logo

ఓటేసిన వారు 82.33%

తెదేపా, వైకాపా అభ్యర్థులు సోమవారం జరిగిన పోలింగ్‌ సరళిపై పోలింగ్‌ కేంద్రాల వారీగా విశ్లేషణ చేసుకున్నారు. జిల్లాలో బాపట్ల లోక్‌సభతో పాటు అన్ని అసెంబ్లీ స్థానాలు దక్కించుకుంటామని తెదేపా కూటమి నేతలు గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Published : 15 May 2024 06:14 IST

అద్దంకి అత్యధికం.. రేపల్లె అత్యల్పం
చివరి గంటలో పోటెత్తిన ఓటర్లు
బాపట్ల, న్యూస్‌టుడే

తెదేపా, వైకాపా అభ్యర్థులు సోమవారం జరిగిన పోలింగ్‌ సరళిపై పోలింగ్‌ కేంద్రాల వారీగా విశ్లేషణ చేసుకున్నారు. జిల్లాలో బాపట్ల లోక్‌సభతో పాటు అన్ని అసెంబ్లీ స్థానాలు దక్కించుకుంటామని తెదేపా కూటమి నేతలు గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్‌ తమకు సానుకూలంగా జరిగిందని ఆనందంలో ఉన్నారు. ఎన్నికల్లో పోలింగ్‌ జరిగిన తీరు చూసి వైకాపా నేతలు, శ్రేణులు డీలాపడ్డారు. బాపట్ల పట్టణంలో అయితే పోలింగ్‌ కేంద్రాల వద్ద ఏడెనిమిది చోట్ల తప్పా చాలాచోట్ల వైకాపా నేతల జాడే కనిపించలేదు.

సార్వత్రిక ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. చీరాల, పర్చూరు, వేమూరు నియోజకవర్గాల్లో సోమవారం అర్ధరాత్రి 12 గంటల వరకు పోలింగ్‌ కొనసాగింది. సాయంత్రం ఐదు గంటల తర్వాత పది శాతానికి పైగా పోలింగ్‌ జరగడం విశేషం. జిల్లాలో అత్యధికంగా అద్దంకి నియోజకవర్గంలో 86.75 శాతం పోలింగ్‌ జరిగింది. అత్యల్పంగా రేపల్లె నియోజకవర్గంలో 78.16 శాతానికి పోలింగ్‌ పరిమితమైంది. జిల్లావ్యాప్తంగా 82.33 శాతం పోలింగ్‌ జరిగినట్లు అధికారులు ప్రకటించారు. అయితే అధికారికంగా పోలింగ్‌ కేంద్రాల వారీగా నమోదైన ఓట్ల వివరాలను వెల్లడించాల్సి ఉంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పోస్టల్‌ బ్యాలెట్ ఓట్లు కలిపిన తర్వాత తుది పోలింగ్‌ శాతం ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఓటర్లు భారీగా పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి ఓట్లు వేయడంతో ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని, విజయం తమదేనని తెదేపా కూటమి నేతలు గట్టి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

చీరాల నియోజకవర్గంలో చివరిలో పుంజుకున్న పోలింగ్‌

జిల్లాలో మిగతా ఐదు నియోజకవర్గాలతో పోలిస్తే చీరాల అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్‌ నెమ్మదిగా సాగింది. సాయంత్రం ఐదు గంటల వరకు 64.53 శాతం పోలింగ్‌ జరిగింది. పేరాల, ఇతర ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు పోలింగ్‌ సాగింది. పోలింగ్‌ ముగిసే సమయానికి 83.32 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. చివరిలో 19 శాతానికి పైగా పోలింగ్‌ జరగడం గమనార్హం. చీరాల పట్టణంలో వచ్చిన ఓట్లు అభ్యర్థుల జయాపజయాలను ప్రభావితం చేయనున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గంలో సాయంత్రం ఐదు తర్వాత 10.69 శాతం ఓటర్లు ఓటు వేశారు. సాయంత్రం ఆరు తర్వాత పోలింగ్‌ కొనసాగి వేమూరులో పది శాతం, రేపల్లెలో ఏడు శాతం, బాపట్లలో ఎనిమిదిన్నర శాతం, పర్చూరులో ఏడున్నర శాతం ఓటర్లు ఓటు వేయటం విశేషం. పర్చూరు మండల కేంద్రంలోని 139, 138 పోలింగ్‌బూత్‌లు, యద్దనపూడి ఎస్సీ కాలనీ, పోలూరు, మార్టూరు మండలం కోలలపూడి, జొన్నతాళి, కారంచేడు మండలంలో, వేమూరు మండలం పెరవలిపాలెం 128వ పోలింగ్‌బూత్‌లలో సోమవారం అర్ధరాత్రి వరకు పోలింగ్‌ జరిగింది. ఈవీఎంలు మొరాయించటం, వర్షం కురిసి కరెంటు సరఫరాలో అంతరాయం, ఘర్షణలు కారణంగా పోలింగ్‌ ఆగటం తదితర కారణాలతో పోలింగ్‌ ప్రక్రియ జాప్యమైంది. అసెంబ్లీ నియోజకవర్గాల పోలింగ్‌ కేంద్రాల నుంచి ఈవీఎంలు బాపట్ల ఇంజినీరింగ్‌ కళాశాలలోని స్ట్రాంగ్‌ రూమ్‌లకు మంగళవారం తెల్లవారుజామున చేరుకున్నాయి. పార్టీ అభ్యర్థులు, ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్‌ రూమ్‌లకు అధికారులు సీలు వేశారు. జూన్‌ నాలుగో తేదీ ఉదయం సీలు తీసి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అప్పటి వరకు స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.

భారీగా తరలివచ్చిన నారీమణులు

సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయడానికి మహిళలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. పోలింగ్‌లో ఉత్సాహంగా పాల్గొని ఓట్లు వేశారు. ఏ పోలింగ్‌ కేంద్రం చూసినా నారీమణుల సందడే కనిపించింది. క్యూలైన్‌లో రెండు గంటలకుపైగా ఓపికగా వేచి ఉన్నారు. పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్ల పోలింగ్‌ ఎక్కువ శాతం జరిగింది. యువత సైతం భారీగా తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహిళలు, యువత తమకే ఓట్లు వేశారని తెదేేపా కూటమి నేతలు విశ్వాసంతో ఉన్నారు. 2019లో జిల్లాలో 86 శాతం పోలింగ్‌ జరిగింది. సోమవారం అర్ధరాత్రి వరకు జిల్లాలో 82.33 శాతం పోలింగ్‌ జరిగినట్లు అధికారులు ప్రకటించారు. పోస్టల్‌ బ్యాలెట్ ఓట్లు కలిపితే పోలింగ్‌ 86 శాతం దాటుతుందని, గతంలో కన్నా ఈసారి ఎక్కువగా పోలింగ్‌ జరిగిందని అధికార వర్గాలు అంటున్నాయి. భారీ పోలింగ్‌ ప్రభుత్వ వ్యతిరేకతను స్పష్టం చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని