logo

Crime News: బంజారాహిల్స్‌ యాక్సిడెంట్‌.. అతివేగంతోనే ‘దారు’ణం!

బంజారాహిల్స్‌లో   రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతికి కారకులైన నిందితులు రోహిత్‌గౌడ్‌, సోమన్‌ను గంటల వ్యవధిలో అరెస్ట్‌ చేశామని కొత్వాల్‌ అంజనీకుమార్‌ తెలిపారు. కేసు వివరాలను బుధవారం బషీర్‌బాగ్‌లోని కమిషనర్‌ కార్యాలయంలో  మీడియాకు వెల్లడించారు.

Updated : 09 Dec 2021 09:39 IST

వివరాలు వెల్లడిస్తున్న సీపీ అంజనీకుమార్‌

ఈనాడు, హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లో రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతికి కారకులైన నిందితులు రోహిత్‌గౌడ్‌, సోమన్‌ను గంటల వ్యవధిలో అరెస్ట్‌ చేశామని కొత్వాల్‌ అంజనీకుమార్‌ తెలిపారు. కేసు వివరాలను బుధవారం బషీర్‌బాగ్‌లోని కమిషనర్‌ కార్యాలయంలో  మీడియాకు వెల్లడించారు. రోహిత్‌గౌడ్‌ (ఉప్పల్‌), వెదుళ్ల సాయి సోమన్‌రెడ్డి (కర్మన్‌ఘాట్‌) స్నేహితులు. స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలకు ఇద్దరు మాదాపూర్‌లోని ఆలివ్‌ బ్రిస్టా పబ్‌కు సాయంత్రం వెళ్లి రాత్రి 10 గంటల వరకూ మద్యం తాగారు. తరువాత జూబ్లీహిల్స్‌లోని ఫ్యాట్‌ పీజియన్‌ పబ్‌కు రాత్రి 10.30 గంటలకు వచ్చి అర్ధరాత్రి 12 గంటల వరకూ తాగారు. ఆ తరువాత బంజారాహిల్స్‌లోని రాడిసన్‌ బ్లూ హోటల్లో 12.20 గంటల నుంచి అర్ధరాత్రి 1.19 గంటల వరకూ మళ్లీ తాగారు. తర్వాత ఇద్దరూ పోర్షే కారులో వెళుతూ ప్రమాదం చేశారు. తరువాత జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌-5లో రోహిత్‌ స్నేహితులుంటున్న పద్మావతీ రెసిడెన్స్‌ సెల్లార్‌లో కారు పార్కింగ్‌ చేసి వెళ్లిపోయారు. పోలీసుల హడావుడి తగ్గిందనుకుని గంట తర్వాత కారును తీసుకునేందుకు మరో కారులో వచ్చారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులిద్దరికీ శ్వాస పరీక్షలు నిర్వహించగా రోహిత్‌కు 70 మి.గ్రా, సోమన్‌కు 58 మి.గ్రా ఆల్కాహాల్‌ శాతం వచ్చింది. విషయం తెలిసి ఓ ఎమ్మెల్యే ఠాణాకు వచ్చారని పశ్చిమ మండలం సంయుక్త కమిషనర్‌ ఎ.ఆర్‌.శ్రీనివాస్‌ తెలిపారు. నిందితుల్లో ఒకరి తండ్రి ఎమ్మెల్యేకు స్నేహితుడని, ప్రమాదం తీరును తెలుసుకునేందుకు వచ్చి వెళ్లిపోయారని వివరించారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని