logo

‘కార్యకర్తల మౌనం పార్టీకి ప్రమాదం’

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రస్తావించాల్సిన పార్టీ కార్యకర్తలు మౌనం వహించడం ప్రమాదకరమని బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ అన్నారు. అద్దంకి నియోజకవర్గ వైకాపా ప్లీనరీ సమావేశం

Published : 27 Jun 2022 06:01 IST

రాబోయే ఎన్నికల్లో 175 స్థానాలపై సీఎం దృష్టి
వైకాపా ప్లీనరీ సమావేశంలో బాపట్ల ఎంపీ సురేష్‌


మాట్లాడుతున్న ఎంపీ సురేష్‌, వేదికపై మాజీ ఎమ్మెల్యే గరటయ్య తదితరులు

అద్దంకి, న్యూస్‌టుడే : రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రస్తావించాల్సిన పార్టీ కార్యకర్తలు మౌనం వహించడం ప్రమాదకరమని బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ అన్నారు. అద్దంకి నియోజకవర్గ వైకాపా ప్లీనరీ సమావేశం శింగరకొండ రోడ్డులోని కూకట్ల కల్యాణమండపం వద్ద ఆదివారం జరిగింది. సభకు నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త/శాప్‌నెట్‌ ఛైర్మన్‌ బాచిన కృష్ణచైతన్య అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ మాట్లాడుతూ మూడేళ్ల పాలనలో ఎన్నికల అజెండాలో పొందుపరచని హామీలు కూడా కొన్ని నెరవేర్చారన్నారు. రాబోయే ఎన్నికల్లో 175 సీట్లు గెలుపే ధ్యేయంగా ముఖ్యమంత్రి పని చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చేపట్టిన సంక్షేమ పాలన గురించి కార్యకర్తలు పెద్దగా ప్రచారం చేయడం లేదన్నారు. ప్రచారాస్త్రాలతో సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చంద్రబాబు, ఆయన కుమారుడు, దత్తపుత్రుడు పర్యటనలు చేస్తున్నారని, వారిని ప్రజలు ఛీత్కరించుకుంటున్నారన్నారు.  

రహదారి సదుపాయం కల్పించాలి: గరటయ్య

కొత్తగా జిల్లా కేంద్రమైన బాపట్లకు అద్దంకి నుంచి సరైన రహదారి సదుపాయం కల్పించాల్సిన బాధ్యత ఎంపీ నందిగం సురేష్‌పై ఉందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గరటయ్య అన్నారు. గతనెలలో ఒంగోలులో జరిగిన తెదేపా మహానాడులో ‘అధికారంలోకి వస్తే అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలుపుతామని’ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలోనే జిల్లా కేంద్రానికి సరైన రహదారి సదుపాయాలు ఏర్పాటుచేసి ప్రజల మన్ననలు పొందాల్సిన అవసరం ఉందన్నారు. జడ్పీటీసీ మాజీ సభ్యుడు బాచిన చెంచు ప్రసాద్‌ మాట్లాడుతూ వ్యవసాయ, నీటిపారుదల వ్యవస్థల్ని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. బాపట్ల జిల్లా పరిశీలకులు నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలంతా ఒక్కతాటిపై నిలిచి రాబోయే ఎన్నికల్లో అద్దంకి నియోజకవర్గంలో వైకాపా జెండా ఎగురవేయాలన్నారు. సభాస్థలి వద్ద దివంగత వైఎస్‌.రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నగరపంచాయతీ ఛైర్మన్‌ ఎస్తేరమ్మ పాల్గొన్నారు.

బొప్పూడి నుంచే వెనుదిరిగిన మోపిదేవి

అద్దంకిలో వైకాపా ప్లీనరీ సమావేశాలకు హాజరయ్యేందుకు వస్తున్న పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు, ఎంపీ మోపిదేవి వెంకటరమణ బొప్పూడి నుంచే వెనుదిరిగారు. అత్యవసరంగా అందిన సమాచారంతో ఆయన వెనక్కు వెళ్లినట్లు పార్టీ వర్గాలు చర్చించుకున్నాయి. ఆయనను నియోజకవర్గ వైకాపా పరిరక్షణ సమితి నాయకులు ముందుగా బొప్పూడి వద్ద కలిశారు. కొరిశపాడు మండలం పమిడిపాడుకు చెందిన రావనూతల వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో దుశ్శాలువాతో సత్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని