logo

మార్పు కోరితే.. కూటమికి ఓటెయ్యండి

ఉపాధి కావాలన్నా.. కష్టాలున్నా.. నేను వచ్చి మాట్లాడుతా.. నాకు లంచాలు అవసరం లేదు. రైతు కన్నీళ్లు తుడవగలిగితే.. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే నాకు ఆనందం..రాష్ట్రంలో 30వేల మంది ఆడపిల్లలు అదృశ్యమైతే ఒక్కరు మాట్లాడరు.

Updated : 29 Apr 2024 06:44 IST

వైకాపా నేతలు సహజవనరులను దోచేశారు
జగన్‌ పాలనలో ప్రజలకు అన్నీ కష్టాలే
వారాహి విజయభేరి బహిరంగ సభల్లో జనసేనాని పవన్‌
ఈనాడు, కాకినాడ, రాజమహేంద్రవరం- న్యూస్‌టుడే, ఏలేశ్వరం, ప్రత్తిపాడు, శంఖవరం, కిర్లంపూడి, జగ్గంపేట, జగ్గంపేట రూరల్‌

సభలో నమస్కరిస్తున్న పవన్‌, ఉదయ్‌శ్రీనివాస్‌, సత్యప్రభ

వైకాపాకు ఎందుకు ఓటెయ్యాలి..?

దళితులను డోర్‌ డెలివరీ చేసినందుకా?

కాపులకు రిజర్వేషన్‌ ఇవ్వనని చెప్పినందుకా.?

భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టినందుకా?

తాగు-సాగునీటి కష్టాలు మిగిల్చినందుకా?

కొండలు మింగేసి వాటాలు పంచుకున్నందుకా..?

జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రశ్న


పాధి కావాలన్నా.. కష్టాలున్నా.. నేను వచ్చి మాట్లాడుతా.. నాకు లంచాలు అవసరం లేదు. రైతు కన్నీళ్లు తుడవగలిగితే.. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే నాకు ఆనందం..రాష్ట్రంలో 30వేల మంది ఆడపిల్లలు అదృశ్యమైతే ఒక్కరు మాట్లాడరు. డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వరు.. స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్‌ 24 శాతం చేసి అన్యాయం చేశారు. ఈబీసీ 5 శాతం కూడా తీసేశారు. వైకాపాకు ఎందుకు నిలబడాలని పవన్‌ ప్రశ్నించారు. ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం, జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడిలో ఆదివారం రాత్రి నిర్వహించిన వారాహి విజయభేరి సభల్లో ఆయన ప్రసంగించారు.

కూటమి జట్టుగా: జగ్గంపేట అభ్యర్థి నెహ్రూతో పవన్‌

తట్టుకునే ధైర్యం మీలో ఉంది..

జగన్‌ గూండా ప్రభుత్వాన్ని తట్టుకునే దమ్ము, ధైర్యం, తెగింపు జనసేనకు, జనసైనికులకు ఉందని పవన్‌కల్యాణ్‌ అన్నారు. నేను మీకు మాట ఇస్తున్నా.. ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ప్రత్తిపాడులో అడుగుపెట్టాలంటే ఒకటికి వందసార్లు ఆలోచించుకోవాలని వ్యాఖ్యానించారు. నాకు దండాలు కావు.. మీ భవిష్యత్తు కావాలి..ఈ దేశ సమగ్ర సంకల్పం.. ఆంధ్రరాష్ట్ర సంకల్పం మీ గొంతే.. నేను మీ గొంతునవుతా..అని పవన్‌ భరోసా ఇచ్చారు. ప్రత్తిపాడు యువకులకు చెబుతున్నా.. చలమలశెట్టి సునీల్‌, ఇక్కడి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ఓటు కోసం వస్తే.. భవన నిర్మాణ కార్మికుల బతుకుపై దెబ్బతికొట్టిన మీకు ఎందుకు ఓటెయ్యాలని అడగండి.. దళితుడిని చంపినవారిని ఎందుకు వెనకేసుకు తిరుగుతున్నావని అడగండి..రైతు కన్నీరు పెట్టకూడదన్నా, కార్మికుల పొట్ట కొట్టకూడదన్నా.. కూటమికి ఓటెయ్యాలని కోరారు.

మైనింగ్‌ అడ్డాగా మార్చేశారు

‘ప్రత్తిపాడును మైనింగ్‌కు అడ్డాగా చేశారే తప్ప.. నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు తీర్చలేని పరిస్థితులు ఉన్నాయి. రోడ్లు, సాగునీటి సమస్యల పరిష్కారానికి వైకాపా నాయకులు చొరవ చూపలేద’ని పవన్‌కల్యాణ్‌ విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సమస్యలకు పరిష్కారం చూపుతానని భరోసా ఇచ్చారు. ప్రత్తిపాడు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సత్యప్రభ, జగ్గంపేట తెదేపా అభ్యర్థి జ్యోతుల నెహ్రూ, లోక్‌సభ జనసేన అభ్యర్థి తంగెళ్ల ఉదయ్‌శ్రీనివాస్‌ను గెలిపించాలని కోరారు.


వెన్నెముక ఊడిపోయేలా రోడ్లున్నాయ్‌..

‘ప్రత్తిపాడు నియోజకవర్గంలో రోడ్ల సౌకర్యాలు లేవు. వెన్నెముక ఊడిపోయేలా రోడ్లు ఉన్నాయి. అలాంటివి బాగుచేయడం మానేసి వీళ్లు వంతాడ మైనింగ్‌ తవ్వేసి వంతెనలు వేసుకుంటున్నారు. ఆ బ్రిడ్జికి.. అనుమతి ఇచ్చిన అధికారి పేరు పెట్టుకున్నారని పవన్‌కల్యాణ్‌ ఆరోపించారు. 2019లో వంతాడ మైనింగ్‌ చూడడానికి వచ్చాను. దోచి మన నదీవనరులు, ఇసుక, ఖనిజాలు.. అన్నీ దోచేస్తున్నారు. యువతరానికి ఏ సంపద విడిచి పెట్టలేద’ని పవన్‌ ఆవేదన వ్యక్తంచేశారు.


మీ సమస్యలకు పరిష్కారం చూపుతా..

ఏలేరు జలాశయం ఆధునికీకరణ, పుష్కర- పోలవరం కాలువలపై ఎత్తిపోతలు పథకాలు నిర్మించి సాగునీరు అందించడం.. శిథిల రోడ్లు పునర్నిర్మించి ప్రజారవాణా వ్యవస్థ బాగుచేస్తామన్నారు.గిరిజన గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్యం అందుబాటులోకి తెస్తామన్నారు. సబ్‌ప్లాన్‌ పరిధిలోని పెద్ద మల్లాపురం గ్రామాన్ని మండల కేంద్రంగా మార్చాలని కోరారని.. గిరిజనుల గళం అసెంబ్లీలో వినిపిస్తానన్నారు.. పుష్కర ఎత్తిపోతల పథకాన్ని, సుబ్బారెడ్డి, చంద్రబాబు సాగర్‌ను ముందుకు తీసుకెళ్తామన్నారు. అన్నవరం క్షేత్రాన్ని దేశం మొత్తం చూసేలా గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని