logo

నీళ్లు వదిలాక కాలువ పనులా?

కాలువలకు నీటి విడుదల చేయని సమయంలో సహజంగా పూడిక తీయడం, మరమ్మతు పనులు చేపడతారు. ఇందుకు విరుద్ధంగా కృష్ణా పశ్చిమ డెల్టాలో కాలువలకు నీరు విడుదల చేసిన తర్వాత పనులకు టెండర్లు పిలవడం గమనార్హం.

Published : 13 Jun 2023 05:57 IST

మరమ్మతులకు ఇప్పుడు టెండర్లు
అధికారుల తీరును తప్పుపడుతున్న రైతులు
ఈనాడు, అమరావతి

ఈనెల 7న డెల్టా కాలువలకు నీళ్లు వదులుతున్న సందర్భంలో నదికి పూజలు చేస్తున్న మంత్రి అంబటి

కాలువలకు నీటి విడుదల చేయని సమయంలో సహజంగా పూడిక తీయడం, మరమ్మతు పనులు చేపడతారు. ఇందుకు విరుద్ధంగా కృష్ణా పశ్చిమ డెల్టాలో కాలువలకు నీరు విడుదల చేసిన తర్వాత పనులకు టెండర్లు పిలవడం గమనార్హం. నీటి ప్రవాహంలో పనులు ఏ మేరకు చేస్తారోనన్న ఆందోళన అన్నదాతలను వెంటాడుతోంది. జలవనరులశాఖ ఇంజినీర్లు ముందస్తుగా ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంలో జాప్యం చేయడంతో ఈపరిస్థితి ఏర్పడింది.

కృష్ణా పశ్చిమడెల్టా కాలువలకు జూన్‌ 7న నీటిని విడుదల చేశారు. ఇప్పటికే పనులు పూర్తిచేసినట్లయితే పూర్తిస్థాయిలో పూడిక తొలగించారా? కట్టలు బలోపేతం చేసే పనుల నాణ్యత వంటివి పరిశీలించే అవకాశం ఉండేది. నీటిలో తూటుకాడ తొలగింపు వంటివి కనిపించినా మిగిలిన వాటి నాణ్యత పరిశీలన అటకెక్కినట్లే. నీటిలో పరిమాణాన్ని బట్టి లెక్కలు తీసే వెసులుబాటు లేనందున గుత్తేదారు చేసిందే పని అన్నట్లు తయారవుతుంది.

243 పనులు... రూ.21 కోట్లు

కృష్ణా పశ్చిమడెల్టాలో గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల పరిధిలో 5.70లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కాలువలు ఉన్నాయి. డెల్టా వ్యాప్తంగా మురుగుకాల్వలు విస్తరించాయి. కాలువలతో పాటు మురుగుకాల్వల నిర్వహణ కూడా కీలకం. పొలాల నుంచి మురుగునీరు వెళ్లే డ్రెయిన్లలో పూడిక, పిచ్చిమొక్కలు పెరిగి మురుగునీరు పొలాలపైకి వస్తోంది. రైతులకు సాగునీరు సక్రమంగా అందాలంటే కాలువలు పటిష్ఠంగా ఉండటంతోపాటు నీటిప్రవాహానికి అడ్డంకులు ఉండకూడదు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈఏడాది రూ.21కోట్లతో  243 పనులు చేపట్టడానికి జలవనరులశాఖ సిద్ధమైంది. ఇందులో ఇప్పటికే కొన్ని పనులకు టెండర్లు పిలిచి గుత్తేదారులను ఎంపిక చేయగా మరికొన్ని టెండరు ప్రక్రియ దశలోనే ఉన్నాయి. పనులు పూర్తిస్థాయిలో ప్రారంభం కావడానికి జూన్‌ నెలాఖరు అవుతుంది. అప్పటికి వర్షాలు మొదలవుతాయి. ఈ నేపథ్యంలో అటు కాలువలు, ఇటు మురుగుకాల్వల్లో నీటిప్రవాహం ఉండటంతో పూడిక పనులు ఏమేరకు చేస్తారో గుత్తేదారులకే తెలియాలి. తూటుకాడ తొలగించి పైపైన పనులు చేస్తే ఏడాది పొడవునా రైతులకు సాగునీటి అవస్థలు తప్పవు.


సాగునీరు  అందేనా?

శ్రీరంగపురం సాగునీటి కాలువలో పేరుకుపోయిన గు‌ర్రపు డెక్క

కాలువలు, మురుగుకాల్వల నిర్వహణకు సకాలంలో నిధులు మంజూరుచేస్తే నీటి విడుదల సమయానికి పూడికతీత పనులు పూర్తి చేసేవారు. కాలువల్లో పిచ్చిమొక్కలు తొలగించడంతోపాటు కట్టలు బలహీనంగా ఉన్నచోట బలోపేతం చేసేవారు. నీటివిడుదల మొదలైన తర్వాత ప్రవాహానికి అడ్డంకులు లేకుండా తూటుకాడ తొలగింపు పనులు చేపట్టేవారు. ఇలా ప్రణాళిక ప్రకారం జరిగితే రైతులకు ఇబ్బందులు లేకుండా సీజన్‌ ముగుస్తుంది. ఇందుకు విరుద్ధంగా కాలువలకు నీటి విడుదల తర్వాత టెండర్లు పిలిచి ఎవరికి ప్రయోజనం కల్పించడానికి పనులు అప్పగిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాలుగేళ్లుగా కాలువల నిర్వహణకు సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో పనులు పూర్తిస్థాయిలో చేయలేని దుస్థితి. నీటి లభ్యత ఎక్కువగా ఉన్నందున సాగునీటి కష్టాలు లేకుండా రైతులు గట్టెక్కారు. ఈ ఏడాది కూడా పనులు సక్రమంగా చేయని పక్షంలో నీటిలభ్యత తగ్గితే ఇబ్బందులు తప్పవని రైతులు ఆందోళన చెందుతున్నారు. 63కిలోమీటర్ల దూరం సాగే కొమ్మమూరు కాలువ నిర్వహణ చేపట్టకపోవడంతో కాలువ కట్టలు బలహీనంగా తయారయ్యాయి. కాలువ కింద లక్షన్నర ఎకరాలకుపైగా ఆయకట్టు ఉంది. 3500 సామర్థ్యం ఉన్నప్పటికీ 3200 క్యూసెక్కుల నీటినే విడుదల చేస్తున్నారు. దీంతో బాపట్ల, రేపల్లె, చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లో చివరి ఆయకట్టుకు సాగునీరు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. కాలువ దెబ్బతినడంతో లీకేజీల ద్వారా సాగునీరు వృథాగా పోతోంది. ఈసారి కూడా పనులు నామమాత్రంగా చేస్తే వేలమంది ఆయకట్టుదారులకు ఇబ్బందులు తప్పవు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని