logo

ప్రజల కష్టాలు చూసే ‘సూపర్‌-6’ రూపకల్పన: లోకేశ్‌

పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూశానని, వాటి నుంచి వారిని బయట పడేసేందుకే ‘సూపర్‌-6’ పథకాలకు రూపొందించినట్లు యువనేత, మంగళగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి నారా లోకేశ్‌ తెలిపారు.

Published : 28 Apr 2024 05:37 IST

మైనార్టీలు, దళితులను గుండెల్లో పెట్టుకుంటాం

మహిళ సమస్యను వింటున్న నారా లోకేశ్‌

పెదవడ్లపూడి(మంగళగిరి), న్యూస్‌టుడే: పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూశానని, వాటి నుంచి వారిని బయట పడేసేందుకే ‘సూపర్‌-6’ పథకాలకు రూపొందించినట్లు యువనేత, మంగళగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి నారా లోకేశ్‌ తెలిపారు. మంగళగిరి మండలం పెదవడ్లపూడిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సాయంత్రం నిర్వహించిన రచ్చబండలో ఆయన మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అయిదు సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. జగన్‌ సీఎం అయ్యాక గతంలో ఎన్నడూ లేని విధంగా దళితులపై దాడులు జరుగుతున్నాయన్నారు. మైనార్టీ సోదరులకు ఎలాంటి కష్టం రాకుండా గుండెల్లో పెట్టి చూసుకుంటామని  భరోసా ఇచ్చారు. తెదేపా హయాంలో రంజాన్‌ తోఫా, ఇమామ్‌ మౌజాలకు గౌరవ వేతనం, హజ్‌ యాత్రకు రాయితీ  వంటి కార్యక్రమాలు అమలు చేశామన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మైనార్టీలకు చాలా అన్యాయం చేశారన్నారు. హత్యలు, ఆత్మహత్యలు జరిగే పరిస్థితి చూస్తున్నామన్నారు. సీఏఏ బిల్లుపై వైకాపా దుష్ప్రచారం చేస్తుందన్నారు. ఈ బిల్లు ఆనాడు లోక్‌సభలో వస్తే అక్కడ ఉన్న 22 మంది వైకాపా ఎంపీలు గంపగుత్తగా దాని ఆమోదం కోసం ఓటేశారన్నారు. రాజ్యసభకు ఆ బిల్లు వస్తే వైకాపాకు చెందిన 9 మంది రాజ్యసభ సభ్యులు కూడా ఓటేశారన్నారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం వచ్చే ఎమ్మెల్యే ఆర్కే, అభ్యర్థిని ఈ అంశంపై ప్రశ్నించాలని, సీఏఏ బిల్లుకు ఎందుకు మద్దతు ఇచ్చారని నిలదీయాలని పిలుపునిచ్చారు. జనసేన మంగళగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జవ్వాది కిరణ్‌చంద్‌, భాజపా రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం, జనసేన, తెదేపా, భాజపా గ్రామ నాయకులు పాల్గొన్నారు. పక్కా ఇళ్లు నిర్మించాలని, కృష్ణాజలాలు అందించి తాగునీటి ఎద్దడి నివారించాలని పలువురు రైతులు, మహిళలు విన్నవించగా.. పరిష్కరిస్తామని లోకేశ్‌ భరోసా ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని