logo

డీఎస్సీ వేయలే.. ఒక్క టీచర్‌ ఉద్యోగమూ ఇవ్వలే!

రాష్ట్రంలో 25 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మేం అధికారంలోకి రాగానే వాటన్నింటిని భర్తీ చేస్తాం.

Published : 29 Apr 2024 06:09 IST

నిరుద్యోగులను మోసం చేసిన జగన్‌
శిక్షణకు రూ.లక్షల్లో ఖర్చు పెట్టిన అభ్యర్థులు

రాష్ట్రంలో 25 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మేం అధికారంలోకి రాగానే వాటన్నింటిని భర్తీ చేస్తాం.

ఏకోపాధ్యాయ పాఠశాలలు అనేవి లేకుండా చేస్తాం. ప్రతి స్కూల్‌లో డబుల్‌ టీచర్లు ఉండేలా చూస్తాం.

 గత ఎన్నికలకు ముందు జగన్‌ చెప్పిన మాట ఇది

 జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ఉన్నాను.. నేను విన్నాను.. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా.. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తా.. ఖాళీ పోస్టులు భర్తీ చేస్తా.. ఉపాధ్యాయ నియామకాలు చేపడతా అంటే నిరుద్యోగులు నిజమే అని నమ్మారు. తీరా అధికారంలోకి వచ్చాక వారికి మొండిచేయి చూపారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఏళ్లుగా డీఎస్సీ నోటిఫికేషన్‌ రాకపోవడంతో నిరుద్యోగ యువతకు ఎదురు చూపులు తప్పడం లేదు. జిల్లాలో పాఠశాలల విలీనం పేరుతో ఖాళీలు లేవని చెబుతూ వచ్చిన ప్రభుత్వం నిరుద్యోగుల నిరసనలతో దిగి వచ్చి ఇచ్చిన నోటిఫికేషన్‌ నిరాశనే మిగిల్చింది. ప్రైవేటు పాఠశాలల్లో చాలీచాలని జీతాలతో పని చేయలేక, మరో ఉద్యోగ అవకాశాలు లేక దిక్కుతోచని దుస్థితిలో డీఎస్సీ అభ్యర్థులు ఉన్నారు.

ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే నరసరావుపేట అర్బన్‌

వైకాపా అయిదేళ్లలో ఒక్కటంటే ఒక్క టీచర్‌ పోస్టు భర్తీకి నోటిఫికేషన్‌ ఇవ్వకపోగా పాఠశాలల విలీనం పేరుతో టీచర్లను ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి ఉన్నత పాఠశాలలకు తీసుకెళ్లి వారిపై విపరీతంగా పనిభారం పెంచేసి ఉపాధ్యాయుల నడ్డివిరిచారు. ఆయన చెప్పిన ప్రకారం ఏకోపాధ్యాయ పాఠశాలల్లో డబుల్‌ టీచర్లను నియమించింది లేదు. ఇప్పటికీ ఉమ్మడి గుంటూరులో పలు చోట్ల ఒక టీచర్‌ మాత్రమే ఉన్నారు. సత్తెనపల్లి డివిజన్‌ గోగులమూడి, పాకాలపాడులోని పాఠశాలల్లో ఒక్కొక్కరే టీచర్‌ ఉన్నారు. ఆ టీచర్‌ అత్యవసరమై సెలవు పెడితే స్కూల్‌ మూతపడడమే. నాడు-నేడు పేరుతో పాఠశాలలు అభివృద్ధి చేస్తున్నామని నమ్మబలికి టీచర్లపై పెట్టే ఖర్చు తగ్గించుకోవాలని టీచర్ల నియామకాలకు జగన్‌ సర్కార్‌ స్వస్తి పలికింది. అధికారంలోకి వచ్చి ఐదేళ్లయితే ఏనాడూ డీఎస్సీ నోటిఫికేషన్ల గురించి పట్టంచుకోని జగన్‌ ఎన్నికలకు ముందు ఒక్కసారిగా నిరుద్యోగుల ఓట్లు దండుకోవాలని నోటిఫికేషన్‌ విషయం గుర్తుకొచ్చింది. అదే తడవుగా ఆరు వేల పోస్టుల భర్తీకి ఈ మధ్య నోటిఫికేషన్‌ ఇవ్వగా దానికి ఈసీ బ్రేకులు వేసింది. ఎన్నికలకు ముందు ఇలాంటివి సరి కాదని అభ్యంతరం వ్యక్తం చేసింది.

రాగానే పోస్టులు భర్తీ చేస్తారని

జగన్‌ అధికారంలోకి రాగానే అప్పటి వరకు ప్రైవేటు పాఠశాలలు, ఇతరత్రా కొలువులు చేసుకుంటూ ఉన్నవారిలో చాలామంది డీఎస్సీ పోస్టులపై నమ్మకంతో ఆ కొలువులు మానేసి డీఎస్సీ కోచింగ్‌కు వెళ్లారు. సంవత్సరాలు గడుస్తున్నా నోటిఫికేషన్‌ ఇవ్వటం లేదు. ఒకసారి కరోనా అడ్డొచ్చిందని మరోసారి పాఠశాలల విలీన ప్రక్రియ పూర్తికాగానే జిల్లాల వారీగా ఖాళీలు గుర్తించి వెంటనే భర్తీకి చర్యలు తీసుకుంటామని ఎప్పటికప్పుడు నిరుద్యోగుల్లో ఆశలు చిగురించేలా మోసపుచ్చటమే తప్ప వాస్తవంగా ఒక్క నోటిఫికేషన్‌ విడుదల చేయలేదు. దీంతో కోచింగ్‌ కోసమని వెళ్లిన వారికి చేతి చమురు వదలటంతోపాటు ఉన్న కొలువులను కోల్పోయి రోడ్డున పడ్డారు. ఒకవైపు ఆర్థికంగా కుదేలై మరోవైపు కలల టీచర్‌ ఉద్యోగం సాకారం కాక ఉపాధ్యాయ శిక్షణార్థులు జగన్‌ ప్రభుత్వంపై మండిపడుతున్నారు.

మెగా డీఎస్సీ నిర్వహించాలంటూ ఫిబ్రవరిలో  నిరుద్యోగుల ఆందోళన

విలీనంతో పోస్టులు తగ్గిపోయి

పాఠశాలలు విలీనంతో పోస్టుల్లో కోతపడ్డాయి. గతంలో 20-30 మంది పిల్లలు ఉన్నా ఇద్దరు, ముగ్గురు టీచర్లు ఉండేవారు. విలీనంతో ఆ సంఖ్య తగ్గిపోయింది. 20 మంది లోపు అయితే ఒకరితోనే సరిపుచ్చారు.  3, 4, 5 తరగతుల పిల్లలను ఉన్నత పాఠశాలల్లో చేర్పించి పిల్లలతో సహా టీచర్లను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయటంతో ఖాళీలు తగ్గిపోయాయి. టీచర్ల ఖాళీలకు నోటిఫికేషన్‌ ఇవ్వకపోవటంతో చాలామంది నష్టపోయారు. తిరిగి వారికి ఎన్నికల ముందు ఆశలు రేకెత్తించారు. ఏటా సంక్రాంతి నాడు జాబ్‌ క్యాలెండర్‌ అని ఎన్నికల మేనిఫేస్టోలోనే చెప్పటంతో ప్రభుత్వ కొలువే ధ్యేయంగా  వ్యయ, ప్రయాసలకోర్చి అహోరాత్రులు కష్టపడి చదివిన నిరుద్యోగులకు ప్రయోజనం లేకుండా పోయింది.

ఖాళీలు 2 వేలు ఇచ్చింది 105 పోస్టులు

జిల్లాలో ఉపాధ్యాయుల పోస్టులు 2వేల వరకు ఖాళీలు ఉన్నాయని ఉపాధ్యాయ సంఘాల అంచనా. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరŸత ప్రభావం ప్రవేశాలపై కూడా పడింది. ప్రైవేటు పాఠశాలల్లోనే విద్యార్థులు పెద్దసంఖ్యలో చేరుతున్న పరిస్థితి ఉంది. కాగా నిరుద్యోగుల నిరసనల నేపథ్యంలో ప్రభుత్వం ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. అందులో ఖాళీలను 105గా చూపింది. టెట్‌ పరీక్ష ఫలితాలు వచ్చిన వెంటనే పరీక్ష నిర్వహించేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు సరిగాలేవు. దీంతో న్యాయస్థానం 21 రోజులు సమయం ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. ఎన్నికల కోడ్‌ రావడంతో పరీక్షలు వాయిదా పడ్డాయి.

ఏటా  పది వేలమంది

ఉమ్మడి గుంటూరుజిల్లాలో 60 బీఎడ్‌, 50 వరకు డీఎడ్‌ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో ఏటా 10వేలమంది శిక్షణ పూర్తి చేసుకుని బయటకు వస్తున్నారు. అయిదేళ్లలో 50 వేల మంది వరకు శిక్షణ పూర్తి చేసుకుని డీఎస్సీ నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూశారు. జగన్‌ సర్కారు ఒక్కటంటే ఒక్క డీఎస్సీ నోటిపికేషన్‌ వెలువరించలేదు. దీంతో 50 వేల మంది ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది.

  •  జిల్లా ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో డైట్‌ అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయలేదు. ఈ పోస్టులకు ఎంఈడీ చేసిన వారు అర్హులు. ప్రతి పోస్టు ఇన్‌ సర్వీస్‌ ఉద్యోగులతో భర్తీ చేసి టీచర్ల నియామకాలను నిర్వీర్యం చేసిందన్న అపవాదును జగన్‌ సర్కారు మూటగట్టుకుంది. చివరకు డిప్యూటీ డీఈవో పోస్టుల భర్తీ చేపట్టలేదు. ఉద్యోగ విరమణ, వీఆర్‌ఎస్‌, చనిపోయిన వారితో ఏర్పడిన ఖాళీలు కలిపితే ఉమ్మడి గుంటూరులో 3 వేలకు పైగా ఖాళీలు ఉంటాయని అంచనా.

    ఇప్పటికే రూ.2.5లక్షలు ఖర్చయింది

నాన్న కౌలు రైతు. పంటలు సక్రమంగా పండితేనే కుటుంబం జరుగుతుంది. 2016-18లో డీఈడీ పూర్తి చేశా. 2019 ఎన్నికల్లో ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తానని జగన్‌ ఇచ్చిన హామీని నమ్మాం. ఓటు వేశాం. అయితే ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్‌ కూడా ఇవ్వలేదు. డీఎస్సీ వస్తుందన్న ఆశతో అప్పటి నుంచి సాధన చేస్తూనే ఉన్నా. కుంకులగుంట నుంచి ఉదయం రావడం సాయంత్రం వరకు పట్టణంలో శిక్షణ తీసుకున్న కోచింగ్‌ సెంటర్‌లో చదువుకోవడం చేస్తున్నా. అయిదేళ్లుగా కష్టపడుతూనే ఉన్నా. ప్రభుత్వ నిర్ణయాలు మానసిక ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు 2.5 లక్షలు ఖర్చయింది.

కొప్పుల నిఖిల, కుంకులగుంట, నకరికల్లు మండలం


జాబ్‌ క్యాలెండర్‌ లేదు

మాది కౌలురైతు కుటుంబం. ఏటా రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని మిర్చి సాగు చేస్తారు. అలా వచ్చిన ఆదాయంతోనే జీవిస్తున్నాం. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తామని జగన్‌ ఇచ్చిన హామీని నమ్మాం. 2018లో డీఈడీ పూర్తి చేశా. ఇప్పటి వరకు జాబ్‌ క్యాలెండర్‌ రాలేదు. ఇప్పటికే లక్షన్నర ఖర్చయింది. ప్రైవేటు ఉద్యోగం చూసుకోమని చెబుతున్నారు. ఏం చేయలో దిక్కు తోచడం లేదు.

-దాసరి సౌజన్య, వీరాటం, రొంపిచర్ల మండలం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని