్పీ కె.కుమార్‌ తెలిపారు. రాజమహేంద్రవరం నగరంలోని ప్రధాన మార్కెట్‌లో నిషేధిత సిగరెట్లు విక్రయాలు జరుగుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు తమ అధికారులు మంగళవారం పలు దుకాణాలపై దాడులు నిర్వహించి రూ.5.91 లక్షల విలువచేసే సరకు స్వాధీనం చేసుకున్నారన్నారు. మెయిన్‌రోడ్డు ఆకులవారి వీధిలో ఓ గోదాములో రూ.3,98,450 విలువచేసే నిషేధిత సిగరెట్లు ప్యాకెట్లను గుర్తించి, దుకాణదారుడు డి.సుబ్రహ్మణ్యంపై క్రిమినల్‌ కేసు నమోదు చేయించామన్నారు. నల్లమందు సందు కూడలిలో ఓ జనరల్‌ స్టోర్స్‌లో రూ.1,54,875 విలువచేసే నిషేధిత సిగరెట్‌ ప్యాకెట్లను గుర్తించి యజమాని డి.సత్యనారాయణపై, టౌన్‌హాలు రోడ్డులోని ఓ  జనరల్‌ మర్చంట్‌ దుకాణంలో రూ.38,275 విలువగల ప్యాకెట్లను గుర్తించి వి.అయ్యప్పపై క్రిమినల్‌ కేసు నమోదు చేయించామన్నారు. విజయవాడకు చెందిన మణికంఠ అనే వ్యక్తి ఈ నిషేధిత సిగరెట్లను నగరంలోని వ్యాపారులకు సరఫరా చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తెలిసిందని ఎస్పీ తెలిపారు.

ఈ దాడుల్లో విజిలెన్స్‌ డీఎస్పీ ముత్యాలు నాయుడు, సీఐలు సత్యకిషోర్‌, రమేష్‌, శ్రీనివాసరెడ్డి, అధికారులు భార్గవ మహేష్‌, లక్ష్మీనారాయణ, విజయ్‌కుమార్‌లతోపాటు రెవెన్యూ, తూనికలు కొలతలు, వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని