logo

సమాజ భాగస్వామ్యం.. తొలిమెట్టుకు ఊతం

కరోనా అనంతరం ప్రాథమిక విద్యను బలోపేతం చేయటానికి 2022 ఆగస్టు 15 నుంచి కేంద్ర ప్రభుత్వం ‘మౌలిక భాషాగణిత సామర్థ్యాల సాధన’ (ఎఫ్‌ఎల్‌ఎన్‌) కార్యక్రమాన్ని ప్రారంభించగా తెలంగాణలో ‘తొలిమెట్టు’ పేరుతో అమలు చేస్తున్నారు.

Published : 09 Feb 2023 01:57 IST

ముగ్గురు ఉపాధ్యాయులకు శిక్షణ
స్వచ్ఛంద కార్యకర్తలకూ చోటు

మదన్‌పల్లితండాలో లెక్కలు నేర్పిస్తున్న ఉపాధ్యాయుడు

న్యూస్‌టుడే, బొంరాస్‌పేట: కరోనా అనంతరం ప్రాథమిక విద్యను బలోపేతం చేయటానికి 2022 ఆగస్టు 15 నుంచి కేంద్ర ప్రభుత్వం ‘మౌలిక భాషాగణిత సామర్థ్యాల సాధన’ (ఎఫ్‌ఎల్‌ఎన్‌) కార్యక్రమాన్ని ప్రారంభించగా తెలంగాణలో ‘తొలిమెట్టు’ పేరుతో అమలు చేస్తున్నారు. ప్రస్తుతం పాఠశాల విద్యలో ‘సమాజ భాగస్వామ్యం’ పెంచటమే ధ్యేయంగా తొలిమెట్టుకు అదనపు బలాన్ని అందిస్తున్నారు. ఇందులో భాగంగా విద్యార్థుల సామర్థ్యాలను మరింత పెంచటానికి జిల్లా నుంచి ముగ్గురు ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు.  

ఒకటి నుంచి ఐదో తరగతి వరకు..

తొలిమెట్టు ద్వారా ఏడాది నుంచి విద్యార్థుల్లో పురోగతి కనిపించటంతో ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి సమాజ భాగస్వామ్యం పెంచటానికి కృషి చేస్తోంది. దీనికోసం విద్యార్థులు, తరగతుల సంఖ్యకు అనుగుణంగా ‘స్వచ్ఛంద కార్యకర్తలను’ (వాలంటీర్లు) నియమించనున్నారు. కార్యక్రమం అమలుకు జిల్లాలోని ధారూర్‌ మండలం స్టేషన్‌ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు నర్సింహ రాజు, వికారాబాద్‌ మండలం కొట్టంగట్టు ప్రాథమిక పాఠశాల నుంచి నాగరాజు, కుల్కచర్ల మండలం ఆముదాలగడ్డ తండా పాఠశాల నుంచి అపర్ణ ఇలా ముగ్గురికి శిక్షణ ఇచ్చారు. వీరంతా పొదుపు సంఘాల మహిళలు, విద్యావంతులు, విశ్రాంత ఉపాధ్యాయులు, ఉద్యోగులను కార్యకర్తలుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తమిళనాడు తరహాలో..

సమాజపరంగా ఎలాంటి సహకారం అందించే అవకాశాలున్నాయో తమిళనాడు తరహాలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, వాలంటీర్లు అనుశీలన చేస్తారు. గైర్హాజరవుతున్న విద్యార్థుల వివరాలను సేకరిస్తారు. విద్యార్థులను బడికి పంపే విధంగా తల్లులకు అవగాహన కల్పించాలని పొదుపు సంఘాల సభ్యులకు సూచిస్తారు. పాఠశాలలో సదుపాయాలు కల్పించడం, ప్రతి అవసరానికి ప్రభుత్వంపై ఆధారపడకుండా సమాజం నుంచి సమాకూర్చేలా స్వచ్ఛంద కార్యకర్తలు దాతల సహకారం తీసుకుంటారు.  


సామర్థ్యాల పెంపే లక్ష్యం..

రవికుమార్‌, విద్యాశాఖ సెక్టోరియల్‌ అధికారి, వికారాబాద్‌

ప్రాథమిక స్థాయిలోని చిన్నారుల్లో సామర్థ్యాలను పెంచటమే లక్ష్యంగా విద్యాశాఖ కృషి చేస్తోంది. తొలిమెట్టుతో ప్రగతి కనిపించటంతో స్వచ్ఛందంగా బడుల బాగుకు ఆలోచించే వారి సేవలను వినియోగించుకునేందుకు సిద్ధమయ్యారు. అందుకు సమన్వయం చేయటానికి జిల్లా నుంచి ముగ్గురు ఉపాధ్యాయులకు ఇప్పటికే శిక్షణ పూర్తయ్యింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని