logo

పొన్నూరు అభివృద్ధిపై నోరువిప్పని జగన్‌

పట్టణంలోని రేపల్లె బస్టాండ్‌ వద్ద నిర్వహించిన సభలో సీఎం జగన్‌ పొన్నూరు నియోజకవర్గ అభివృద్ధి, సమస్యలపై  స్పందించకపోవడంపై ప్రజలు నిరాశ చెందారు.

Updated : 30 Apr 2024 07:14 IST

సీఎం ప్రసంగం విమర్శలకే పరిమితం

పొన్నూరు సభలో మాట్లాడుతున్న సీఎం జగన్‌

పొన్నూరు, న్యూస్‌టుడే: పట్టణంలోని రేపల్లె బస్టాండ్‌ వద్ద నిర్వహించిన సభలో సీఎం జగన్‌ పొన్నూరు నియోజకవర్గ అభివృద్ధి, సమస్యలపై  స్పందించకపోవడంపై ప్రజలు నిరాశ చెందారు. కూటమి నాయకులపై అవే మాటలు, అవే విమర్శలతో సరిపెట్టారు. సీఎం ప్రసంగంలో పసలేకపోవడంతో జనాన్ని ఆకట్టుకోలేకపోయారు. రాష్ట్ర రాజకీయాలపై ఆయన ఎక్కువ సేపు మాట్లాడారు. సీఎం వేదికకు రాకముందే పార్లమెంటు, అసెంబ్లీ అభ్యర్థులు ప్రసంగించారు. గుంటూరు పార్లమెంటు వైకాపా అభ్యర్థి కిలారి వెంకటరోశయ్య మాట్లాడుతూ తమ హయాంలో పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు. పొన్నూరు నియోజకవర్గంలో ప్రధాన సమస్యలను పరిష్కరించామన్నారు. పొన్నూరు అసెంబ్లీ వైకాపా అభ్యర్థి అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు.

ప్రధాన కూడలిలో నిలువ నీడ లేక జనం ఇబ్బందులు

జనం లేక బోసిపోయిన సభ

సీఎం సభకు అనుకున్న మేర జనం హాజరుకాకపోవడంతో వెలవెలబోయింది. సమావేశానికి హాజరైన ఆ కొంత మందికి రూ.300 నుంచి రూ.500 వరకు వైకాపా నేతలు ఇచ్చారు. డబ్బుల పంపకాలు చేసినా జనం అశించిన మేర హాజరుకాలేదు. సీఎం ప్రసంగం ఆకట్టుకునే విధంగా లేకపోవడంతో కొంత సమయానికే ప్రజలు వెనుతిరిగారు. సభ 3 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా జనం లేకపోవడంతో ఆయన వేదిక వద్దకు 4 గంటలకు చేరుకున్నారు.

రేపల్లె మార్గంలో రోడ్డుపై చేరిన నీటితో అవస్థలు పడుతూ వెళ్తున్న వాహనదారులు

సారొచ్చె.. కష్టాలు తెచ్చె

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన సందర్భంగా పొన్నూరు పట్టణంలో సోమవారం ట్రాఫిక్‌ ఆంక్షలతో వాహనదారులు, ప్రజలు అడుగడుగునా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సీఎం రాకను పురస్కరించుకొని విద్యుత్తుశాఖ అధికారులు ఎర్త్‌ కోసం రేపల్లె మార్గంలో పొక్లెయిన్‌తో గుంత తవ్వుతుండగా తగిలి రెండు ప్రధాన పైపులైన్లు పగిలిపోయాయి. నీరంతా రహదారిపైకి చేరి చెరువులా మారింది. పైపులైన్ల మరమ్మతుల కోసం మంగళవారం నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఇంజినీరింగ్‌ అధికారులు వెల్లడించారు. గుంటూరు నుంచి నారాకోడూరు మీదుగా తెనాలి పోయే వాహనాలను నిలిపివేసి.. వాటిని పెదకాకాని మండలం ఉప్పలపాడు నుంచి నందివెలుగు మీదుగా తెనాలికి మళ్లించారు. బాపట్ల నుంచి గుంటూరుకు వెళ్లే వాహనాలను పెదనందిపాడు మీదుగా మళ్లించారు. దూరభారం పెరిగిందని వాహనదారులు వాపోయారు. పొన్నూరు మండలం చింతలపూడి వద్ద, పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసి ద్విచక్ర వాహనాల వాహనాల రాకపోకలను నిలిపివేశారు. జనసంచారం లేకపోవడంతో వైకాపా నాయకుల సిఫార్సు మేరకు పొన్నూరు ఆర్టీసీ డిపో వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లును పోలీసులు తొలగించారు. పట్టణ పరిధి జీబీసీ రహదారిలో 10 వైద్యశాలలు ఉన్నాయి. ఈ మార్గంలో ట్రాఫిక్‌ ఆంక్షల వల్ల రాకపోకలు సాగించేందుకు రోగుల కుటుంబ సభ్యులు అనేక కష్టాలు పడ్డారు. వైద్యశాల ప్రాంగణం దాటి 4 గంటలపాటు బయటకు వెళ్లనీయకుండా పోలీసులు ఆదేశాలు జారీ చేయడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని