logo

Hyderabad News: ఎత్తిన జెండాలను ఏం చేద్దాం

జాతీయ జెండా అంటే దేశపు గౌరవం, కీర్తి పతాక. ఎగరేయాలన్నా, అవనతం చేయాలన్నా అనేక నియమాలు పాటించాల్సిందే. ఇప్పుడు ఆ నిబంధనల అమలుపై గ్రేటర్‌లో ఆందోళన మొదలైంది. జీహెచ్‌ఎంసీ అధికారులు నగరవ్యాప్తంగా 20లక్షల జెండాలను పంపిణీ చేశారు.

Updated : 17 Aug 2022 08:45 IST

పంద్రాగస్టు ముగియడంతో ఏమవుతాయోననే ఆందోళన

ఈనాడు, హైదరాబాద్‌: జాతీయ జెండా అంటే దేశపు గౌరవం, కీర్తి పతాక. ఎగరేయాలన్నా, అవనతం చేయాలన్నా అనేక నియమాలు పాటించాల్సిందే. ఇప్పుడు ఆ నిబంధనల అమలుపై గ్రేటర్‌లో ఆందోళన మొదలైంది. జీహెచ్‌ఎంసీ అధికారులు నగరవ్యాప్తంగా 20లక్షల జెండాలను పంపిణీ చేశారు. పౌరులు సైతం పెద్దఎత్తున జాతీయ పతాకాలను వ్యక్తిగతంగా కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు వాటిని నిబంధనల ప్రకారం కనిపించకుండా చేయడం సవాలుగా మారింది. దిల్లీ, ముంబయి వంటి నగరాల్లో స్థానిక మున్సిపాలిటీలు ఉపయోగించిన జెండాలను సేకరించేందుకు స్వచ్ఛంద సంస్థలను, కాలనీ సంక్షేమ సంఘాలను, ఇతర సంస్థలను రంగంలోకి దించాయి. నగరంలోనూ అదే మాదిరి ఏర్పాట్లు చేయాలనే డిమాండ్‌ వినిపిస్తోంది.

ఇతర నగరాల్లో ఏం చేస్తున్నారంటే.. దిల్లీ మున్సిపల్‌ అధికారులు 2,500 కాలనీ సంక్షేమ సంఘాలతో ఏర్పాటైన ఐక్య కార్యాచరణ సమితి సభ్యులకు, సఫాయి కార్మికులకు ఆదేశాలిచ్చారు. కాలనీ సంఘాలు, కార్మికులు యుద్ధప్రాతిపదికన ప్రతి ఇంటికి వెళ్లి జెండాలను సేకరించి జోనల్‌ కంట్రోల్‌ రూముల్లో అందజేయాలని స్పష్టం చేశారు. ముంబయి నగర పాలక సంస్థ సైతం కాలనీ సంక్షేమ సంఘాలను, స్వచ్ఛంద సంస్థలను, పారిశుద్ధ్య విభాగానికి జెండాల సేకరణ బాధ్యత అప్పగించింది. సామాజిక మాధ్యమాల ద్వారా దిల్లీ, ముంబయి నగరపాలక సంస్థలు ప్రచారం ప్రారంభించాయి.

జీహెచ్‌ఎంసీ స్పందించాలంటూ.. ఇంటిపై ఎగరేసిన జెండాను ఎప్పుడు దించాలి, ఎలా విసర్జనం చేయాలనే సూచనలు నగరవాసులకు అందలేదు. జీహెచ్‌ఎంసీ ఆ విషయంలో మౌనం ప్రదర్శిస్తోంది.

నియమావళి ఏం చెబుతోంది.. జాతీయ పతాక నియమావళిలో జులై 20, 2022న కేంద్ర సర్కారు పలు సవరణలు చేసింది. వాటి ప్రకారం పగలు, రాత్రి తేడా లేకుండా ఎన్ని రోజులైనా జాతీయ పతాకాన్ని పౌరులు ఎగురవేయొచ్ఛు గౌరవభావంతో, జెండాకు ఎలాంటి అవమానం కలగకుండా, చిరిగిన స్థితిలో జెండాను ఎగరవేయకుండా, ఇతరత్రా నియమాలను అనుసరించడం మాత్రం తప్పనిసరి. జెండాను అవమానిస్తే మొదటి తప్పునకు మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా ఉంటాయి. అలాగే.. ఎగరేసిన జెండాను ఎలా దించాలి, దించాక ఏం చేయాలి, ఇంట్లో భద్రపరచలేని పరిస్థితిలో పౌరుడు ఆ జెండాను ఎలా విసర్జనం చేయాలనే నిబంధనలు సైతం నియమావళిలో ఉన్నాయి. జాతీయ పతాకాన్ని ధ్వజ స్తంభం నుంచి దించాక.. పద్ధతి ప్రకారం తప్పనిసరిగా మడతపెట్టాలి. ఇలా మడత పెట్టిన జెండాను ఇంట్లో గౌరవంగా భద్రపరచవచ్ఛు లేదా గోప్యంగా భూమిలో పాతి పెట్టడం, నిప్పులో కాల్చడం ద్వారా విసర్జనం చేయొచ్చు.

భూమిలో పాతి పెడుతున్నారా?.. ముందుగా మడతపెట్టి జెండాలను చెక్క పెట్టెలో దాచాలి. చెక్క పెట్టెను గోప్యంగా, శుభ్రంగా ఉన్న నేలపై తీసిన గుంతలో పాతి పెట్టవచ్చు.

నిప్పు పెడుతున్నారా?.. పరిశుభ్రంగా ఉన్న నేలపై ముందుగా నిప్పు రాజేయాలి. మంటల మధ్యలో మడతపెట్టిన జెండాలను వేయాలి. మడతపెట్టకుండా మంటల్లో వేయడం, భూమిలో పాతిపెట్టడం నేరమవుతుంది. విసర్జనం పూర్తయ్యాక అక్కడున్న వారు కాసేపు మౌనం పాటించి త్రివర్ణ పతాకానికి గౌరవం చాటాలి.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని