logo

అమ్మఒడి సాయంలో మామ కోతలు

ప్రజాధనాన్ని పేదలకు పంచుతుంటే విపక్షాలకు ఎందుకంత కడుపుమంట? వారి సంక్షేమానికి  ప్రజాధనం వెచ్చించటం తప్పేనా అంటూ బహిరంగసభల్లో బీరాలు పలికే జగన్‌ ఆ పంపిణీ మాటునే తిరిగి దోచుకుంటున్నారు. 

Published : 23 Apr 2024 06:39 IST

వెనక్కు తీసుకున్నది ఎవరి  జేబుల్లోకి జగన్‌
ఒక్కో విద్యార్థికి రూ.2 వేల  తగ్గింపు
మరుగుదొడ్ల నిర్వహణ మమ..

 ప్రజాధనాన్ని పేదలకు పంచుతుంటే విపక్షాలకు ఎందుకంత కడుపుమంట? వారి సంక్షేమానికి  ప్రజాధనం వెచ్చించటం తప్పేనా అంటూ బహిరంగసభల్లో బీరాలు పలికే జగన్‌ ఆ పంపిణీ మాటునే తిరిగి దోచుకుంటున్నారు.  పాఠశాల విద్యార్థులకు సంబంధించిన ‘అమ్మఒడి’ సాయమే తీసుకుంటే రూ.15 వేలకు బదులు రూ.13 వేలు చెల్లిస్తూ ఒక్కో విద్యార్థికి రూ.2 వేల చొప్పున కోత విధిస్తున్నారు. ఆ మినహాయించే మొత్తంతో పాఠశాలల్లో మరుగుదొడ్ల శుభ్రత,  ఆయాల జీతాల చెల్లింపునకు వెచ్చిస్తున్నామని జగన్‌ ప్రభుత్వం చెబుతోంది. తల్లుల ఖాతాకు రూ.13 వేలు మాత్రమే జమవుతున్నాయి. ఒక్కో విద్యార్థి నుంచి రూ.2 వేల చొప్పున మినహాయించుకునే జగన్‌ ప్రభుత్వం తిరిగి ఆ మొత్తాన్ని విద్యార్థులకే ఖర్చు పెడితే ఎవరికీ అభ్యంతరం ఉండేది కాదు. కానీ  ఆపని చేయటం లేదు. టాయిలెట్‌ మెయింటెన్స్‌ ఫండ్‌, స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ ఫండ్‌ పేరుతో రూ.2 వేలు వెనక్కు తీసుకుంటోంది.  ఈమొత్తం నుంచి కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణకే కొద్దోగొప్పో వెచ్చిస్తోంది. ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అమ్మఒడి సాయం వర్తింపజేస్తున్న ప్రభుత్వం టాయిలెట్‌ మెయింటనెన్స్‌ ఫండ్‌ పేరుతో ఆ పాఠశాలల్లో చదివే విద్యార్థుల నుంచి రూ.2 వేలు మినహాయించుకుని ఆ మొత్తంలో నుంచి ఒక్క పైసా కూడా ప్రైవేటు పాఠశాలలకు ఇవ్వకుండా ప్రభుత్వమే దిగమింగుతోంది.

ఈనాడు డిజిటల్‌, నరసరావుపేట, ఈనాడు అమరావతి

గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో కలిపి 3780 ప్రభుత్వ, జడ్పీ, మండల పరిషత్తు పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో 70 వేలమంది వరకు అమ్మఒడి సాయం పొందుతున్నారు. మూడు జిల్లాల్లో కలిపి 1400 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో అమ్మఒడి సాయం పొందుతున్నవారు 30 వేల మంది ఉన్నారు. ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి లక్ష మంది విద్యార్థులకు ఆ సాయం అందుతోంది. అయితే వారందరి నుంచి రూ.2 వేలు చొప్పున గతేడాది రూ.20 కోట్లు వెనక్కు తీసుకుంది. అందులో ప్రభుత్వం వెచ్చించింది కేవలం సగం మొత్తం కూడా ఉండదని ఉపాధ్యాయ  వర్గాలు చెబుతున్నాయి.

ఆ నిధులు ఎక్కడికి వెళుతున్నాయి?

కారంపూడి: కారంపూడిలోని ప్రధాన ప్రాథమిక పాఠశాలలో 233 మంది విద్యార్థులున్నారు. వీరిలో 165 మందిని అమ్మఒడి పథకానికి ఎంపిక చేశారు. వారికి ఇచ్చే రూ.15 వేలల్లో పాఠశాల నిర్వహణ అంటూ ప్రభుత్వం ఒక్కొక్కరి నుంచి రూ.2 వేల చొప్పున ఏటా రూ.3.30 లక్షలు వెనక్కి తీసుకుంటోంది. ఇక్కడ ఒక ఆయా ఉన్నారు. ఆమెకు రూ.6 వేలు చొప్పున నెలకు వేతనం ఇస్తున్నారు. ఇలా 11 నెలలకు రూ.66 వేలు చెల్లించగా. మిగిలిన రూ.2.64 లక్షలు ఎక్కడికి వెళుతుందో తెలియని పరిస్థితి. మరోవైపు పాఠశాలలోని మరుగుదొడ్లకు తాళాలు వేస్తున్నారు. ఉపాధ్యాయులు మాత్రమే వినియోగిస్తున్నారు.

చీకటికాలనీలోని పాఠశాలలో    తలుపు లేని మరుగుదొడ్డి

   పల్నాడు జిల్లాలో అమ్మఒడి అందక చాలామంది తల్లులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్తు బిల్లులు అధికంగా వస్తున్నాయని, అంగన్‌వాడీ కార్యకర్తలని, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులని చెబుతూ అమ్మఒడి వర్తించదని నిబంధనలు తీసుకొచ్చారు. దీంతో జిల్లా వ్యాప్తంగా సుమారు 5,181 మంది నష్టపోయారు. మరుగుదొడ్ల శుభ్రత, స్కూళ్ల నిర్వహణ పేరిట రూ.2వేలు కోత వేయడంతో కొందరు ప్రైవేటు స్కూళ్ల తల్లులు ప్రశ్నిస్తున్నారు. తాము ఎలాగూ స్కూళ్లకు ఫీజులు చెల్లిస్తామని, వాళ్లే మరుగుదొడ్ల కోసం, స్కూళ్ల నిర్వహణకు వసూలు చేసుకుంటారని, తమ ఖాతా నుంచి రూ.2వేలు మినహాయించుకోవడం సబబుగా లేదంటున్నారు. ‘నాడు-నేడు’కు ఎంపికైన బడుల్లోనే మరుగుదొడ్లను శుభ్రపరుస్తున్నారు. మిగతా స్కూళ్లలో మరుగుదొడ్ల నిర్వహణ అంతంతమాత్రమే. చాలాచోట్ల బాలురు ఆరుబయటకే వెళుతున్నారు. సరిపడా మరుగుదొడ్లు లేకపోవడంతో బాలికల వరకే వాటిని ఉపయోగించుకునేలా చూస్తున్నారు. ఈ మాత్రానికే ఒక్కో విద్యార్థి నుంచి రూ.2వేలు కోత విధించాలా? అంటూ ఆయా తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.


విద్యుత్తు బిల్లు ఎక్కువ వచ్చిందని నిలిపేశారు

మేము అద్దె ఇంట్లో ఉంటాం. ముగ్గురు పిల్లలు చదువుకుంటున్నారు. వారిలో ఒకరికే అమ్మఒడి ఇచ్చారు. అదీ రెండేళ్లే ఇచ్చారు. తర్వాత నుంచి ఆపేశారు. ఎందుకని అడిగితే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని ఆపేశామన్నారు. అద్దె ఇంట్లో ఉంటే రెండిళ్లకు కలిపి ఒకటే మీటరు. అందుకే ఎక్కువ బిల్లు వచ్చింది. అది మా తప్పా?పేదవాళ్లం అయినా మాకు అమ్మఒడి ఆపేయడం అన్యాయం.

రాణి, క్రిస్టియన్‌పాలెం, నరసరావుపేట


ప్రభుత్వ ఉద్యోగమని..

నేను ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిని. నెలకు వచ్చేది రూ.15వేలే. దీనికి ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి అమ్మఒడి ఆపేశారు. పట్టణంలో అద్దె ఇంట్లో ఉంటూ వచ్చే అరకొర జీతంతో పిల్లల్ని చదివించాలంటే కష్టంగా ఉంది. మాకూ అమ్మఒడి ఇవ్వకుండా ఆపేయడం అన్యాయం.  

 నాగమణి, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిని, సత్తెనపల్లి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని