logo

రైతుకు నిరాశ.. ఎవరికి భరోసా!

రైతులకు అవసరమైన అన్ని సేవలు ‘రైతు భరోసా’ కేంద్రాల్లోనే అందిస్తాం. ఆ పరిధిలోని రైతులు బయటకు వెళ్లాల్సిన పనిలేదు. ఎరువులు, పురుగు మందుల విక్రయాలు మొదలు ధాన్యం కొనుగోళ్ల వరకు అన్ని సేవలు అక్కడే.

Published : 19 May 2024 03:13 IST

విత్తనాలు, యంత్రాలు మొదలు పంట కొనుగోలు వరకు అవస్థలే
ఈనాడు, రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే, ముమ్మిడివరం

వరి విత్తనాలు చల్లుతున్న రైతులు (పాత చిత్రం)

రైతులకు అవసరమైన అన్ని సేవలు ‘రైతు భరోసా’ కేంద్రాల్లోనే అందిస్తాం. ఆ పరిధిలోని రైతులు బయటకు వెళ్లాల్సిన పనిలేదు. ఎరువులు, పురుగు మందుల విక్రయాలు మొదలు ధాన్యం కొనుగోళ్ల వరకు అన్ని సేవలు అక్కడే.

వైకాపా ప్రభుత్వం ఆర్‌బీకేలపై ఘనంగా వల్లెవేసిన మాటలివి.

చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఉండదనే విషయం వైకాపా పాలన ప్రారంభంలోనే కర్షకులకు అర్థమైపోయింది. హేతుబద్దీకరణ పేరుతో ఆర్‌బీకేలను కుదించినా.. అదను సమయంలో విత్తనాలు, ఎరువులు ఇవ్వకపోయినా.. పండిన పంటను విక్రయించేందుకు నానా అవస్థలు పెట్టినా.. ప్రకృతి వైపరీత్యాల నుంచి ఉత్పత్తుల రక్షణకు ముఖం చాటేసినా పంటిబిగువున భరించారు. నష్టాలు చూడని రైతులు లేరు. కొద్దిరోజుల్లో ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభమైపోతుంది. ఇప్పటివరకు యంత్రాంగం పరంగా తగిన సన్నద్ధత లేకపోవడంతో ఇప్పుడెన్ని అగచాట్లు పడాల్సి వస్తుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది.

ఎప్పుడూ అరకొరే

రైతులు పొలాలను దుక్కి దున్నే దగ్గర నుంచి కోత వరకు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, యాంత్రీకరణ పరికరాలు అవసరం. ఖరీఫ్‌ సీజన్‌ దృష్ట్యా ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసి అవసరమైనవి అందుబాటులో ఉంచాలి. ఎన్నికల నేపథ్యంలో ఈ విషయాన్ని పట్టించుకునేవారే కరవయ్యారు. ఇప్పుడు ప్రకటనలు వల్లెవేస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్‌నకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో  1.2 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులు, 85 వేల క్వింటాళ్ల వరి విత్తనాలు అవసరం..ప్రభుత్వం నుంచి వచ్చేవి అరకొర కావడంతో ప్రైవేట్‌ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. పైగా కిలోకు కేవలం రూ.5 మాత్రమే రాయితీ అట.

రైతు భరోసా కేంద్రం

వైకాపా నేతలకే యంత్రాలు

రైతు భరోసా కేంద్రాల్లోని సీహెచ్‌సీ (కస్టమ్‌ హైరింగ్‌ కేంద్రాలు) లలో యాంత్రీకరణ పరికరాలు అందుబాటులో ఉంచి రైతులకు నిర్దేశిత ధరకు అద్దెకు ఇవ్వాల్సి ఉంది.. దాదాపు 900 వరకు రైతు బృందాలను ఏర్పాటు చేశారు. రూ.18.50 కోట్ల్ల రాయితీతో పవర్‌ టిల్లర్లు, వరికోత యంత్రాలు, వరినాట్లు వేసేవి, చిన్న కోత యంత్రాలు సుమారు 900 యూనిట్లు సమకూర్చారు. ఇవన్నీ ఆర్‌బీకేల్లో బదులు వైకాపా నాయకుల ఇళ్ల వద్ద ఉన్నాయి. వారు సొంత అవసరాలకు వినియోగించుకుంటున్నారు. దీంతో రైతులు ప్రైవేటుగా ఆశ్రయించి ఎక్కువ అద్దె చెల్లించాల్సి వస్తోంది. వీటిని సీజన్‌ ప్రారంభం నాటికి ఆర్‌బీకేల్లో అందుబాటులో ఉంచాల్సిన ఆవశ్యకత ఉంది.

సమాధానం చెప్పేవారేరీ..

ఉమ్మడి జిల్లాలోని 1204 రైతు భరోసా కేంద్రాల్లో పూర్తి స్థాయి సిబ్బంది లేరు. 620 ఆర్‌బీకేల్లో వ్యవసాయ, ఉద్యాన సహాయకుల్లో ఒక్కరే ఉన్నారు. సిబ్బంది బయటకు వెళ్తే తాళాలు వేయాల్సిందే.. నూతన ఆర్‌బీకేల నిర్మాణాలు మధ్యలో నిలిచిపోవడంతో.. అద్దె భవనాల్లోనే ఉన్నాయి. కొన్ని చోట్ల యజమానులు ఖాళీ చేయిస్తున్నారు. ఐ.పోలవరం మండలం కేశనకుర్రు-1 కేంద్రాన్ని ఖాళీ చేయించడంతో ఆర్‌బీకే-2లో సామగ్రిని ఉంచారు. 

జూన్‌ 1 నుంచే  నీటి విడుదల

ఏటా జూన్‌ ఒకటో తేదీ నుంచే ఖరీఫ్‌ సాగుకు నీటిని విడుదల చేస్తున్నారు. పంట కాలువలు సక్రమంగా లేకపోవడంతో శివారుకు చేరడానికి సుమారు 15 నుంచి 20 రోజులు పడుతుంది. ఈ ఏడాది రబీ సీజన్‌ ప్రారంభంలో ఎద్దడి ఏర్పడినా.. రైతులు ఆయిల్‌ ఇంజిన్లు, మోటార్లు తదితర ప్రత్యామ్నాయ విధానాలతో పంటలు కాపాడుకున్నారు. రబీలో ఏప్రిల్‌ 15 నాటికి వరి చేలు కోత దశకు వచ్చినా.. మే మొదటి వారం వరకు కాలువలకు సాగునీరు సరఫరా చేశారు. దీంతో చాలా చోట్ల చేలల్లో నీరు చేరి కోతలకు అంతరాయం ఏర్పడింది. అవసరమైన సమయంలో సాగునీరు ఇవ్వకపోవడం.. కోతల వేళ అందించడాన్ని బట్టి వ్యవసాయ, జలవనరుల శాఖల మధ్య సమన్వయ లోపం అర్థం చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని