logo

సీఎం వచ్చారు.. నరకం చూపారు

నడిరోడ్డుపై సీఎం జగన్‌ నిర్వహించిన ప్రచార సభ.. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. మంగళగిరిలోని స్థానిక పాతబస్టాండ్‌ సమీపంలో గౌతమబుద్దా రోడ్డులో శుక్రవారం ఆయన ప్రచార వాహనంపై ప్రసంగించారు.

Published : 11 May 2024 05:18 IST

మంగళగరిలో జగన్‌ ఎన్నికల ప్రచార సభ
ఆంక్షలతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు

సీఎం రాకుండానే వెనుదిరుగుతున్న మహిళలు

మంగళగిరి,  తాడికొండ, దుగ్గిరాల, న్యూస్‌టుడే:  నడిరోడ్డుపై సీఎం జగన్‌ నిర్వహించిన ప్రచార సభ.. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. మంగళగిరిలోని స్థానిక పాతబస్టాండ్‌ సమీపంలో గౌతమబుద్దా రోడ్డులో శుక్రవారం ఆయన ప్రచార వాహనంపై ప్రసంగించారు. ఈ నేపథ్యంలో పోలీసుల ట్రాఫిక్‌ ఆంక్షలు వాహనచోదకులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించాయి. ఇలాంటి సభలు నడి రోడ్డుపై పెడితే అత్యవసర పనులపై వెళ్లేవారు ఏమైపోవాలంటూ పలువురు అసహనం వ్యక్తం చేశారు. సుమారు రెండు గంటలపాటు కార్లు, ద్విచక్ర వాహనదారులు, ఆటోల్లో ప్రయాణించేవారు గమ్యస్థానం చేరేందుకు ఇబ్బందులకు గురయ్యారు. సీఎం మాట్లాడుతుండగా.. మహిళలు వారు వచ్చిన ఆటోల కోసం వెనుతిరిగి వెళ్లారు.

దుకాణాలు మూసేసి.. విద్యుత్తు నిలిపేసి..

దుకాణాల ముందు ఇనుప డివైడర్లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా దాదాపుగా వంద మీటర్ల వరకు రహదారికి ఇరువైపులా ఉన్న షాపులు మూయించారు. విద్యుత్తు నిలిపివేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకులకు విద్యుత్తు సరఫరా లేక లావాదేవీలు గంటన్నరపాటు నిలిచిపోయాయి. టీ, అల్పాహార దుకాణాలు మూయించి వేయడంతో రెక్కాడితేకానీ డొక్కాడని తామంతా నష్టపోవాల్సి వచ్చిందని వారు వాపోయారు.  

ఆటోల్లో తరలింపు..

దుగ్గిరాల, తాడేపల్లి, మంగళగిరి మండలంలోని గ్రామాల నుంచి మహిళలను సభకు రెండు గంటల ముందుగానే ఆటోల్లో తీసుకొచ్చారు. కొంత మంది ఆటోల్లో నుంచి దిగకుండానే అందులోనే కూర్చుండిపోయారు. సభకు ఆశించినంత స్థాయిలో సమీకరణ జరగలేదనే భావాన్ని ఆ పార్టీ నాయకులే బాహాటంగా వ్యక్తపరిచారు. నగరంలోని చేనేత వర్గాలు సభలో కనిపించలేదనే అంశాన్ని ఆయా పార్టీ నాయకులు చర్చించుకోవడం గమనార్హం. సభకు వచ్చిన వారిలో పలువురు మద్యం సీసాలతో బహిరంగంగా తిరుగుతూ కనిపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని