logo

సహర్ష్‌.. ఆలోచన అదుర్స్‌

వ్యవసాయ రుణాలు అందక.. అధిక వడ్డీలకు అప్పులు చేసి ఆర్థికంగా చితికిపోతున్న రైతులకు అండగా నిలిచేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు ఆ విద్యార్థి.

Published : 02 Aug 2023 05:31 IST

ఐక్యరాజ్యసమితి 1ఎం1బిలో భాగమైన విద్యార్థి ఆలోచన
ఆగ్రోలాండ్‌ పేరుతో వెబ్‌సైట్‌..
రైతులకు రుణాలు అందించే ప్రయత్నం

ఈనాడు అమరావతి : వ్యవసాయ రుణాలు అందక.. అధిక వడ్డీలకు అప్పులు చేసి ఆర్థికంగా చితికిపోతున్న రైతులకు అండగా నిలిచేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు ఆ విద్యార్థి. ఒకవైపు చదువుకుంటూనే.. మరోవైపు ఖాళీ సమయంలో కర్షకుల కోసం ఏదైనా చేయాలని ఆరాటపడుతున్నాడు. ఐక్యరాజ్యసమితి 1ఎం1బి ప్రాజెక్టులో భాగంగా వినూత్న ఆలోచనలకు ఆహ్వానం పలకగా.. అతని ఆలోచన కూడా ఎంపికైంది. ప్రస్తుతం తన ఆలోచనను కార్యరూపంలోకి తీసుకొచ్చే పనిలో ఉన్నాడు.

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తిక్కిరెడ్డిపాలెంకు చెందిన మర్రి సతీష్‌బాబు, నీలిమ దంపతుల కుమారుడు సహర్ష్‌. నంబూరులోని వీవా పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. సమాజానికి ఉపయోగపడే వినూత్న ఆలోచనలను ప్రోత్సహించి, వాటిని కార్యరూపంలోకి తీసుకొచ్చేందుకు అవసరమైన సహకారం అందిస్తామంటూ బెంగళూరుకు చెందిన ది పర్పస్‌ అకాడమీ ఈ ఏడాది జనవరిలో దేశవ్యాప్తంగా విద్యార్థుల నుంచి ప్రాజెక్టులను ఆహ్వానించింది. ఐక్యరాజ్యసమితికి చెందిన వన్‌ మిలియన్‌.. వన్‌ బిలియన్‌(1ఎం1బి)తో అనుబంధంగా ఈ కార్యక్రమాన్ని ఆ సంస్థ చేపట్టింది. సమాజంలోని సమస్యలను పరిష్కరించేలా ఒక మిలియన్‌ యువతను తయారుచేసి వారి ద్వారా ఒక బిలియన్‌ ప్రజలకు ఉపయోగపడేలా చేయాలనేది.. 1ఎం1బి ముఖ్య ఉద్దేశం. పర్పస్‌ అకాడమీ దేశవ్యాప్తంగా 14 మంది విద్యార్థులకు సంబంధించిన ఆలోచనలు ఎంపిక చేయగా.. వారిలో సహర్ష్‌ కూడా ఉన్నాడు.

రైతులకు తన ఆలోచన వివరిస్తున్న సహర్ష్‌

ఆలోచన ఎంపికవ్వడంతో..

సమయానికి రుణాలు లభించక ఇబ్బంది పడే రైతుల కోసం తాను ఓ వేదికను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు.. తన ఆలోచనను ప్రాజెక్టుగా తయారుచేసి ది పర్పస్‌ అకాడమీకి సహర్ష్‌ పంపాడు. అది నచ్చడంతో వారు విద్యార్థిని బెంగళూరుకు పిలిచి రెండు దశల్లో ఇంటర్వ్యూ చేశారు. అతని ఆలోచనను ఎంపిక చేసి.. ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. గత ఏప్రిల్‌లో యూఎస్‌లోని స్టాన్‌ఫర్డ్‌, యు.సి.బర్క్‌లీ విశ్వవిద్యాలయాలకు సహర్ష్‌తో పాటు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన వారిని తీసుకెళ్లారు. వారి ఆలోచనలను అక్కడి ప్రొఫెసర్లకు వివరించేందుకు వేదిక ఏర్పాటు చేశారు.

స్వచ్ఛంద సంస్థలతో కలిసి..

ప్రస్తుతం సమాజంలో సాగుదారులను పట్టిపీడిస్తున్న రుణాల సమస్యకు 1ఎం1బిలో భాగంగా పరిష్కారం చూపించడమే తన ఆలోచన ప్రధాన ఉద్దేశమని సహర్ష్‌ తెలిపాడు. తన ఆలోచనకు కార్యరూపం ఇస్తూ ఆగ్రోలాండ్‌ పేరుతో ఓ వెబ్‌సైట్‌ను రూపొందించాడు. ప్రస్తుతం ఆంగ్లంలో ఉన్న ఈ వెబ్‌సైట్‌ను తెలుగులోనూ రూపొందిస్తున్నారు. వెబ్‌సైట్‌ ఏర్పాటు చేసినంత మాత్రాన అన్నదాతలకు రుణాలు అందవనే విషయం విద్యార్థికి తెలుసు. రైతులు వచ్చి తమ వివరాలను నమోదు చేసుకోలేరు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కూడా రుణాలు ఇస్తామంటూ వచ్చి వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవడం జరగదు. అందుకే.. తనకున్న ఖాళీ సమయంలో, తమతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి ఉన్న ఏదైనా స్వచ్ఛంద సంస్థ సహకారం తీసుకోనున్నట్లు సహర్ష్‌ వెల్లడించాడు.

ఒక ఊరి నుంచి చిరు ప్రయత్నం..

ఒక ఊరిని ఎంచుకుని, అక్కడున్న రైతులకు సహాయం అందించేందుకు ముందుగా చిరు ప్రయత్నం చేస్తామని సహర్ష్‌ తెలిపాడు. గ్రామంలో ఎంతమంది రైతులున్నారు.? వారిలో రుణాలు ఎవరికి అందుతున్నాయి, ఎవరికి రావడం లేదు, ఎందుకు? అనే కారణాలను తెలుసుకుంటామన్నారు. ఆ వివరాల ద్వారా వారికి రుణాలను బ్యాంకులు లేదంటే ఆసక్తి ఉన్న ఆర్థిక సంస్థల నుంచి ఇప్పించేందుకు ప్రయత్నిస్తామన్నాడు. ఇది విజయవంతమైతే.. చాలామంది కర్షకులకు ఉపయోగకరంగా ఉంటుందనేదే తన ఉద్దేశమని తెలిపాడు.

అమెరికాలోని విశ్వవిద్యాలయాలకు వెళ్లిన విద్యార్థుల బృందం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని