logo

మురుగున పడ్డ డబ్బులెక్కడ.. మామ?

భట్టిప్రోలు మండలం ఐలవరం ఉన్నతపాఠశాలలో 400 మంది విద్యార్థులు విద్యా బుద్ధులు నేర్చుకుంటున్నారు. వీరికి పాఠశాలలో రెండు మరుగుదొడ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

Published : 23 Apr 2024 06:35 IST

అమ్మఒడి కింద ఇచ్చే సొమ్ములో రూ.2 వేలు లాక్కుంటున్న ప్రభుత్వం
ఆ డబ్బులు మురుగుదొడ్లకు వెచ్చించక పిల్లల పరిస్థితి దయనీయం
 ఏ ఖాతాకు మళ్లిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రుల ఆక్రోశం

భట్టిప్రోలు మండలం ఐలవరం ఉన్నతపాఠశాలలో 400 మంది విద్యార్థులు విద్యా బుద్ధులు నేర్చుకుంటున్నారు. వీరికి పాఠశాలలో రెండు మరుగుదొడ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో మగపిల్లలు మూత్రవిసర్జన కోసం బయటకు వెళ్లాల్సి వస్తుంది. అమ్మఒడి ఖాతా నుంచి నిధులు మినహాయించినా ఇక్కడ మరుగుదొడ్ల గురించి పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు.

ఈనాడు - అమరావతి, న్యూస్‌టుడే - బాపట్ల

రెండొందల మంది అమ్మఒడి లబ్ధిదారులున్న ఓ పాఠశాలలో ఒక్కోక్కరి నుంచి రూ.2 వేల చొప్పున అమ్మఒడి ఖాతా నుంచి మినహాయించుకున్న మొత్తాన్ని లెక్కిస్తే ఏడాదికి రూ.4 లక్షలు అవుతుంది. ప్రభుత్వం ఆ మొత్తాన్ని తిరిగి ఆ పాఠశాలలో మరుగుదొడ్ల శుభ్రతకు వెచ్చించింది అనుకుంటే పొరపాటే అవుతుంది. ప్రతి పాఠశాలకు మూడు మాసాలకు ఒకసారి మరుగుదొడ్లు శుభ్రపరచటానికి అవసరమయ్యే రసాయనాలు, సామగ్రి పంపుతుంది. వాటికి నెలకు రూ.వెయ్యి చొప్పున విద్యా సంవత్సరం మొత్తానికి కలిపి రూ.10 వేలకు మించి కాదని చెబుతున్నారు. ఫినాయిల్‌, చీపుర్లు, బక్కెట్లు, మగ్గులు, శుభ్రతకు మిషన్లు వినియోగిస్తారు. అవి మొత్తం కలిపి రూ.10 వేలకు మించి కావని ప్రధానోపాధ్యాయులు అంటున్నారు. ఆ పాఠశాలలో దొడ్లు కడిగే ఆయా, స్కావెంజర్‌కు నెలకు రూ.6 వేలు చొప్పున 11 మాసాలకు రూ.66 వేలు వేతనం చెల్లిస్తున్నారు. రసాయనాల కొనుగోలు, ఆయాకు చెల్లించే జీతం కలిపినా రూ.లక్షలోపే వ్యయం అవుతుంది. మిగిలిన రూ.3 లక్షలను విద్యార్థుల పేరుతో ప్రభుత్వమే దారి మళ్లిస్తోందని ఉపాధ్యాయ వర్గం ఆరోపిస్తుంది.

భట్టిప్రోలు: ఐలవరం పాఠశాలలో 400 మందికి ఇవే మరుగుదొడ్లు

ప్రజాధనాన్ని పేదలకు పంచుతుంటే విపక్షాలకు ఎందుకంత కడుపు మంట? వారి సంక్షేమానికి ప్రజాధనం వెచ్చించటం తప్పేనా అంటూ బహిరంగ సభల్లో బీరాలు పలికే ముఖ్యమంత్రి జగన్‌ ఆ పంపిణీ మాటునే తిరిగి వారిని దోచుకుంటున్నారు. పాఠశాల విద్యార్థులకు సంబంధించిన ‘అమ్మఒడి’ సాయమే తీసుకుంటే రూ.15 వేలకు బదులు రూ.13 వేలు చెల్లిస్తూ ఒక్కో విద్యార్థికి రూ.2 వేల చొప్పున కోత విధిస్తున్నారు. ఆ మినహాయించే మొత్తంతో పాఠశాలల్లో మరుగుదొడ్ల శుభ్రత, ఆయాల జీతాల చెల్లింపునకు వెచ్చిస్తున్నామని జగన్‌ ప్రభుత్వం చెబుతోంది. తల్లుల ఖాతాకు రూ.13 వేలు మాత్రమే జమవుతున్నాయి. ఒక్కో విద్యార్థి నుంచి రూ.2 వేల చొప్పున మినహాయించుకునే జగన్‌ ప్రభుత్వం తిరిగి ఆ మొత్తాన్ని విద్యార్థులకే ఖర్చు పెడితే ఎవరికీ అభ్యంతరం ఉండేది కాదు. కానీ ఆ పని చేయడం లేదు. టాయిలెట్‌ మెయింటెన్స్‌ ఫండ్‌, స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ ఫండ్‌ పేరుతో తీసుకున్న ఈ మొత్తం నుంచి కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణకే కొద్దొగొప్పో వెచ్చిస్తోంది.

బాపట్ల పట్టణం రైలుపేటలోని కొత్తపేట పురపాలక ప్రాథమిక పాఠశాలలో 43 మంది విద్యార్థులు చదువుతున్నారు. 23 మంది బాలికలకు ఒకటే మరుగుదొడ్డి ఉండటంతో వారు అత్యవసర పరిస్థితిలో ఇళ్లకు వెళ్లాల్సి వస్తోంది. పాఠశాల ఆవరణ అపరిశుభ్రంగా ఉంది. పట్టణంలోని ఆంజనేయ ఆగ్రహారం పురపాలక ప్రాథమిక పాఠశాలలో 25 మంది విద్యార్థులు చదువుతున్నారు. రెండు మరుగుదొడ్లకు తాళాలు వేసి ఉంచారు. చుట్టూ పిచ్చిమొక్కలు పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి. విద్యార్థులు మూత్ర విసర్జనకు ఆరు బయటకు వెళ్తున్నారు.

ముక్కు మూసుకోవాల్సిందే..

ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లు అధ్వానంగా ఉండటంతో నరకయాతన అనుభవిస్తున్నారు. ఏ మాత్రం నిర్వహణ లేకపోవడంతో అపరిశుభ్రంగా తయారయ్యాయి. పాఠశాల ఆవరణలోనూ దుర్వాసన వ్యాపిస్తోంది. కర్లపాలెం మండలం చింతాయపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో 271 మంది విద్యార్థులు చదువుతున్నారు. నాడు-నేడు కింద పాఠశాలలో మరుగుదొడ్లు అసంపూర్తిగా నిర్మించారు. దీనినే వంద మంది బాలికలు వాడుతున్నారు. నీటి సౌకర్యం లేక దుర్వాసన వస్తోంది. బాలురని మూత్ర విసర్జన కోసం బయటకు పంపుతున్నారు. బాపట్ల మండలం ముత్తాయపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో 300కు పైగా విద్యార్థులు చదువుతున్నారు. 130 మందికి పైగా ఉన్న బాలికలకు తగినన్ని మూత్రశాలలు లేక అవస్థలు పడుతున్నారు. పాత మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉన్నాయి.

రూ.24 కోట్లు ఏమవుతున్నట్లు..

ఏడాదికి జిల్లా వ్యాప్తంగా అమ్మఒడి లబ్ధిదారుల నుంచి సుమారు రూ.24 కోట్ల మేర వసూలు చేస్తున్నారు. ఈ నగదును అనుకున్న మేరకు మరుగుదొడ్లకు వెచ్చిస్తే, పిల్లలకు ఇబ్బంది ఉండేది కాదు.. పైకి ప్రభుత్వం మాత్రం అమ్మఒడి సాయం అందరికి అందిస్తున్నామని, ఆపై పాఠశాలల్లో పిల్లలకు మరుగుదొడ్ల పరంగా ఎలాంటి అసౌకర్యం లేకుండా వాటి శుభ్రతకు ప్రాధాన్యమిస్తున్నామని బాకాలు ఊదుతోంది. అసలు పిల్లల నుంచి వెనక్కు తీసుకునే మొత్తాన్ని వారి సంక్షేమానికి వెచ్చించకుండా ఇతర కార్యక్రమాలకు ఖర్చు పెట్టడాన్ని ఉపాధ్యాయ వర్గమే కాదు తల్లిదండ్రులు తప్పుబడుతున్నారు. ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్‌ నాయకులు సైతం ప్రభుత్వ తీరుపై భగ్గుమంటున్నారు. తమ పాఠశాలలకు గడిచిన రెండేళ్ల నుంచి కోత విధించి ప్రభుత్వం వెనక్కు తీసుకుంటున్న మొత్తం నుంచి ఒక్క రూపాయి ప్రైవేటు పాఠశాలలకు ఇవ్వడంలేదని వాపోయారు.

ప్రైవేటు బడుల్లో చదివే వారి నుంచి సైతం..

ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అమ్మఒడి సాయం వర్తింపజేస్తున్న ప్రభుత్వం టాయిలెట్‌ మెయింట్‌నెన్స్‌ ఫండ్‌ పేరుతో ఆ పాఠశాలల్లో చదివే విద్యార్థుల నుంచి రూ.2 వేలు మినహాయించుకుని ఆ మొత్తంలో నుంచి ఒక్కపైసా కూడా ప్రైవేటు పాఠశాలలకు ఇవ్వకుండా ప్రభుత్వమే దిగమింగుతోంది. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో కలిపి 3780 ప్రభుత్వ, జడ్పీ, మండల పరిషత్తు పాఠశాలలు ఉన్నాయి. మూడు జిల్లాల్లో కలిపి 1400 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో అమ్మఒడి సాయం పొందుతున్నవారు 30 వేల మంది ఉన్నారు. అయితే వారందరి నుంచి రూ.2 వేలు చొప్పున నగదు వెనక్కు తీసుకుంది. అయితే ఈ డబ్బులు వెనక్కి ఇవ్వడం లేదు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని