logo

ఆదర్శంగా తీర్చిదిద్దడమంటే ‘ఇదేనా ఎంపీ గారు..’

‘‘కడియం మండలంలోని పొట్టిలంక గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నా. జాతీయస్థాయిలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా’’ ఇదీ రాజమహేంద్రవరం ఎంపీగా మార్గాని భరత్‌రామ్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రకటన.

Published : 29 Apr 2024 06:26 IST

పొట్టిలంకపై అన్నీ వట్టిమాటలే!
ఇదీ దత్తత గ్రామంలో అభివృద్ధి తీరు
న్యూస్‌టుడే, కడియం

వారధి నిర్మాణానికి వేసిన శిలాఫలకం

‘‘కడియం మండలంలోని పొట్టిలంక గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నా. జాతీయస్థాయిలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా’’ ఇదీ రాజమహేంద్రవరం ఎంపీగా మార్గాని భరత్‌రామ్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రకటన. అవన్నీ వట్టి మాటలేనని, పనులు మాత్రం ముందుకు సాగలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో వైకాపాకు ఓట్లు వేయలేదనే అధికార పార్టీ నాయకులు అభివృద్ధి ఆపేశారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.  

పొట్టిలంక గ్రామంలో తూర్పు డెల్టా కాలువ పైవంతెన నిర్మాణం దీర్ఘకాలిక సమస్యగా మిగిలిపోయింది. వైకాపా ప్రభుత్వం వచ్చాక వారధి నిర్మాణానికి ముచ్చటగా మూడుసార్లు శంకుస్థాపన పేరిట నాయకులు హడావుడి చేశారు. నియోజకవర్గ అప్పటి సమన్వయకర్త చందన నాగేశ్వర్‌, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎంపీ భరత్‌ ఆధ్వర్యంలో మూడుసార్లు ప్రతిపాదనలు సిద్ధం చేసి అనుమతి పత్రాలతో వచ్చారు. రూ.4.70 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఒకసారి.. అది కాస్తా రూ.5 కోట్లకు చేరిందని మరోసారి అన్నారు. తర్వాత ఎవరికి వారే రావడం ఇదిగో వంతెన.. అదిగో వంతెన అంటూ చెప్పడమే తప్ప పనులు మాత్రం ఒక్క అడుగు ముందుకు కదల్లేదు.

పొట్టిలంకలో నిరుపయోగంగా తాగునీటి ట్యాంకు

కలగానే ఇంటింటికీ తాగునీరు

గ్రామంలో తాగునీటి ఇబ్బందులు రాకుండా ఇంటింటికీ కొళాయి వచ్చేస్తుందన్నారు. దాంతో తమ కష్టాలు తీరాయని మహిళలు అనుకునేలోపే పనులు నిలిచాయి. ప్రస్తుతం ఓ ట్యాంకు నుంచి మాత్రమే తాగునీరు సరఫరా చేస్తున్నారు. నిర్మాణాలు పూరైన మరో రెండు ట్యాంకులకు పైపులైన్ల కనెక్షన్‌ ఇవ్వకపోవడంతో అవి నేటికీ నిరుపయోగంగా ఉన్నాయి.


ఓట్లు వేయలేదంటూ పనులు ఆపేశారు..

గ్రామంలో మురుగు సమస్య నివారణకు కాలువ నిర్మాణం తలపెట్టారు. కొంతమేర పనులు ముందుకు సాగాయి. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో ఎంపీటీసీగా జనసేన పార్టీకి చెందిన అభ్యర్థిని విజయం సాధించారు. దాంతో ఆ ప్రాంతంలోని వారంతా వైకాపాకు ఓట్లు వేయలేదని కాలువ పనులు నిలిపేశారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. స్థానికులు ఆందోళన వ్యక్తం చేయడంతో ఇసుకను వేసి తాత్కాలికంగా మూసి ఉంచారు.


సీఎంకు వినతులిచ్చినా ఫలితం లేదు..

గ్రామంలో దాదాపు 550 మంది రైతులున్నాం. వ్యవసాయం, నర్సరీలు, పలు రకాల పూలతోటలు పెంచుతూ.. జీవనోపాధి పొందుతున్నాం. పనుల నిమిత్తం ప్రతి రోజూ కాలువ పైనుంచి అవతలి వైపు వెళ్లాల్సిందే. ప్రస్తుతం ఉన్న కాలిబాట వంతెనతో రాకపోకలు ఇబ్బందిగా మారాయి. వారధి కోసం ఏళ్ల తరబడి పలువురు నేతలకు వినతులు ఇచ్చినా.. అనుమతులు తప్పా పనులు ముందుకు సాగలేదు. ఇటీవల బస్సుయాత్రకు విచ్చేసిన సీఎంకు వినతిని అందించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆయన స్పందించకపోవడంతో రైతులంతా నిరాశ చెందారు. చేతికొచ్చిన పంట తరలింపు రవాణా భారంగా మారి ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు.

కొత్తపల్లి రాజాబాబు, రైతు, పొట్టిలంక

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని