logo

ఆగుతున్నాయ్‌.. ఊడుతున్నాయ్‌.. జగనాసుర రథ‘చక్రాలు’

సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు ప్రయాణాలకు ఎక్కువగా ఉపయోగించే ఆర్టీసీ బస్సు ఛార్జీలు వైకాపా ఐదేళ్ల పాలనలో మూడుసార్లు పెంచింది. అన్నిరకాల బస్సుల్లో ఛార్జీలు పెంచి ప్రజలపై అదనపు భారం మోపింది.

Published : 28 Apr 2024 05:23 IST

కాలం చెల్లిన బస్సులతో జనానికి కష్టాలు
ఐదేళ్లలో మూడుసార్లు ఛార్జీల మోత
అరకొర సర్వీసులతోనే రాకపోకలు

ఈనాడు, బాపట్ల: సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు ప్రయాణాలకు ఎక్కువగా ఉపయోగించే ఆర్టీసీ బస్సు ఛార్జీలు వైకాపా ఐదేళ్ల పాలనలో మూడుసార్లు పెంచింది. అన్నిరకాల బస్సుల్లో ఛార్జీలు పెంచి ప్రజలపై అదనపు భారం మోపింది. కొత్త బస్సులు కొనుగోలు చేసి సర్వీసులు పెంచి సౌకర్యాలు పెంచకపోగా పాత బస్సులతో అరకొర సర్వీసులతో నెట్టుకొస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేసి ప్రజారవాణా విభాగం పేరుతో నిర్వహిస్తున్నా నిర్వహణలో మాత్రం మెరుగుపడలేదు. కాలం చెల్లిన బస్సులు దారిలో ఎక్కడపడితే అక్కడ ఆగిపోతున్నాయి. కొన్నిసార్లు అదుపు తప్పి ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. ప్రత్తిపాడు మండలం కోయవారిపాలెంలో పర్చూరు-గుంటూరు మార్గంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి ఒక ఇంటికిపైకి దూసుకెళ్లడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. పాత బస్సులకే మరమ్మతు చేసి రోడ్లపైకి పంపుతుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన ఉద్యోగుల్లో నెలకొంది. వైకాపా ఐదేళ్ల పాలనలో ఆర్టీసీని బలోపేతం చేసి సామాన్యులకు అందుబాటులోకి తీసుకురాకపోగా మరింత భారం పెంచి సౌకర్యాలను దూరం చేశారు.  

సగానికిపైగా  డొక్కు బస్సులే..

గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల పరిధిలో 12లక్షల కిలోమీటర్ల కంటే ఎక్కువ తిరిగిన బస్సులు సగంపైగా ఉండటంతో నిర్వహణ భారంతోపాటు సేవల్లో అంతరాయం కలుగుతోంది. మూడు జిల్లాలో సగానికిపైగా బస్సులు 12 లక్షల కిలోమీటర్లు పూర్తిచేసుకోవడం లేదా 15ఏళ్లు పూర్తయిన సర్వీసులే ఉన్నాయి. వీటిని కొనసాగించడం వల్ల తరచూ మరమ్మతు గురై ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. నిర్వహణ వ్యయం కూడా పెరుగుతోంది. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సులు నడపాలన్న ఉద్దేశంతో కాలం చెల్లిన బస్సులే మరమ్మతు చేసి రోడ్లపైకి పంపుతున్నారు. జిల్లాలో 169 సర్వీసులు ఉండగా 111 బస్సులు 12 లక్షల కిలోమీటర్లుపైగా తిరిగినవే. ఇందులో 15 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న వాహనాలు 35 ఉన్నాయి. మూడు జిల్లాల పరిధిలో 12 లక్షలు కిలోమీటర్లు తిరిగి 15 ఏళ్ల సర్వీసు పూర్తయిన బస్సులను ఎక్కువగా పల్లెవెలుగు సర్వీసులు కింద తిప్పుతున్నారు. దీంతో పల్లెలకు వెళ్లే బస్సులు ఎక్కడ ఆగిపోతాయో తెలియని పరిస్థితి.

నిమిది నెలల క్రితం రేపల్లె నుంచి 15 మంది ప్రయాణికులు, 20 మంది విద్యార్థులతో లంకెవానిదిబ్బ వెళ్తున్న పల్లెవెలుగు ఆర్టీసీ బస్సు రాజులచెరువు సమీపానికి చేరేసరికి ముందు టైరు ఊడి పక్కన పడింది. డ్రైవరు అప్రమత్తతతో వ్యవహరించి బస్సును అదుపు చేయడంతో ప్రమాదం తప్పింది.

రేపల్లె అర్బన్‌, న్యూస్‌టుడే

బాదుడే... బాదుడు

డీజిల్‌ సెస్సు, భద్రతా సుంకంతోపాటు కిలోమీటరు చొప్పున ఏప్రిల్‌ 14, 2022లో ఆర్టీసీ ఛార్జీలు పెంచింది. ప్రధానంగా పల్లెవెలుగు బస్సుల్లో అధికంగా ఛార్జీలు పెంచి సామాన్యులపై మోయలేని భారాన్ని మోపింది. డీజిల్‌ సెస్సు, భద్రతా సుంకం మాత్రమే పెంచుతున్నామని చెప్పినా కిలోమీటరుకు 10 పైసలు చొప్పున పెంచడంతో బాదుడు మరింత పెరిగింది. పల్లెవెలుగుతోపాటు అన్ని సర్వీసుల్లో ఛార్జీలు పెంచారు. గుంటూరు నుంచి పలు పట్టణాలకు వెళ్లే పల్లెవెలుగు బస్సుల్లో టికెట్‌పై రూ.5 నుంచి గరిష్ఠంగా రూ.15 వరకు పెరిగింది. పంచారామాల్లో ఒకటైన అమరావతికి గుంటూరు నుంచి వెళ్లేవారికి పాత ఛార్జీపై రూ.10లు పెరిగి రూ.40 అయింది. గుంటూరు పిడుగురాళ్ల, బాపట్ల, క్రోసూరు, పర్చూరు తదితర ప్రాంతాలకు టికెట్‌పై రూ.15 అదనంగా వసూలు చేస్తున్నారు. సామాన్యులు ఎక్కువగా ప్రయాణించే పల్లెవెలుగు బస్సుల్లో ఒకేసారి టికెట్‌పై రూ.10 పెంచి వారి నడ్డివిరిచారు.

డీజిల్‌ సెస్‌ పేరుతో ఛార్జీల పెంపు

ఏప్రిల్‌ 2022లో ఛార్జీలు పెంచిన ఆర్టీసీ మూడు నెలల వ్యవధిలో జూన్‌ 30న మరోసారి ఛార్జీలు పెంచింది. డీజిల్‌ సెస్‌ పెంపుతో ప్రయాణికులపై భారం మోపారు. పల్లె వెలుగు బస్సుల్లో 35 నుంచి 60 కిలోమీటర్ల వరకు అదనంగా రూ.5 సెస్‌ వసూలు చేశారు. 61 నుంచి 70 కిలోమీటర్ల వరకు రూ.10, 100 కిలోమీటర్లు దాటితే రూ.20 సెస్‌ విధించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో రోజుకు సగటున 3.50 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. పెరిగిన డీజిల్‌ సెస్‌తో పల్లె వెలుగు బస్సుల్లో రోజుకు సుమారు రూ.35 లక్షల భారం పడింది.

ఎక్స్‌ప్రెస్‌, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, మెట్రో డీలక్స్‌ బస్సుల్లో ప్రస్తుతం టికెట్‌ ధరలపై రూ.5 సెస్‌ వసూలు చేస్తున్నారు. దీనిని రూ.5 నుంచి రూ.30 వరకు పెంచారు. ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో నిత్యం 35వేల మందికిపైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ప్రయాణికులపై రోజుకు రూ.7 లక్షల అదనపు భారం పడింది. సూప£ర్‌ లగ్జరీ, ఏసీ బస్సుల్లో టికెట్‌పై రూ.10 డీజిల్‌ సెస్‌ వసూలు చేస్తున్నారు. సూపర్‌ లగ్జరీ బస్సుల్లో నిత్యం 8వేల మంది ప్రయాణిస్తుండగా రూ.4.80 లక్షలుపైగా అదనపు భారం పడింది.

గత ఏడాది నవంబరు 19న రేపల్లె డిపోనకు చెందిన రేపల్లె-గుంటూరు పల్లెవెలుగు బస్సు చెరుకుపల్లి ఖాదô్ఖాన్‌ ఆసుపత్రి కూడలి వద్ద మొరాయించింది. మహిళా కండక్టô్ బస్సులోని కొంతమంది ప్రయాణికులను బతిమాలి బస్సును సుమారు 800మీటర్ల దూరంలోని ఐలాండు కూడలి వరకు తోయించారు. బస్సును తోయడంలో కొందరు మహిళలు కూడా సాయం చేయాల్సి వచ్చింది.  అయినా బస్సు కదలకపోవడంతో ప్రయాణికులు రాత్రిపూట ఇబ్బందులు పడ్డారు.

న్యూస్‌టుడే, చెరుకుపల్లి గ్రామీణ

ప్రయాణికుల సమస్య పట్టదా..?

బస్టాండ్‌లో అనేక సమస్యలు ఉన్నా పట్టించుకొనేవారు లేకుండా పోయారు. వేసవి కాలంలో కనీసం తాగునీటి సదుపాయం ఏర్పాటు చేయలేదు. ఫ్యాన్లు పని చేయడం లేదు. ఛార్జీల పెంపు సామాన్య ప్రజలకు భారంగా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలి.

బాబిక్‌, చీరాల

తొలి ఏడాదిలోనే ఛార్జీల పెంపు

వైకాపా అధికారంలోకి వచ్చిన 2019లోనే ఆర్టీసీ ఛార్జీలు పెంచింది. కొన్ని సర్వీసులకు కిలోమీటరుకు 10పైసలు, కొన్ని సర్వీసులకు 20 పైసలు చొప్పున పెంచింది. ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌, అల్ట్రాడీలక్స్‌, సూపర్‌ లగ్జరీ బస్సుల్లో దూర ప్రాంతాలకు ప్రయాణించేవారికి భారం బాగా పెరిగింది. పెరిగిన ఛార్జీలు డిసెంబరు 12వ తేదీ, 2019 నుంచి అమల్లోకి వచ్చాయి. డీజిల్‌ ధరలు పెరిగాయని నష్టాలు సర్దుబాటు చేసుకోవాలనే లక్ష్యంతో ఛార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించారు. వైకాపా ప్రభుత్వం పెంచిన ఛార్జీలు సామాన్యులు, మధ్య తరగతి ప్రజలకు భారంగా మారాయి. పేద వారందరూ ఎక్కువగా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణిస్తున్నందున వారిపై భారం పెరిగింది. పేదలపై ప్రత్యేక ప్రేమ ఉందని వారి సంక్షేమం కోసం పని చేస్తున్నానని చెప్పే జగన్‌ పేదలపైనే భారం మోపడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని