logo

అమ్మా.. నాన్నేడని అడిగితే చెప్పేదెలా..: భర్తను కోల్పోయి తీవ్ర విషాదంలో గర్భిణి

మొదటి సంతానంతో ముచ్చటగా గడుపుతున్న ఆ దంపతులు మరో బిడ్డ తమ జీవితాల్లోకి రానున్న ఆనందంలో ఉన్నారు. రెక్కల కష్టంతో ఉన్నంతలో ఉన్నతంగా జీవనం గడుపుతున్నారు.

Updated : 18 Sep 2023 07:47 IST

సత్యనారాయణ (పాత చిత్రం)

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే: మొదటి సంతానంతో ముచ్చటగా గడుపుతున్న ఆ దంపతులు మరో బిడ్డ తమ జీవితాల్లోకి రానున్న ఆనందంలో ఉన్నారు. రెక్కల కష్టంతో ఉన్నంతలో ఉన్నతంగా జీవనం గడుపుతున్నారు. పుట్టబోయే పాప, బాబు ఎవరైనా తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉండాలని వైద్య పరీక్షలు చేయించుకునేందుకు బయలుదేరారు. అప్పటివరకు ఎన్నో ఊసులతో సాగుతున్న వారి ప్రయాణంలో అనుకోని ఘటన తీరనివిషాదం నింపింది. భార్యను ఆసుపత్రిలో చూపించేందుకు తీసుకెళ్తుండగా ట్రాక్టర్‌ ఢీకొనడంతో భర్త మృతిచెందగా, కుమారుడికి తీవ్రగాయాలు కాగా, భార్యకు స్వల్పగాయాలు అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చాగల్లు మండలం చిక్కాలకు చెందిన చిటికెన కోట సత్యనారాయణ(36) వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. భార్య భవాని గర్భిణి కావడంతో వైద్య పరీక్షల నిమిత్తం కుమారుడితో కలిసి ద్విచక్రవాహనంపై శనివారం రాజమహేంద్రవరం బయలుదేరారు. రోడ్‌కం రైలు వంతెన సమీపంలోని పెట్రోలు బంకు దగ్గరకు వచ్చేసరికి అపమార్గం (రాంగ్‌ రూట్‌)లో వచ్చిన ట్రాక్టరు ఢీకొంది. దీంతో సత్యనారాయణకు, కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిద్దరినీ రాజమహేంద్రవరం ప్రైవేటు ఆసుపత్రికి అక్కడి నుంచి కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సత్యనారాయణ అక్కడ చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతిచెందారు. చిన్నారి తలకు గాయం కాగా చికిత్స పొందుతుండగా భవాని స్వల్పగాయాలతో బయటపడ్డారు. మృతుడి బావ కాసాని శ్రీనివాస్‌ ఫిర్యాదుపై పట్టణ ఎస్సై భూషణం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ ఆధారాన్ని కోల్పోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.


కల్వర్టును ఢీకొట్టి మృతి

గోపాలపురం, న్యూస్‌టుడే: ద్విచక్రవాహనం నడుపుతూ రహదారి పక్కన ఉన్న కల్వర్టును ఢీకొట్టి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై కె.సతీష్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లా పోలవరం మండలం ఎల్‌ఎన్‌డీపేటకు చెందిన కట్టవ సత్యనారాయణ(60) ఇటీవల తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలం చిక్కాలలోని ఆయన కుమార్తె ఇంటికి వెళ్లాడు. ఆదివారం ఉదయం స్వగ్రామానికి బయలు దేరాడు. గోపాలపురం మండలంలోని దేవరపల్లి రహదారిలోని పొగాకు బోర్డు సమీపంలో ద్విచక్రవాహనం అదుపు తప్పి కల్వర్టు గోడను ఢీకొట్టాడు. తలకు బలమైన గాయం కావడంతో సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని కుమారుడు కె.వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని