logo

విస్తరణ సరే..మరి పునరుద్ధరణో..!

రహదారుల విస్తరణ చేపట్టిన ప్రాంతాల్లో తిరిగి రోడ్లను వెంటనే పునరుద్ధరిస్తేనే వాటివల్ల ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రస్తుతం నగరంలో రహదారుల విస్తరణ పనులైతే ముమ్మరంగా సాగుతున్నాయి. పూర్తయిన వైపు నుంచి తిరిగి రహదారి పునరుద్ధరణ పనులు చేపట్టకపోవటంతో ప్రజలకు ఆయా రహదారుల్లో అసౌకర్యం కలుగుతోంది.

Published : 07 Oct 2022 06:08 IST

రహదారుల టెండర్ల ప్రక్రియలోనే జాప్యం
ఈనాడు-అమరావతి

గుంటూరు కుగ్లర్‌ హాస్పటల్‌ రోడ్డులో రహదారి విస్తరణ పనులు

రహదారుల విస్తరణ చేపట్టిన ప్రాంతాల్లో తిరిగి రోడ్లను వెంటనే పునరుద్ధరిస్తేనే వాటివల్ల ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రస్తుతం నగరంలో రహదారుల విస్తరణ పనులైతే ముమ్మరంగా సాగుతున్నాయి. పూర్తయిన వైపు నుంచి తిరిగి రహదారి పునరుద్ధరణ పనులు చేపట్టకపోవటంతో ప్రజలకు ఆయా రహదారుల్లో అసౌకర్యం కలుగుతోంది.

పెదపలకలూరు, కుగ్లర్‌ ఆస్పత్రి, సుద్దపల్లి దొంక, నందివెలుగు రోడ్ల విస్తరణ పనులు తుదిదశకు చేరుకున్నాయి.  కనీసం వాటికి టెండర్లు పిలిచి సైడు కాల్వలు,. రహదారుల నిర్మాణం చేపట్టలేదు. టెండర్ల నిర్వహణ ప్రక్రియలోనే జాప్యం జరుగుతోంది. పెదపలకలూరు రహదారి చాలా అధ్వానంగా మారింది. వర్షం వస్తే చెరువును తలపిస్తోంది. వెంటనే పునరుద్ధరించాలని ప్రభుత్వం నుంచి నగరపాలక అధికారులకు ఒత్తిళ్లు ఉన్నాయి. కాని వాటి పనులు ఇంకా ప్రారంభించలేదు. సైడు కాల్వలు నిర్మించి అప్పగిస్తే బీటీ రహదారి నిర్మిస్తామని ఆర్‌అండ్‌బీ అధికారులు గత కొంతకాలం నుంచి చెబుతున్నారు. అయినా నగరపాలక సంస్థలో చలనం లేదు. ఆ రహదారిలో సైడు కాల్వలు నిర్మాణానికి టెండర్లు పిలిచారు. కానీ గుత్తేదారుతో వెంటనే ఆ పనులు ప్రారంభింపజేయలేదు. మిగిలిన రహదారుల్లోనూ ప్రణాళిక, ఇంజినీరింగ్‌ అధికారులు సమన్వయంతో వ్యవహరించడం లేదు.

ఈ రహదారిలో నిత్యం వేల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగుతాయి. సత్తెనపల్లి,. నరసరావుపేట వైపు నుంచి గుంటూరుకు వచ్చే వాహనాలు ఎక్కువగా పలకలూరి రహదారి మీదగానే నగరంలోకి  ప్రవేశిస్తాయి. ఇక కుగ్లర్‌ ఆస్పత్రి రహదారి విస్తరణ పనులు చాలా వరకు పూర్తయ్యాయి. రైల్వేగేటు నుంచి శివాలయం వరకు రెండు వైపులా కాల్వలు నిర్మించి పునరుద్ధరించాలి. ఈ రహదారి విస్తరణే సుమారు నాలుగేళ్ల నుంచి పెండింగ్‌ పడింది. రహదారికి అడ్డుగా ఉన్నాయని గతంలోనే భవన నిర్మాణదారులకు నష్టపరిహారం చెల్లించి రహదారి విస్తరణ చేపట్టారు. కోర్టు కేసులు, స్థానికులు కొందరి నుంచి వ్యతిరేకత రావటంతో పనులు మధ్యలో నిలిపేశారు. తిరిగి విస్తరణ పనులను సుమారు నెల క్రితం ప్రారంభించారు. ఈరహదారి పునరుద్ధరణకు చర్యలు తీసుకోలేదు. మూడు వంతెనల గుండా కొత్తపేటలోని ఆస్పత్రులకు వచ్చే వాహనదారులు ఎక్కువుగా కుగ్లర్‌ హాస్పటల్‌ రోడ్‌ నుంచే ఓల్డుక్లబ్‌ రోడ్‌, బస్టాండ్‌కు చేరుకుంటారు. ఇది చాలా ప్రాధాన్యంతో కూడిన రహదారి. దీన్ని విస్మరించారు. నందివెలుగు రోడ్‌ ఏడేళ్ల నుంచి విస్తరణ పనుల్లోనే మగ్గుతోంది. కొంతదూరం 80 నుంచి 100 అడుగుల మీద విస్తరించారు. ఇక్కడ కూర్చొనే గాంధిబొమ్మ సెంటర్‌ నుంచి బస్టాండ్‌ వరకు విస్తరణ పనులు నిలవగా వాటిని ప్రారంభించారు. ఆ పనులు నత్తనడకన సాగుతున్నాయి. తెనాలి వైపు ను ంచి వచ్చే వాహనాలు నగరంలోకి ప్రవేశించే ప్రధాన మార్గం కావటంతో ఈ రహదారి పనులను వెంటనే నిర్మించటానికి టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తే తప్ప రహదారి విస్తరణ వల్ల ప్రజలకు ప్రయోజనం కలగదు.

నత్తనడకన  ఏటీ అగ్రహారం పనులు
ఏటీ అగ్రహారం రహదారి విస్తరణ పనులే నత్తనడకన సాగుతున్నాయి. ఈ పనులు వేగవంతం కావటానికి వెంటనే భవనాలు, స్థలాలు కోల్పోయేవారికి నష్టపరిహారం చెల్లించి పనులను వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ రహదారి పనులే ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత పనుల నిర్వహణలోనూ అదే జాప్యం జరుగుతోంది. సకాలంలో నష్టపరిహారం చెల్లించి విస్తరణ పనులు చేపడితే ఇప్పటికే విస్తరణ పూర్తయ్యేది. ఇంజినీరింగ్‌ అధికారులే టెండర్లకు కసరత్తు చేయకుండా ఆలస్యం చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, మేయర్‌ స్పందించి రహదారులు విస్తరించే ప్రాంతాల్లో తిరిగి రహదారుల పునరుద్ధరణకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని