logo

వైకాపా అండ.. అక్రమ దందా

అధికార పార్టీ నాయకులు అండదండలు, జిల్లా, స్థానిక అధికారులు ఆశీస్సులు ఉంటే ఎన్ని అక్రమాలు చేసినా.. అవినీతికి పాల్పడినా పట్టించుకోరన్న ధైర్యం స్థానిక వైకాపా నాయకుల్లో ఉంది..

Published : 29 Apr 2024 06:23 IST

కళ్లుమూసుకున్న అధికారులు.. కరిగిపోతున్న భూములు
లంకల్లో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు 
న్యూస్‌టుడే, పి.గన్నవరం

మానేపల్లి మధ్యలంకలో బాధిత రైతులు లంకమట్టి అక్రమ తవ్వకాలను అడ్డుకోవడంతో నిలిచిన టిప్పర్లు

ధికార పార్టీ నాయకులు అండదండలు, జిల్లా, స్థానిక అధికారులు ఆశీస్సులు ఉంటే ఎన్ని అక్రమాలు చేసినా.. అవినీతికి పాల్పడినా పట్టించుకోరన్న ధైర్యం స్థానిక వైకాపా నాయకుల్లో ఉంది.. అందుకే కనిపించిన వనరులన్నీ తవ్వేస్తూ జేబులు నింపుకొంటున్నారు.

మండలంలోని మానేపల్లిమధ్యలంక, శివాయిలంక భూముల్లో మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. ఇక్కడ భూములు దళితులకు సుమారు మూడు దశాబ్దాల క్రితం పట్టాలపై అప్పటి ప్రభుత్వం ఇచ్చింది. అలాంటి లంక భూముల్లో అక్రమార్కులు ప్రవేశించి రైతులకు తెలియకుండా వారిభూముల్లో యంత్రాలతో తవ్వేసి టిప్పర్లలో తరలిస్తుంటే అడ్డుకోవాల్సిన యంత్రాంగం కళ్లుమూసుకుంటోంది. ఆదివారం కొంతమంది దళితరైతులు అక్కడకు వెళ్లి తవ్వకాలను అడ్డుకునేప్రయత్నం చేశారు. అక్రమార్కులు స్థానిక చోటా నాయకులను అక్కడ కాపలాగాపెట్టి మరీ ఈతవ్వకాలు చేస్తున్నారు. స్థానిక అధికారులు ఎక్కడ అడ్డుకొంటారోనని ముందుగానే జిల్లా, డివిజన్‌ స్థాయి అధికారులు అక్రమార్కుల జోలికి వెళ్లవద్దని ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. సారవంతమైన లంకభూములను ఇలా తవ్వేయడంతో గోదావరివరదలకు ఈ ప్రాంతమంతా గోదావరిలా మారిపోయే ప్రమాదం ఉందని బాధిత రైతులు ఆవేదనచెందుతున్నారు. నెలల తరబడి ఇక్కడ వనరులు ఇష్టానుసారంగా తవ్వేసి తరలిస్తుంటే యంత్రాంగం పట్టనట్టుగా చోద్యం చూస్తుంది. కనీసం బాధితరైతులు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవటంలేదని వారు వాపోతున్నారు. ఆదివారం కొంతమంది రైతులు అడ్డుకోవటంతో టిప్పర్లు, జె.సి.బి.లు పక్కనపెట్టేశారు.


అడ్డొస్తే లారీతో గుద్దేస్తామన్నారు
- మానుకొండ విష్ణు, లంకరైతు

మా తండ్రికి మానేపల్లి మధ్యలంకలో ఎకరం లంకభూమిపట్టాపై ఇచ్చారు. దీంట్లో మాకు తెలియకుండా ఇపుడు సుమారు 50సెంట్ల భూమిలో మట్టిని తవ్వేశారు.నాతోపాటు కొందరు అడ్డుకున్నాం. ఈసారి అడ్డొస్తే లారీతో గుద్దేస్తామంటూ స్థానికంగా ఒక వ్యక్తి నన్నుబెదిరించాడు. ఈ ప్రాంతంలో లంకభూములు ఎక్కువగా దళితులవి ఇష్టానుసారంగా తవ్వేస్తుంటే అధికారులు నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు.


20 సెంట్లు తవ్వేశారు
- దీపాటి శివప్రసాద్‌, స్థానికుడు

మాకు ఇక్కడ 50 సెంట్ల లంకభూమి ఉంది. దీంట్లో మాకు తెలియకుండా సుమారు 20సెంట్ల భూమిలో మట్టిని తవ్వేసి అమ్మేసుకున్నారు. గతంలోకూడా అడ్డుకుంటే ఆ సమయంలో పగటిపూట మానేసి రాత్రిసమయాల్లో తవ్వేశారు. ఇప్పుడు కూడా అదేపరిస్థితి ఏర్పడుతుంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని